పశ్చిమాసియా మొదలుకొని ప్రపంచం నలుమూలల నుంచీ దుర్వార్తలే వింటున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఇది మరో పిడుగుపాటు. పదహారేళ్లుగా హంగేరిని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలుతున్న కన్సర్వేటివ్ జాతీయవాది, ప్రధాని విక్టర్ ఒర్బాన్ ఘోరంగా ఓటమిపాలయ్యారు. 199 స్థానాలున్న పార్లమెంటుకు ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆయన పార్టీ ఫిడెస్‌కి కేవలం 55 స్థానాలు మాత్రమే రాగా, ఆయన్నుంచి విడిపోయి, మధ్యేవాద మితవాద పక్షం టీసా పార్టీని స్థాపించిన పీటర్ మాజార్‌కు అనూహ్యంగా 138 స్థానాలు లభించాయి. తీవ్ర మితవాద పక్షం అవర్ హోంల్యాండ్‌కు 6 దక్కాయి. తుది ఫలితాలు అధికారికంగా ప్రకటించాల్సివుంది.
ఎన్నికల సంఘం మొదలుకొని న్యాయవ్యవస్థ, మీడియా వరకూ అన్నిటినీ అధీనంలోకి తెచ్చుకుని తిరుగులేని అధికారం చలాయిస్తున్న ఒర్బాన్ ఓటమిని ఎవరూ ఊహించలేదు. ఆయనపై ప్రజానీకంలో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని స్వతంత్ర సర్వే సంస్థలు చెప్పినా ఎవరూ నమ్మలేదు. టీసా పార్టీ దాదాపు 6 శాతం పాయింట్ల ఆధిక్యత తెచ్చుకుంటేనే కనీసం సాధారణ మెజారిటీ కూడా అసాధ్యమని కొన్ని మీడియా సంస్థలు చెప్పగా... అధికార పార్టీకన్నా టీసా పది పాయింట్లు వెనకబడివుందని ప్రభుత్వ అనుకూల మీడియా ఢంకా బజాయించింది.
ఈ ఎన్నికల సందర్భంగా హంగేరి ఏమాత్రం పొంతనలేని రెండు భిన్న ప్రపంచాలు చూసింది. అధికారపక్షం వైపు మొగ్గే ప్రపంచం ఒర్బాన్ మరో నాలుగేళ్లు ఏలబోతున్నారంటూ మోత మోగించింది. అందులో మీడియా సంస్థలూ, సామాజిక మాధ్యమాలూ, ‘సాధారణ పౌరులూ’ ఉన్నారు. అటు పీటర్ మజార్‌ను సమర్థించే ప్రపంచం అందుకు భిన్నమైన విశ్లేషణలు చేసింది. ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే ‘నిజమైన ప్రపంచం’ అయివుంటుందని అందరికీ తెలుసు. సోమవారం ఓట్ల లెక్కింపు తర్వాత ‘నకిలీ ప్రపంచం’ బట్టబయలైంది.
ఒర్బాన్ హంగేరికి మాత్రమే పరిమితమైన సాధారణ నాయకుడు కాదు. ఆయన్ను అధికార పీఠం ఎక్కించిన ఫార్ములా దేశదేశాల నాయకులకూ శిరోధార్యంగా మారింది. సంప్రదాయవాదాన్నీ, జాతీయవాదాన్నీ నెత్తికెత్తుకుని ప్రజల భావోద్వేగాలను ఉచ్ఛస్థితికి తీసుకెళ్లటం ఎలాగో ఒర్బాన్ నేర్పారు. అమెరికాకు మాత్రమే కాదు... ప్రపంచానికంతకూ పెను సమస్యగా మారిన ట్రంప్ ఆయన స్ఫూర్తితోనే మాగా (మళ్లీ అమెరికాను మహోన్నతం చేద్దాం) ఉద్యమానికి అంకురార్పణ చేశారు.
ఒర్బాన్‌కు ట్రంప్, పుతిన్ సన్నిహితులు. వారిద్దరి మాదిరే ఈయూతో వైరం. ఒర్బాన్ మార్కు ఏలుబడికి ఇంటా బయటా శత్రువులు అవసరం. వారు– ఈయూ, కమ్యూనిస్టులు, వలసదారులు, శతకోటీశ్వరుడు, దాత జార్జి సోరోస్– ఎవరైనా కావొచ్చు. అభద్రతా భావన కూ. విదేశీ బెడదకూ, సమాజంలోని నైతిక పతనానికీ, ఇతరత్రా ప్రమాదాలకూ సర్వరోగ నివారిణి తాను మాత్రమేనని ఒర్బాన్ పదహారేళ్లపాటు నమ్మించగలిగారు.
‘సూపర్ మెజారిటీ’ వచ్చినా పాలనపై పూర్తిస్థాయి పట్టు సంపాదించటం టీసా పార్టీకి అంత సులభం కాదు. ఎందుకంటే సకల అధికార వ్యవస్థలూ ఒర్బాన్ అనుకూలురతో నిండివున్నాయి. ఆర్థిక సంస్థలూ, అధికార యంత్రాంగం, ఎన్నికల సంఘం, అవినీతి నిరోధక విభాగం వగైరాలన్నీ ఆయన మనుషుల చెప్పుచేతల్లో నడుస్తున్నాయి. ఈయూ నుంచి బయటికొస్తేనే సకల సమస్యలూ పరిష్కారమవుతాయని ఆయన చెప్పిన మాటలు విశ్వసించబట్టే ఆర్థికంగా అధోగతిలోవున్నా జనం నమ్మారు. ఒర్బాన్ అనుకూల వ్యాపార సంస్థలు మాత్రమే లాభార్జనతో కళకళలాడాయి.
నిరుద్యోగం పదేళ్ల రికార్డును అధిగమించింది. నిరుడు ఆర్థిక వృద్ధి 0.4 శాతం. కొన్నేళ్లుగా కష్టాల్లోవున్న పోలెండ్ సైతం 3.6 వృద్ధి రేటు సాధించగా... బల్గేరియా, రుమేనియా సైతం మెరుగ్గా ఉన్నాయి. ఇక అవినీతిలో హంగేరిది అగ్రస్థానం. ఇరాన్ శాంతి చర్చలకన్నా ముందు, ఒర్బాన్ గెలుపుకోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హంగేరి వెళ్లి ప్రచారం చేశారు. కానీ ఇరాన్ శాంతి చర్చల మాదిరే, ఒర్బాన్ కూడా కుప్పకూలారు. ఆయన ఓటమితో ఈయూ దేశాలు పండగ చేసుకుంటున్నాయి. హంగేరి ప్రజలు తమతోనే ఉన్నారని సంబరపడుతున్నాయి. కానీ అధోగతిలోవున్న హంగేరికి అందరూ ఆపన్న హస్తం అందించటం అత్యవసరం.


