తెలుగు రాష్ట్రాల మధ్య కుదరని సయోధ్య
50:50 శాతం నిష్పత్తితో కేటాయించాలి: తెలంగాణ
66:34 శాతం నిష్పత్తి చాలు: ఏపీ
రానున్న బోర్డు సమావేశంలోనే చర్చించాలని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జలాశయాల్లో నిల్వ ఉన్న నీటి పంపిణీపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. శుక్రవారం నీటి పంపిణీపై జరిగిన కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) త్రీసభ్య కమిటీ రెండో సమావేశంలోనూ ఏపీ, తెలంగాణ మధ్య సయోధ్య కుదరలేదు. కృష్ణాబోర్డు మెంబర్ సెక్రటరీ సతీశ్‌కంబోజ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) రమేశ్‌బాబు, ఏపీ ఈఎన్సీ(ఇరిగేషన్) నరసింహమూర్తి పాల్గొన్నారు. దాదాపు రెండున్నర గంటలకు పైగా సమావేశం జరగ్గా.. నీటి పంపిణీపై సయోధ్య కుదరకపోవడంతో సెపె్టంబరు మూడో వారంలో జరగనున్న బోర్డు సమావేశంలోనే చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇదీ తెలంగాణ వాదన
ప్రస్తుత నీటి సంవత్సరంలో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నుంచి 200 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు కేటాయించాలని తెలంగాణ పట్టుబట్టింది. ప్రస్తుతం జలాశయాల్లో అందుబాటులో ఉన్న జలాలను 50:50 శాతం నిష్పత్తితో పంచాలని డిమాండ్ చేసింది. ఏపీ, తెలంగాణ మధ్య 66: 34 నిష్పత్తిలో నీళ్ల పంపిణీకి ఏపీ పట్టుబట్టగా, తెలంగాణ అంగీకరించబోమని స్పష్టం చేసింది.
⇒ పెన్నా బేసిన్లో 80 టీఎంసీలకు పైగా నిల్వలున్నాయని, పోతిరెడ్డిపాడు నుంచి 19 టీఎంసీలు, చెన్నై తాగునీటి అవసరాలకు 15 టీఎంసీలు కలుపుకొని 34 టీఎంసీలు మాత్రమే తరలించాల్సి ఉండగా, ఇప్పటిదాకా పోతిరెడ్డిపాడు నుంచి 25.91 టీఎంసీలను ఏపీ తరలించిందని తెలంగాణ అభ్యంతరం తెలిపింది. ఏపీ, తెలంగాణ మధ్య 50.50 నిష్పత్తిలో నీటి పంపిణీ ఆధారంగా, ఏపీకి ఇంకా 36.37 టీఎంసీల వాటా మాత్రమే మిగిలి ఉందని తేల్చి చెప్పింది. కృష్ణా పరీవాహకం వెంట 2 కోట్ల మంది జనాభా తాగునీటి అవసరాలు తీర్చాల్సి ఉందని, 2027 మే 31 దాకా 200 టీఎంసీలను తాగు నీటికి కేటాయించాలని పట్టుబట్టింది. సాగర్‌కు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గానే శ్రీశైలం ఉందని గుర్తు చేసింది. దీనిపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఇదీ ఏపీ వాదన...
తాగునీటి అవసరాలు లేనప్పటికీ సాగర్ ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేసిందని ఏపీ ప్రత్యారోపణలు చేసింది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి వాటాకు లోబడి నీటిని తరలిస్తున్నామని, అంతకు మించి తరలించడం లేదని తెలిపింది. తమ తాగునీటి అవసరాల కోసం 2027 ఆగస్టు దాకా 104 టీఎంసీల నీటిని కేటాయించాలని ఏపీ పట్టుబట్టింది. తెలంగాణ ఏ విధంగా 200 టీఎంసీల నీటిని కావాలని కోరుతుందో లెక్కలను తెలపాలని కోరింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో కనీస నీటిమట్టంపైన 139.28 టీఎంసీల నీటి లభ్యత మాత్రమే ఉందని, ఆ జలాలను 66 శాతం ఏపీకి, 34 శాతం తెలంగాణకు కేటాయించాలని కోరింది.
తెలంగాణ 39.49 శాతం, ఏపీ 60.51 శాతం వినియోగం
ఇప్పటివరకు 111.96 టీఎంసీల కృష్ణా జలాల వినియోగం జరగ్గా, అందులో తెలంగాణ 39.49 శాతం (44.216 టీఎంసీలు).. ఏపీ 60.51 శాతం (67.75 టీఎంసీల) నీటిని వాడుకున్నట్టు కృష్ణా బోర్డు తెలిపింది. ఈనెల 3వ తేదీ దాకా శ్రీశైలం నుంచి 29.91 టీఎంసీలను ఏపీ తరలించగా, తెలంగాణ 8.71 టీఎంసీలను తరలించింది. సాగర్ నుంచి తెలంగాణ 13.877 టీఎంసీలు తరలించగా, ఏపీ 11.36 టీఎంసీలు తరలించింది.


