షూటింగ్‌లో భారత్‌కు తొలి స్వర్ణం
పసిడి సాధించిన సురుచి–కమల్‌జీత్ జోడీ
రజతంతో మెరిసిన అథ్లెట్ గుల్వీర్ సింగ్
మన బృందం ఖాతాలో మరో 3 కాంస్యాలు
ప్రస్తుతం 23 పతకాలతో 12వ స్థానం
ఆసియా క్రీడల్లో భారీ సంఖ్యలో పతకాలు వస్తాయని ఆశించిన షూటింగ్‌లో ఒక్కో రోజు గడుస్తున్నకొద్దీ నిరాశ పెరుగుతూ వచ్చింది. అంచనాలు పెట్టుకున్న స్టార్లంతా విఫలం కావడంతో గత క్రీడల 22 పతకాలకు దరిదాపుల్లోకి కూడా వచ్చే పరిస్థితి కనిపించలేదు. ఎట్టకేలకు రజత, కాంస్యాలు దక్కినా... పసిడి మాత్రం దూరంగా ఉండిపోయింది. కానీ శుక్రవారం భారత్‌కు ఆ లోటు తీరింది. సురుచి సింగ్–కమల్‌జీత్ జోడీ షూటింగ్‌లో స్వర్ణ పతకాన్ని అందించి ఊరటనిచ్చింది. దీనికి తోడు మరో రజతం కూడా షూటర్ల ఖాతాలో చేరింది.
మరోవైపు అథ్లెటిక్స్‌లో లాంగ్‌డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్ తనపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ 10 వేల మీటర్ల విభాగంలో వెండి పతకంతో మెరిశాడు. మహిళా పోల్‌వాల్టర్ బరానికా ఇలంగోవన్, షాట్‌పుటర్ మన్‌ప్రీత్ కౌర్ కూడా కాంస్యాలు అందించారు. టేబుల్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో మనుశ్ షా–దియా చిటాలె ద్వయం కాంస్యం గెలవడంతో ఆసియా క్రీడల ఆరో రోజును భారత్ ఆరు పతకాలతో ముగించింది.
నగోయా: ఆసియా క్రీడల్లో భారత్ రెండో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు మహిళల టి20 క్రికెట్‌లో ఏకైక పసిడి దక్కగా, ఇప్పుడు షూటింగ్ ఆ జాబితాలో చేరింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు చెందిన సురుచి సింగ్–కమల్‌జీత్ ద్వయం స్వర్ణం గెలుచుకుంది. ఫైనల్లో భారత జంట మొత్తంగా 484.6 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. సురుచి 245.7 పాయింట్లు స్కోర్ చేయగా, కమల్‌జీత్ 238.9 పాయింట్లు నమోదు చేశాడు. క్వాలిఫయింగ్‌లో తొలి స్థానంతో ఫైనల్స్‌కు అర్హత సాధించిన భారత జంట చివరి వరకు అదే జోరును కనబర్చడంలో సఫలమైంది. దక్షిణ కొరియా (478.0 పాయింట్లు) రజతం సాధించగా, ఇరాన్ (415.8)కు కాంస్యం దక్కింది.
ఆధిక్యం కోల్పోయి...
షూటింగ్‌లో భారత్ మరో స్వర్ణం గెలుచుకునే ప్రయత్నంలో హోరాహోరీగా తలపడినా... చివరకు రెండో స్థానానికే పరిమితమైంది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు రజతం లభించింది. మన త్రయం ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్, రుద్రాంక్ష్ పాటిల్, నీరజ్ కుమార్ ఓవరాల్‌గా 1762 పాయింట్లు సాధించారు. వీటిలో ఐశ్వర్య ప్రతాప్ 589, నీరజ్ 588, రుద్రాంక్ష్ 585 పాయింట్లు స్కోర్ చేశారు. చైనా (1766 పాయింట్లు) స్వర్ణం గెలుచుకోగా, దక్షిణ కొరియాకు (1751 పాయింట్లు) కాంస్యం లభించింది.

ఒకదశలో ఇక్కడి ప్రదర్శనను బట్టే వ్యక్తిగత విభాగంలో ఫైనల్స్‌కు కూడా షూటర్లు అర్హత సాధిస్తారు. దాంతో మూడో స్థానంతో ఐశ్వర్య ప్రతాప్, నాలుగో స్థానంతో నీరజ్ ఫైనల్ చేరారు. 9వ స్థానంతో నిలిచిన రుద్రాంక్ష్ ముందంజ వేయడంలో విఫలమయ్యాడు. అయితే వ్యక్తిగత ఫైనల్లో భారత షూటర్లు నిరాశపర్చారు. క్వాలిఫయింగ్‌లో ప్రదర్శనను పునరావృతం చేయలేక నీరజ్ 8వ స్థానంలో, ఐశ్వర్య ప్రతాప్ ఐదో స్థానంలో నిలిచి నిష్క్రమించారు.
కమల్ కా కమాల్...
కమల్‌జీత్ విజయం కూడా సరిగ్గా ఇదే తరహాలో రెండు ఓటముల తర్వాతే వచ్చింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో 9వ స్థానంతో ఫైనల్ అవకాశాలు చేజారగా, టీమ్ ఈవెంట్‌లో జట్టు నాలుగో స్థానానికి పరిమితమైంది. తొలిసారి పాల్గొన్న ఆసియా క్రీడల్లో పతకం లేకుండానే నిష్క్రమిస్తానని భయపడ్డానని, అయితే తన ఆటకు తోడు అదృష్టం కూడా కలిసొచ్చిందని కమల్‌జీత్ చెప్పాడు. నిజానికి మిక్స్‌డ్ ఈవెంట్‌లో సురుచితో పాటు కేదార్లింగ్ బరిలోకి దిగాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో అతడిని తప్పించి కమల్‌జీత్‌కు కోచ్ సమరేశ్ జంగ్ అవకాశం ఇచ్చాడు. దాంతో తనను తాను కచ్చితంగా నిరూపించుకోవాల్సిన స్థితిలో అతను నిలిచాడు.
హరియాణాలోని రేవారికి చెందిన 23 ఏళ్ల కమల్‌జీత్ మెరుగ్గానే ఆరంభించినా... చివరికొచ్చేసరికి కాస్త తడబడ్డాడు. అయితే సురుచి స్కోరు కారణంగా ఇద్దరికీ స్వర్ణం దక్కింది. ఏడేళ్ల క్రితం షూటింగ్ మొదలు పెట్టిన కమల్‌జీత్ 2023లో భారత జట్టులో అవకాశం దక్కించుకున్నాడు. అదే ఏడాది తాను ప్రయాణిస్తున్న ఆటోకు ప్రమాదం జరగడంతో కాలుకు తీవ్ర గాయమైన అతను కోలుకునేందుకు చాలా సమయం పట్టింది. ఇటీవలే ఆర్మీలో హవల్దార్‌గా చేరిన అతను ఇప్పుడు పసిడి పతకంతో వెనుదిరుగుతున్నాడు.
స్వర్ణం ‘సురుచి’కరం...
10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో 26వ స్థానం... టీమ్ విభాగంలో త్రుటిలో పతకం చేజారి నాలుగో స్థానంతో సరి... ఈ ఆసియా క్రీడల్లో రెండు వైఫల్యాల తర్వాత శుక్రవారం తీవ్ర ఒత్తిడి మధ్య సురుచి బరిలోకి దిగింది. 20 ఏళ్ల వయసులో ఆమె ఖాతాలో ఇప్పటికే వరల్డ్ చాంపియన్‌షి ప్ రజతం, వరల్డ్ కప్ ఫైనల్ స్వర్ణం, 5 వరల్డ్ కప్ స్వర్ణాలు, గత ఏడాదే వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌లాంటివి ఉన్నాయి. ఇలాంటి రికార్డు కారణంగా భారీ అంచనాలతో బరిలోకి దిగిన సురుచి రెండు ఈవెంట్ల వైఫల్యంతో భారత షూటింగ్ మేనేజ్‌మెంట్ నుంచి కూడా విమర్శలు ఎదుర్కొంది. కానీ ఇప్పుడు తన ప్రదర్శనతోనే ఆమె వాటికి సమాధానం ఇచ్చింది.
ఈ క్రీడల షూటింగ్‌లో భారత్‌కు తొలి స్వర్ణం అందించిన ప్లేయర్‌గా సురుచి నిలిచింది. క్వాలిఫికేషన్‌లో 295 పాయింట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన 296 పాయింట్లు స్కోర్ చేసిన ఆమె... ఫైనల్లో 246 పాయింట్ల లక్ష్యంతో గురి పెట్టి అతి చేరువగా 245.7 పాయింట్లు సాధించగలిగింది. అయితే స్వర్ణం గెలుచుకోవడానికి ఇది సరిపోయింది. హరియాణాలోని ఝఝర్ జిల్లాకు చెందిన సురుచి తన ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేసింది. ‘ఎలాగైనా స్వర్ణమే సాధించాలని బరిలోకి దిగాను. నా ప్రదర్శన పట్ల చాలా ఆనందంగా ఉన్నా. గత రెండు వైఫల్యాలను నా మనసులోంచి చెరిపేసి కొత్తగా మొదలు పెట్టా. నీకు మరో అవకాశం ఉందంటూ కోచ్‌లు స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆ ఫలితం కనిపించింది’ అని సురుచి వ్యాఖ్యానించింది.
కాంస్యం నుంచి రజతానికి...
భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్ గత ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచాడు. ఈసారి అంతకంటే మెరుగైన ప్రదర్శనతో అతను రజతాన్ని తన ఖాతాలో వేసుకోవడం విశేషం. గత రెండేళ్లుగా అద్భుతమైన ఫామ్‌లో ఉన్న గుల్వీర్ అంచనాలను అందుకోవడంలో సఫలమయ్యాడు. 10 వేల మీటర్ల పరుగును గుల్వీర్ 28 నిమిషాల 28.38 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు.

బిర్హాను బలెవ్ (బహ్రెయిన్; 28 నిమిషాల 27.51 సెకన్లు) స్వర్ణ పతకం సాధించగా, ఆల్బర్టో కిప్టో (బహ్రెయిన్; 28 నిమిషాల 34.18 సెకన్లు)కు కాంస్యం దక్కింది. ఇటీవల జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో కూడా గుల్వీర్ 10 వేల మీటర్ల పరుగులో రజతం, 5 వేల మీటర్ల పరుగులో కాంస్యం అందుకున్నాడు. ఆర్మీలో నాయబ్ సుబేదార్‌గా పని చేస్తున్న గుల్వీర్ పేరిటే ఈ రెండు ఈవెంట్లలో జాతీయ రికార్డులు ఉన్నాయి. 5 వేల మీటర్ల పరుగును 13 నిమిషాల్లోపు పూర్తి చేసిన తొలి భారత అథ్లెట్‌గా అతను గుర్తింపు పొందాడు.
36 ఏళ్ల వయసులో...
రెండు దశాబ్దాల క్రితం ఆసియా జూనియర్ చాంపియన్‌షి ప్‌తో అంతర్జాతీయ కెరీర్ మొదలు... కానీ షాట్‌పుటర్ మన్‌ప్రీత్ కౌర్‌కు విజయాల పరంగా ఎలాంటి గుర్తింపూ రాలేదు. ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడల్లో మూడుసార్లు పాల్గొంటే 9వ, 7వ, 4వ స్థానాలు మాత్రమే దక్కాయి. గత ఆసియా క్రీడల్లో 5వ స్థానం లభిస్తే ఒలింపిక్స్‌లో 23వ స్థానం మాత్రమే! పైగా డోపింగ్ వివాదంతో నాలుగేళ్లపాటు నిషేధం కూడా ఎదుర్కొంది. కానీ పట్టువదలకుండా పోరాడిన ఆమె ఇప్పుడు ఆసియా క్రీడల్లో కాంస్యంతో మెరిసింది.

శుక్రవారం జరిగిన మహిళల షాట్‌పుట్ ఫైనల్స్‌లో ఇనుప గుండును 17.17 మీటర్లు విసిరి మన్‌ప్రీత్ మూడో స్థానంలో నిలిచింది. సంగ్ జియాయున్ (చైనా; 19.40 మీటర్లు) పసిడి పతకాన్ని అందుకోగా, జాంగ్ లిన్రు (చైనా; 18.14 మీటర్లు) రజత పతకం సాధించింది. జాతీయ ఇంటర్ స్టేట్ అథ్లెటిక్స్ చాంపియన్‌షి ప్‌లో ఆసియా క్రీడల అర్హత మార్క్‌ను అందుకొని ఈ పోటీలకు వచ్చిన మన్‌ప్రీత్ తన అత్యుత్తమ ప్రదర్శనతో పతకం సాధించి సగర్వంగా నిలిచింది. బార్బరా వెబ్‌స్టర్ (1951), కిరణ్ బలియాన్ (2023) తర్వాత ఆసియా క్రీడల మహిళల షాట్‌పుట్‌లో పతకం నెగ్గిన భారత అథ్లెట్‌గా ఆమె నిలిచింది.
బరానిక కొత్త చరిత్ర
భారత అథ్లెటిక్స్ చరిత్రలో శుక్రవారం కొత్త ఘనత నమోదైంది. ఆసియా క్రీడల చరిత్రలో పురుషుల, మహిళల విభాగాల్లో ఒక్కసారి కూడా పతకం లభించని పోల్‌వాల్ట్‌లో ఈసారి భారత క్రీడాకారిణి పోడియంపై నిలిచింది. తమిళనాడుకు చెందిన 29 ఏళ్ల బరానిక ఇలంగోవన్ ఈ ఘనత సాధించిన అథ్లెట్‌గా తన పేరును లిఖించుకుంది. మహిళల పోల్‌వాల్ట్ ఈవెంట్‌లో 4.15 మీటర్ల ఎత్తుకు ఎగిరిన బరానిక కాంస్యం సొంతం చేసుకుంది. కజకిస్తాన్‌కు చెందిన పొలీనా ఇవనోవా కూడా 4.15 మీటర్లు ఎగిరి భారత అథ్లెట్‌తో సమంగా నిలిచింది. ఇద్దరూ కూడా సరిగ్గా 4.25 మీటర్ల ప్రయత్నంలోనే విఫలమయ్యారు. దాంతో ఇద్దరికీ కాంస్యాన్ని ప్రకటించారు.

ఈ ఈవెంట్‌లో మిసాకి మొరోటా (జపాన్; 4.55 మీటర్లు) స్వర్ణాన్ని అందుకోగా, చుంగే నియు (చైనా; 4.50 మీటర్లు) రజతం గెలుచుకుంది. ఈ ఏడాది జాతీయ ఇండోర్ ఓపెన్ ఈవెంట్‌లో బరానిక 4.23 మీటర్లతో తన అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసింది. దీనిని అధిగమించలేకపోయినా... పతకం మాత్రం గెలుచుకోవడంలో ఆమె సఫలమైంది. ఆరేళ్ల క్రితం ఏసీఎల్ గాయంతో చాలా కాలం ఆటకు దూరమై కెరీర్ ప్రమాదంలో పడినా... 2023లో రిలయన్స్ హైపర్ఫార్మెన్స్ సెంటర్‌లో చేరడం ఆమెకు కొత్త ఊపిరి పోసింది. గత మూడేళ్ల కఠోర సాధన తర్వాత ఇప్పుడు ఏషియాడ్‌లో పతకం నెగ్గిన తొలి భారతీయురాలిగా బరానిక సగర్వంగా నిలిచింది.
‘మిక్స్‌డ్ డబుల్స్’ టీటీలో మనుశ్–దియాలకు కాంస్యం
గత ఆసియా క్రీడల్లో ఏకైక పతకం అందించిన టేబుల్ టెన్నిస్ (టీటీ)లో శుక్రవారం తొలి పతకం చేరింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత జోడీ మనుశ్ షా–దియా చిటాలె సెమీఫైనల్లో ఓడి కాంస్యంతో ముగించింది.

సెమీఫైనల్లో భారత జంట 8–11, 5–11, 8–11, 2–11తో చైనాకు చెందిన వాంగ్‌చుక్–సున్ యింగ్‌షా జోడీ చేతిలో ఓటమి పాలైంది. అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో మనుశ్–దియా 11–6, 13–15, 11–9, 11–5తో ప్రపంచ నాలుగో ర్యాంక్ హాంకాంగ్ జోడీ వాంగ్ టున్ టింగ్–డూ హోయ్ కిమ్‌పై సంచలన విజయంతో సెమీఫైనల్‌కు చేరి పతకాన్ని ఖాయం చేసుకున్నారు.
స్క్వాష్ లో 3 పతకాలు ఖాయం
ఆసియా క్రీడల స్క్వాష్ లో భారత్‌కు మూడు పతకాలు ఖాయమయ్యాయి. మహిళల సింగిల్స్‌లో అనాహత్ సింగ్, పురుషుల సింగిల్స్‌లో అభయ్ సింగ్, మిక్స్‌డ్ డబుల్స్‌లో జోష్నా చినప్ప–సెంథిల్ కుమార్ జోడీ సెమీఫైనల్‌కు చేరుకొని కనీసం కాంస్య పతకాలను ఖరారు చేసుకున్నారు. రికార్డు స్థాయిలో ఏడోసారి ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న జోష్న ఇప్పటికే ఐదు పతకాలు సాధించింది. 2018 ఆసియా క్రీడల్లో మహిళల సింగిల్స్‌లో కాంస్యం నెగ్గిన జోషా్న... 2014, 2018 క్రీడల్లో టీమ్ విభాగాల్లో రజత పతకాలు గెలుచుకుంది.

2010, 2023లో టీమ్ విభాగంలో కాంస్యాలు దక్కించుకుంది. శుక్రవారం మిక్స్‌డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో జోషా్న–సెంథిల్ జోడీ 11–3, 11–5తో డేవిడ్ పెలినో–జెమికా అరిబాడో (ఫిలిప్పీన్స్) ద్వయంపై గెలుపొందింది. మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో అనాహత్ 11–2, 11–5, 11–3తో భారత్‌కే చెందిన తన్వీ ఖన్నాపై గెలిచింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో అభయ్ 11–4, 11–3, 11–6తో ర్యోనోసుకె సుకువే (జపాన్)పై గెలిచాడు. మరో క్వార్టర్స్ మ్యాచ్‌లో వీర్ చోత్రాని 11–6, 8–11, 3–11, 3–11తో ఇర్ఫాన్ (పాకిస్తాన్) చేతిలో పరాజయం పాలయ్యాడు.


