జనతంత్రం
‘ఈనాడు’ మీడియా అధిపతి వియ్యంకుల వారికి మరోసారి తాజాగా చంద్రబాబు ప్రభుత్వం భారీ నజరానాను సమర్పించిందట! వారి కాంట్రాక్టు సంస్థ పోలవరం ఎడమ కాలువ పనుల్లో రెండు ప్యాకేజీలను చేపట్టింది. కేవలం ఇరవై నెలల కింద ఖరారు చేసిన వాటి అంచనా వ్యయాన్ని 126 శాతం పెంచుతూ ఈ శుక్రవారం నాడు ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను ‘సాక్షి’ బయటపెట్టింది. అదేరోజు ఉషోదయాన ‘ఈనాడు’ మొదటి పేజీలో వడ్డించిన ఒక వార్త గమనించదగ్గది. మద్యం కేసులో త్వరలోనే జగన్‌కు ఈడీ నోటీసులిస్తుందట! విషయం లేకుండా గాలిని పోగేసి కట్టిన ఈ కక్షపూరిత కేసుపై ‘ఈనాడు’ సహా యెల్లో మీడియా వాహినంతా కూడబలుక్కొని ఏడాదిన్నర కాలంలో సృష్టించిన కాల్పనిక సాహిత్యాన్ని టన్నుల లెక్కల్లో గణించవలసి ఉంటుందేమో!
చంద్రబాబుకు అవసరమైన పద్ధతిలో సమాచార ఉపచారాలు చేయడం యెల్లో మీడియా పని. బదులుగా ఆ మీడియా అధిపతులకు కోరుకున్న ఉపకారాలు చేసిపెట్టడం బాబు సర్కార్ బాధ్యత. ఈ సహకార ధోరణి మూడు దశాబ్దాలుగా నిరాటంకంగా సాగుతున్నది. మద్యం కేసు పేరుతో యెల్లో మీడియా నిర్వహించిన వ్యాసంగాన్ని కాకమ్మ కథలని పిలవాలో, చిలకమ్మ పలుకులని నుడవాలో అర్థం కాని పరిస్థితి. అయితే, రాసినదాన్నే పలుమార్లు మార్చి మార్చి రాయగలిగే వారి రచనా చమత్కృతికీ, జబ్బ పుష్టికీ పాఠకులు అచ్చెరువొందడం ఖాయం. వాటిని చదివిన విభ్రమావస్థలో ఏది కుంభకోణమో, ఏది అసలు కోణమో పాఠకులు తేల్చుకోలేరనే కనికట్టు విశ్వాసం వారికి ఉండవచ్చు. కానీ, ఇంగితజ్ఞానం అనేదాన్ని రాసేవాడు విడిచేసినా చదివేవాడు కోల్పోడనే ఎరుకలేకపోవడం వారి బలహీనత.
పత్రికా రంగంలో తనకు పోటీగా తయారైన ‘ఉదయం’ను దెబ్బతీయడానికి ‘ఈనాడు’ మద్యనిషేధ ఉద్యమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఏబీకే ప్రసాద్ ఆధ్వర్యంలో దాసరి నారాయణరావు ప్రారంభించిన ‘ఉదయం’ సంచలన వార్తలకు కేంద్ర బిందువుగా మారింది. ఆర్థిక నిర్వహణ భారం కావడంతో దాన్ని లిక్కర్ వ్యాపారస్తుడైన మాగుంట సుబ్బిరామిరెడ్డికి అప్పగించారు. లిక్కర్ వ్యాపారాన్ని నిషేధిస్తే ‘ఉదయం’ పునాదులు దెబ్బతింటాయన్న లక్ష్యంతోనే ‘ఈనాడు’ మద్యనిషేధ ఉద్యమాన్ని ప్రారంభించిందనే విమర్శలు ఆ రోజుల్లోనే వినిపించాయి. ఆ తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ తానిచ్చిన హామీ మేరకు మద్యనిషేధాన్ని అమలు చేశారు. నాడు ‘ఈనాడు’ సహకారంతో వెన్నుపోటు వ్యూహం ద్వారా అధికారం చేపట్టిన చంద్రబాబు సర్కార్‌కు మద్యనిషేధం ఇబ్బందిగా మారింది. వెంటనే ‘ఈనాడు’ రంగంలోకి దిగి ఒక సంపాదకీయాన్ని రాసిపారేసింది. ప్రజలు చైతన్యవంతులై వారంతట వారు తాగడం మానేస్తే తప్ప మద్యనిషేధాన్ని అమలు చేయడం అసాధ్యమని అందులో తేల్చేశారు. బోధివృక్ష ఛాయలో సంపాదకీయాన్ని చదివిన చంద్రబాబు తక్షణం కర్తవ్యోన్ముఖుడై మద్య నిషేధాన్ని ఎత్తిపారేశారు.
ఆనాడు మొదలైన బాబు – యెల్లో మీడియా బంధం మరింత బలపడింది. ఆనాటి వెన్నుపోటు వ్యూహాలు, లిక్కర్ కథల ట్విస్టులూ నేటికీ కొనసాగుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. రాష్ట్ర విభజన తర్వాత కూడా అధికారంలో ఉన్న నేతను బట్టి యెల్లో మీడియా లిక్కర్ కథల్లోని ట్విస్టులను మనం స్పష్టంగా చూడవచ్చు. 2014–19 మధ్యకాలంలో అధికారంలో ఉన్న చంద్రబాబు మద్యం పాలసీపై ప్రతిపక్ష వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది. తెలుగుదేశం పార్టీ నాయకులతో ఏర్పాటుచేసిన మద్యం సిండికేట్‌కు లబ్ధి చేకూరేవిధంగా ప్రభుత్వం వ్యవహరించిందనీ, ఫలితంగా 20 వేల కోట్లకు పైగా సిండికేట్ దండుకున్నదనీ ఆరోపణలు చేసింది. అంతటితో ఆగకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత సీఐడీ విచారణకు ఆదేశించింది. సీఐడీ దర్యాప్తులో వైసీపీ ఆరోపణలు చాలావరకు నిర్ధారణ అయ్యాయి. దర్యాప్తుల సంగతి పక్కనపెట్టి కామన్‌సెన్స్‌ను ఉపయోగించి ఆలోచించినా కూడా జరిగిన అవినీతికి స్పష్టమైన సాక్ష్యాలు కనిపిస్తాయి.
అంతకుముందు ఆరు డిస్టిలరీలు ఉంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా మరో 14 డిస్టిలరీలకు అనుమతి ఇచ్చారు. తమకు అనుమతులిచ్చి వ్యాపారాన్నిచ్చిన వారి పట్లనే సంస్థలు కృతజ్ఞతతో ఉంటాయి తప్ప ఇవ్వనివాళ్ల పట్ల ఎందుకుంటాయి? ఉమ్మడి రాష్ట్రంలో 2012 నుంచి బార్ల మీద వాటి వ్యాపారాన్ని బట్టి ప్రివిలేజ్ ఫీజును వసూలు చేస్తున్నారు. విభజన తర్వాత ఏపీకి ఈ ప్రివిలేజ్ ఫీజు ద్వారా ఏటా 1,300 కోట్ల ఆదాయం సమకూరేది. 2015లో చంద్రబాబు సర్కార్ ఈ ఫీజును తొలగించింది. అది కూడా కేబినెట్‌లో పెట్టకుండా, ఆర్థిక శాఖ అనుమతి కోరకుండా చీకటి జీవోల ద్వారా తీసుకున్న నిర్ణయం. అంటే తాము చేస్తున్న పని తప్పని తెలిసి కూడా సర్కార్ పెద్దలు ఈ ఫీజును రద్దు చేశారు. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. ఆ మేరకు ప్రైవేట్ వ్యాపారులకు నాలుగేళ్లలో ఐదు వేల కోట్లకు పైగా లబ్ధి జరిగింది. ఈ వ్యవహారంలో పాలకులు అవినీతికి పాల్పడేందుకు నూటికి నూరు శాతం అవకాశాలున్నాయి. అందువల్లనే కాగ్ ఆధ్వర్యంలో పనిచేసే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ తన అభ్యంతరాన్ని నమోదు చేశారని సమాచారం. స్పష్టమైన ఆధారం కనుకనే సీఐడీ కేసు నమోదు చేసింది.
3,400 లైసెన్స్‌డ్ లిక్కర్ షాపులకు అనుబంధంగా పర్మిట్ రూమ్‌లు ఏర్పాటయ్యాయి. చేతులు తడపకుండానే ఇంతటి భారీ వెసులుబాటు సాధ్యం అవుతుందా? ప్రతి షాపు పరిధిలో అదనంగా పది నుంచి పదిహేను వరకు బెల్టు షాపులు ఏర్పాటయ్యాయి. రాష్ట్రం మొత్తంగా 43 వేల బెల్టు షాపులు అవతరించాయి. ఒక్కో బెల్టు షాపును ప్రాంతాన్ని బట్టి మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు పాడుకున్నారన్నది బహిరంగ రహస్యం. అందుకుగాను ఒక్కో బెల్ట్ షాపులో ప్రతి క్వార్టర్ మీద అదనంగా 20 రూపాయలకు పైగా వసూలు చేశారు. విచ్చలవిడిగా మద్యాన్ని ప్రవహింపజేసి ఎమ్‌ఆర్‌పీ మీద అదనపు దోపిడీతో జనాన్ని పీడించిన ఈ విధానంలో తెలుగుదేశం పార్టీ సిండికేట్ ముఠాలు 20 వేల కోట్లకు పైగా దిగమింగాయని వైసీపీ ఆరోపించింది.
జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధానంలో మార్పు చేశారు. విచ్చలవిడి మద్యం ప్రవాహానికి కళ్లెం వేసే మద్య నియంత్రణను ప్రవేశపెట్టారు. కొత్తగా జగన్ ప్రభుత్వం ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. అధిక లాభాపేక్షతో విచ్చలవిడి అమ్మకాలకూ, కల్తీ మద్యం ప్రవాహాలకు పాల్పడకుండా ప్రైవేట్ వ్యాపారాన్ని పూర్తిగా తొలగించారు. ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించింది. అమ్మకం వేళలను కూడా రాత్రి 9 గంటల వరకే పరిమితం చేశారు. అంతకుముందు మాదిరిగా రౌండ్ ద క్లాక్ మద్యం లభ్యమయ్యే పరిస్థితి లేదు. షాపుల సంఖ్యను కూడా 3 వేలకు పరిమితం చేశారు. అనుబంధంగా పర్మిట్ రూమ్‌లకు అవకాశం ఇవ్వలేదు. బెల్ట్ షాపుల ఊసే లేకుండా చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం ప్రవేశించకుండా ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, చెన్నయ్, బెంగళూరుల నుంచి కార్లలో ఒక బాటిల్ అర బాటిల్ తెచ్చుకున్నా సరే లాగిపారేసే దాకా ఈ పోలీసుల ఓవర్ యాక్షన్ వెళ్లింది. ఫలితంగా కొన్ని వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమైనా సరే మద్య నియంత్రణను జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలుచేసింది.
ఇప్పుడు లాజికల్‌గా ఆలోచిస్తే జగన్ సర్కార్ మద్యం విధానంలో అవినీతి జరిగే అవకాశం ఎక్కడున్నది? కొత్తగా ఒక్క డిస్టిలరీకీ అనుమతి ఇవ్వలేదు. నియంత్రణ చర్యల వల్ల మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. వ్యాపారం తగ్గిపోయిందన్న ఆనందంతో డిస్టలరీలు లంచాలిస్తాయా? విచ్చలవిడిగా షాపులకూ, పర్మిట్ రూమ్‌లకూ, బెల్ట్ షాపులకూ అనుమతిలిచ్చిన ప్రైవేట్ వ్యాపార విధానంలో లంచాలు వస్తాయా? నియంత్రిత ప్రభుత్వ వ్యాపారంలో లంచాలు వస్తాయా? చంద్రబాబు గత ప్రభుత్వం కొత్తగా 14 డిస్టిలరీలకు అనుమతినివ్వడమే కాదు, మద్యం బేసిక్ రేట్లను పెంచి మరీ వాటికి లబ్ధి జరిగేలా చూసింది. బేసిక్ రేటును పెంచకుండా తమ లాభాలకు కళ్లెం వేసినందుకు డిస్టిలరీలు జగన్ సర్కార్‌కు లంచాలు ముట్టజెప్పాయని అనుకోవాలా? ఇక్కడే యెల్లో మీడియా క్రియేటివిటీ విశృంఖల విహారం చేయడం మొదలుపెట్టింది. తెలుగుదేశం పార్టీ హెడ్‌క్వార్టర్‌లో తయారైన స్క్రిప్టునే దర్యాప్తు కోసం నియమించిన సిట్ లీక్ చేస్తుంది, యెల్లో మీడియా అచ్చేస్తున్నదని వైసీపీ ఆరోపణలు చేస్తున్నది. ఈ ఆరోపణలను విశ్వసించకుండా ఉండేందుకు తగిన కారణం కనిపించడం లేదు.
ఎంపిక చేసుకున్న కొన్ని బ్రాండ్లను ప్రమోట్ చేసినందువల్లనే వేలకోట్ల ధనం చేతులు మారిందని ‘సిట్’ పలుకుతున్నది. యెల్లో మీడియా కోరస్ పాడుతున్నది. జగన్ సర్కార్ జమానాలో వచ్చిన కొత్త డిస్టిలరీ లేదు. కొత్త మద్యం బ్రాండ్ కూడా లేదు. అన్నీ కూడా చంద్రబాబు సర్కార్ వారసత్వమే. బాబు పాత జమానాలో 20 డిస్టిలరీలు వుంటే అందులో కేవలం ఐదు డిస్టలరీలకే బేవరేజెస్ కార్పొరేషన్ 50 శాతానికి పైగా ఆర్డర్లు ఇచ్చిందని సీఐడీ దర్యాప్తులో తేటతెల్లమైంది. ఎంపిక చేసుకున్న కొన్ని సంస్థలకే ఆర్డర్లు ఇవ్వడం వల్ల జగన్ హయాంలో వేల కోట్లు చేతులు మారాయన్న కథనం నిజమైతే చంద్రబాబు హయాంలో కూడా అంతకంటే ఎక్కువ మొత్తమే కైంకర్యం అయి వుండాలి కదా! యెల్లో మీడియాకు ఈ లాజిక్‌తో పనేముంది?
డిస్టిలరీలకు మద్యం ఆర్డర్లు ఇచ్చే బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిని సిట్ వాళ్లు బెదిరించి, హింసించి తాము కోరుకున్న వారి పేర్లు చెప్పించి, ఆ పేర్లన్నింటినీ అభియోగపత్రంలోకి ఎక్కించారన్న విమర్శలు వినబడుతున్నాయి. సీఎమ్‌ఓలో కార్యదర్శిగా పనిచేసిన ధనంజయరెడ్డి, సీఎమ్‌కు ఓఎస్‌డీగా పనిచేసిన కృష్ణమోహన్‌రెడ్డి, అంతర్జాతీయ దిగ్గజ సిమెంట్ సంస్థలో డైరెక్టర్‌గా ఉన్న బాలాజీ గోవిందప్ప, ఐటీ సలహాదారుగా ఉన్న రాజ్ కేసిరెడ్డి, ఆయన బంధువు అనివాశ్‌రెడ్డి, లోక్‌సభలో వైసీపీ నేత మిథున్‌రెడ్డి, వైసీపీ నాయకుడైన చెవిరెడ్డి భాస్కరరెడ్డి, జగన్ పీఏ నాగేశ్వరరెడ్డి వగైరా సుమారు యాభై మంది మరే పని లేకుండా మద్యం వ్యాపారంలో మునిగితేలారని సిట్ నమ్మమంటున్నది.
ఈ కథా సరిత్సాగరంలో ఇంకా చాలా పిట్టకథలున్నాయి. ఛార్జిషీట్‌లో పేర్కొన్నవారు, పేర్కొనని మరికొందరి పేర్ల మీద, వారి బినామీల పేర్ల మీద ఒక్కొక్కరికి వందల కోట్ల ఆస్తులున్నాయట! అంతేకాకుండా, కొన్ని వందల కోట్లతో దుబాయ్‌లో, ఆఫ్రికాలో వ్యాపారాలు జరుగుతున్నాయట! మరికొన్ని వందల కోట్లో, వేల కోట్లో వైసీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి తరలించారట! అసలు అవినీతికే అవకాశం లేని విధానంలో ఇన్ని వేల కోట్లు ఎలా ప్రవహిస్తాయి? ఇంగిత జ్ఞానం అనేది ఉంటే ఈ ఎంగిలి కథలను విశ్వసిస్తుందా? ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా పాలనలో చేతులెత్తేసి ప్రత్యర్థి వంక వేలెత్తి చూపితే జనం విశ్వసిస్తారా? అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంలో, చెప్పుకోవడానికి సాధించిన విజయాలు లేకనే కూటమి సర్కార్ విషప్రచారపు జోరును పెంచిందని అనుకోవలసి వస్తున్నది.
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com


