పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజైన సోమవారం ఢిల్లీ ఆకాశంలో నిరసన మబ్బులు దట్టంగా అలుముకున్నాయి. రాజవీధులన్నీ వేలాది యువగళాలతో హోరెత్తాయి. పన్నెండేళ్ల బాలిక మొదలుకొని అనేకమంది యువతీయువకులు పోలీసుల లాఠీచార్జిలో గాయపడి నెత్తురోడుతున్న, విలపిస్తూ నిలదీస్తున్న దృశ్యాలు చానెళ్లలో వీక్షించటం చాలామందికి కష్టంగా తోచింది. ఈ దశాబ్ద కాలంలో దేశ రాజధాని ఎన్నడూ చూడని దృశ్యాలివి. నీట్ ప్రశ్నపత్రాల లీక్‌పై గత నెల జూన్ 6 నుంచి కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేస్తున్న ఆందోళననూ, మూడు వారాలుగా కొనసాగుతున్న నిరశనలనూ మౌనంగా వీక్షిస్తూ ఉండిపోయిన ప్రభుత్వానికి సోమవారం నాటి ‘చలో సంసద్’ కళ్లు తెరిపించి ఉండాలి. అందుకే కావొచ్చు... కేంద్ర ఆరోగ్యమంత్రి జేపీ నడ్డా ఉద్యమ కార్యకర్తలను చర్చలకు పిలిచారు. అక్కడేమైంది, చివరకు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందన్న సంగతలా ఉంచితే ముందు వినడం పాలకులు చేయాల్సిన పని.
పదిహేనేళ్ల క్రితం అన్నా హజారే నిరశన మొదలెట్టినప్పుడు ఆనాటి యూపీఏ ప్రభుత్వం మొదట్లో పట్టించుకోకున్నా, ఆ తర్వాత కేంద్ర మంత్రులతో ప్రతినిధి బృందాన్ని పంపింది. దాన్ని సంపూర్ణంగా సమర్థించి, క్రియాశీలంగా పాల్గొని దేశవ్యాప్తంగా ఆ ఉద్యమానికి ఊపూ ఉత్సాహాన్నీ తీసుకొచ్చింది బీజేపీయే. అందుమూలంగా ఇతోధికంగా లాభపడింది కూడా. కానీ అదే పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇప్పుడు నిర్లిప్తంగా ఉండి పోవటం, సమస్యను ఇంత సంక్లిష్టం చేసుకోవటం దిగ్భ్రాంతికరం. ఈ ఆందోళనలో గాయపడిన వారిలో వందమంది వరకూ రాంమనోహర్ లోహియా ఆస్పత్రిలో చికిత్సకు చేరగా వారిలో తలలు పగిలినవారూ, కాళ్లూ చేతులూ విరిగినవారూ అనేకులున్నారని జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. అటు 118 మంది పోలీసులు గాయాలతో ఆస్పత్రుల్లో చేరారని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు.
పాలకులుగా ఎవరుండాలో ఎన్నికలు చెబితే... వారి పాలన ఎలావుందో నిరసనలు చెబుతాయి. అసమ్మతి అనేది దేశభక్తికి అత్యున్నత రూపం అంటాడు అమెరికా రాజనీతి శాస్త్ర ఆచార్యుడు హోవార్డ్ జిన్. ప్రజాస్వామ్యంలో విభేదించేందుకూ, అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకూ చోటివ్వడం ప్రభుత్వాల బాధ్యత. ఆ దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావటం విపక్షాల బాధ్యత కూడా. కానీ విషాదమేమంటే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఈ కర్తవ్య నిర్వహణలో విఫలమైంది. జూన్ 17న రాజస్థాన్‌లోని కోటలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఒకరోజు ధర్నా చేయటం మినహా చేసిందేమీ లేదు. అన్నా హజారే ఉద్యమ సమయంలో జరిగిందేమిటో గుర్తున్నా తాను చేయాల్సిందేమిటో ఆ పార్టీకి తెలిసేది. ఆ సంగతి ఆలస్యంగా గ్రహించి మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ నివాసం సమీపంలో రాహుల్, ప్రియాంక, ఇతర కాంగ్రెస్ ఎంపీలు ధర్నా చేశారు.
ఈ ఉద్యమానికి చెప్పుకోదగ్గ నాయకులంటూ ఎవరూ లేకపోవడం గమనించదగ్గది. నిరశనలో ఉన్న సోనమ్ వాంగ్‌చుక్‌ను పోలీసులు అరెస్టుచేసి ఆస్పత్రిలో చేర్చారు. సీజేపీ నాయకుడు అభిజీత్ దీప్కేను ప్రదర్శన ప్రారంభంలోనే పోలీసులు అరెస్టు చేశారని వార్తలొచ్చాయి. కానీ దాదాపు 50,000 మంది వరకూ ఉన్న ఆందోళనకారులు గుంపులుగా విడిపోయి పార్లమెంటువైపు దూసుకెళ్లే ప్రయత్నం చేయటం, చాలావరకూ సఫలీకృతం కావటం చిన్న విషయం కాదు. పటేల్ చౌక్, జన్‌పథ్ గేటు మెట్రో స్టేషన్‌ల వద్ద, అశోకా రోడ్, కన్నాట్‌ప్లేస్ సర్కిల్ వద్ద బైఠాయింపులు, మరో అయిదుచోట్ల వారిపై బాష్ప వాయు గోళాలు ప్రయోగించటం సమస్య తీవ్రతను వెల్లడిస్తుంది.
హింసకూ, దౌర్జన్యానికీ దిగినవారిని నియంత్రించటాన్ని ఎవరూ ప్రశ్నించరు. కానీ ఒక్కరిని చేసి ఏడెనమండుగురు పోలీసులు లాఠీలతో మోదటం, ఆడపిల్లలని కూడా చూడకుండా హింసించటం సబబేనా? ‘మీ ఇంట్లో పిల్లలు లేరా? ఇంత దారుణంగా కొడతారా?’ అని ఒక బాలిక ప్రశ్నించటం, తన దుస్తులు చించారని మరొకామె ఆరో పించటం ప్రభుత్వ ప్రతిష్ఠ పెంచదు. పరీక్షపత్రాలు లీకవటం, కష్టపడి చదివేవారు దగాపడటం తొలిసారి కాదు. ఏళ్లతరబడి ఇలా జరగటంవల్లే పరిస్థితి ఇంతవరకూ వచ్చింది. ఇకనైనా విద్యార్థుల అభీష్టాన్ని వినటం, సానుకూలంగా స్పందించటం ప్రభుత్వ బాధ్యత. లేకుంటే సమస్య మరింత జటిలమవుతుంది.


