అనుచిత కారణాలవల్ల తరచు వార్తల్లో ఉండే మయన్మార్ నుంచి ఆ దేశాధ్యక్షుడు మిన్ ఆంగ్ హ్లయింగ్ అయిదు రోజుల పర్యటన కోసం శనివారం మన దేశం వచ్చారు. ఆయనతోపాటు వచ్చిన బృందంలో కేబినెట్ మంత్రులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. కొన్ని దశాబ్దాలక్రితం ఇలాంటి పర్యటన ఊహించలేం. ఎందుకంటే ఆ దేశం నిరంతరం సైన్యం పడగనీడలో మనుగడ సాగిస్తోంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను సైన్యం బతకనీయదు. 2020లో తిరుగులేని మెజారిటీతో వరసగా రెండోసారి ఎన్నికైన ప్రజా స్వామ్య ఉద్యమ నేత ఆంగ్ సాన్ సూకీ నాయకత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ (ఎన్‌ఎల్‌డీ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, ఏడాదిలోపే సైనిక దళాలు హస్తగతం చేసుకున్నాయి. మన పొరుగును మనం ఎంచుకోలేం. అక్కడ ఎలాంటి ప్రభుత్వాలుండాలో ఆశించటం కూడా అసాధ్యం. మారుతున్న ప్రపంచ పరిణామాల నేపథ్యంలో మన ప్రయోజనాలు తప్ప వేరే దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని, అందుకోసం అక్కడి పాలకులపై ‘నైతిక ఒత్తిడి’ తీసుకురావాలనుకోవటం వృథా ప్రయాసగా, అనవసర చాదస్తంగా భావించే ధోరణి అలుముకుంది. మార్క్సిజాన్ని అనుసరిస్తున్నానని చెప్పుకొనే చైనా దశాబ్దాల క్రితమే ఈ సూత్రాన్ని నమ్మి మయన్మార్‌ను అక్కున చేర్చుకుని అన్నివిధాలా లాభపడింది.
వాస్తవానికి మయన్మార్‌తో మన దేశానికి సన్నిహిత సంబంధాలుండేవి. 1951లో ఆ దేశంతో స్నేహ ఒప్పందం కుదిరింది. 1955లో మనతోపాటు అలీనోద్యమ అంకు రార్పణకు తోడ్పడిన దేశాల్లో మయన్మార్ ఒకటి. కానీ 1958లో సైనిక పాలకుల ఆగమనం తర్వాత ఆ సంబంధాలు దెబ్బతిన్నాయి. మనమే కాదు... దాదాపు ప్రపంచ దేశాలన్నీ దానితో ‘దౌత్యపరమైన అంటరానితనాన్ని’ పాటించటం మొదలెట్టాయి. 1988లో ప్రజాస్వామ్య ఉద్యమాన్ని సైనిక పాలకులు అణిచేయటాన్ని నిరసిస్తూ సూకీకి భారత్ మద్దతు ప్రకటించింది. 1992లో జవహర్‌లాల్ నెహ్రూ అంతర్జాతీయ అవగాహన అవార్డుకు ఆమెను ఎంపిక చేసింది. కానీ వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 2002లో మళ్లీ దాంతో సంబంధ బాంధవ్యాలు పునరుద్ధరించి మాండలేలోని భారత కాన్సులేట్‌ను పునఃప్రారంభించింది. తిరిగి మళ్లీ 2014లో నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీయే అధికారంలోకొచ్చేవరకూ ఇరు దేశాల సంబంధాలూ అంతంత మాత్రమే. 2017లో మోదీ మయన్మార్‌ను సందర్శించారు.
మన దేశానికి మయన్మార్‌తో 1,643 కిలోమీటర్ల పొడవునా అంతర్జాతీయ సరిహద్దు ఉంది. ఇందులో ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ (520 కి.మీ.), నాగాలాండ్ (215 కి.మీ.), మిజోరం (510 కి.మీ.), మణిపూర్ (398 కి.మీ.)ఉన్నాయి. 2021లో తిరిగి సైనిక పాలకులు అధికారం చేజిక్కించుకున్నాక మన దేశం గతంలో మాదిరి మయ న్మార్‌ను ఏకాకిని చేయాలనుకోలేదు. నిరంతరం సంబంధ బాంధవ్యాల్లో ఉంటే అక్కడ ప్రజాస్వామ్య పునరుద్ధరణకు అది దోహదపడుతుందనీ, దాంతోపాటు సరిహద్దు భద్రత విషయంలో మన ప్రయోజనాలు నెరవేరుతాయనీ భావించింది. దానికితోడు మయ న్మార్‌ను దూరం చేసుకుంటే అది చైనాకు దగ్గరకావటం మినహా సాధించేదేమీ ఉండదని కూడా అనుకుంది. అందుకే కావొచ్చు... సైనిక చీఫ్ పదవి వదులుకుని, దేశాధ్యక్షుడైన రెండు నెలల్లోనే తన తొలి విదేశీ పర్యటనకు మిన్ మన దేశాన్ని ఎంచుకున్నారు.
నిరుడు డిసెంబర్, ఈ ఏడాది జనవరి మధ్య జరిపిన ఎన్నికల్లో మిన్ భారీ ఓట్లతో విజయం సాధించారు. దాదాపు అన్ని విపక్షాలనూ ఎన్నికల్లో పాల్గొననీయకపోవటంవల్ల ఇది సాధ్యమైంది. ఆ సంగతలావుంచి మయన్మార్‌తో కుదిరిన ఒప్పందాలు మన దేశానికి వ్యూహాత్మకంగా, భద్రతాపరంగా మేలుచేసేవే. అంతర్జాతీయ కరెన్సీ బదులు మన రూపాయి, మయన్మార్ క్యాట్‌లలో లావాదేవీలు జరుపుకోవాలనీ... ఇంధనం, మైనింగ్, ఆగ్రో ప్రోసెసింగ్ రంగాల్లో సహకరించుకోవాలనీ నిర్ణయించుకున్నాయి. అలాగే నౌకా శ్రయ నిర్మాణంలో మయన్మార్‌కు తోడ్పడేందుకు అవగాహన కుదిరింది. ఈశాన్య రాష్ట్రాల్లో అలజడి రేపే సంస్థలకు ఆశ్రయం లభించకుండా చర్యలు తీసుకుంటామని మయన్మార్ హామీ ఇచ్చింది. వర్తమానంలో ఇరుగు పొరుగుమధ్య సర్దుబాట్లు తప్ప ‘అనవసర’ చాదస్తాలు ఉండబోవని ఈ పర్యటన నిరూపించింది.


