బిహార్‌కు బీజేపీ సారథ్యం! | Sakshi Editorial On BJP leads Bihar | Sakshi
Sakshi News home page

బిహార్‌కు బీజేపీ సారథ్యం!

Apr 16 2026 12:56 AM | Updated on Apr 16 2026 12:56 AM

Sakshi Editorial On BJP leads Bihar

మండల్‌ రాజకీయాలకు పుట్టిల్లుగా మారి, రెండున్నర దశాబ్దాలుగా జాతీయ రాజకీయ పక్షాలకు నిలువనీడ లేకుండా పోయిన బిహార్‌లో బుధవారం తొలిసారి బీజేపీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది. ఆ పార్టీ నాయకుడు సమ్రాట్‌ చౌధరి నేతృత్వంలో ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయడం కొన్నేళ్ల క్రితం ఊహించని పరిణామం. అయితే కింగ్‌మేకర్‌గా లేదా జూనియర్‌ భాగస్వామిగా జేడీ(యూ) అధినేత నితీశ్‌కుమార్‌ నాయకత్వంలోని ప్రభుత్వాల్లో కొనసాగుతూ వచ్చిన బీజేపీ... ఎంతో సహనంతో, ఓపికతో సుదీర్ఘకాలం ఈ రోజు కోసం వేచిచూసింది. ఆఖరికి 2020లోనూ, నిరుడు జరి గిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రధాన భాగస్వామ్య పక్షం జేడీ(యూ)కు మించి స్థానాలొ చ్చినా సీఎం పదవి కోసం పట్టుబట్టకుండా ఉండిపోయింది. 

ఎలా ఒప్పించిందో, ఏం చేసిందో... ఆర్నెల్లు కాకుండానే ఆయన్ను రాజ్యసభకు పంపి, ఆ పదవి కైవసం చేసుకుంది. అసలు నిరుడు నవంబర్‌లో జరిగిన బిహార్‌ ఎన్నికల సందర్భంలోనే ఈసారి నితీశ్‌ను సీఎం పదవినుంచి తప్పించి, బీజేపీయే పగ్గాలు చేపడుతుందన్న ప్రచారం జరిగింది. కానీ అది విజయావకాశాలను దెబ్బతీయొచ్చన్న ఉద్దేశంతో రెండు పార్టీలూ కొట్టిపారేశాయి. బహుశా తనను తప్పిస్తారని నితీశ్‌ కూడా ఊహించివుండరు. 

ఎందుకంటే కుమారుడికి రాజ్యసభ సీటు ఇవ్వాలంటూ ఆయన ఫిబ్రవరిలో బీజేపీ అగ్రనేతలను కలిసి పట్టుబట్టారు. చివరికి తానే ఆ సీటు తీసుకుని, సీఎం పదవి బీజేపీకి అప్పగించాలని నితీశ్‌ నిర్ణయించటంతో కుమారుడితోపాటు పార్టీ అగ్ర నేతలంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతిలో మునిగారు. పదకొండేళ్లనాడు అప్పటి పార్టీ నేత జితన్‌రాం మాంఝీని తొమ్మిది నెలలపాటు సీఎం పదవిలో కూర్చోబెట్టడం మినహా దాదాపు 21 ఏళ్లపాటు బిహార్‌ ఏలికగా నితీశ్‌ కొనసాగారు. మధ్యలో కూటములు మార్చినా, జనం మాత్రం ఆయన వెనకే దృఢంగా నిలబడ్డారు. 
  
మునుపటితో పోలిస్తే పార్టీ అధినేతగా నితీశ్‌ అంత ఆత్మవిశ్వాసంతో లేరని స్థానిక మీడియా చెబుతూవచ్చింది. ఇది వయసు పైబడటంవల్లనా, పార్టీలోని అంతఃకలహాలా అన్న విషయంలో ఎవరి విశ్లేషణలు వారివి. మండల్‌ రాజకీయాలు బలంగా వేళ్లూను కున్న రాష్ట్రాన్ని జాతీయపక్షం చేతుల్లో పెట్టడంపైనా నితీశ్‌పై విమర్శలొచ్చాయి. కానీ బీజేపీ ఆ రాజకీయాలకు భంగం వాటిల్లకుండా చాలా చాకచక్యంగా వ్యవహరించింది. ఉత్తరప్రదేశ్‌ తరహాలో బిహార్‌లో కూడా ఆదినుంచీ సంఘ్‌ పరివార్‌ను నమ్ముకున్నవారికే పగ్గాలు అప్పగించాలని ఒత్తిళ్లు వచ్చినా అధిష్టానం వాటిని అంగీకరించలేదు. 

మొదటి నుంచీ పార్టీలో కొనసాగినవారిని కాదని, ఎనిమిదేళ్లనాడు వచ్చిన సమ్రాట్‌వైపే మొగ్గు చూపటానికి కారణం ఆయన బాగా వెనకబడిన కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన వారు కావటమే. బిహార్‌ ప్రత్యేక పరిస్థితులరీత్యా ఇది తప్పదని అధిష్టానం భావించింది. లాలూ సతీమణి రబ్డీదేవి ప్రభుత్వంలో ఉంటూ 26 యేళ్ల క్రితం బీజేపీ కారణంగానే మంత్రి పదవి పోగొట్టుకున్న సమ్రాట్‌... 2018లో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్లమెంటరీ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు... కేవలం శాశ్వత ప్రయోజనాలే ఉంటాయంటారు. కానీ ప్రయోజనాలు మాత్రమే చూసుకున్నా ఎదగటం కష్టమే. తనేంటో నిరూపించుకోవాలి. పార్టీ నాయకత్వానికి నమ్మకం కలిగించాలి. ఆ పని సమ్రాట్‌ సమర్థవంతంగా చేయబట్టే ఇవాళ సీఎం పదవి అందుకో గలిగారు. యాదవేతర కులాల్లో పట్టు సంపాదించుకోవాలన్న బీజేపీ వ్యూహానికి ఆయన సమర్థత, కులం తోడ్పడ్డాయి.

అయితే బిహార్‌కు సమస్యలు తక్కువేం లేవు. ఇప్పటికీ అది దేశంలోని నిరుపేద రాష్ట్రాల్లో ఒకటి. బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగిపోయిందంటూ ఎంత గొప్పలుపోయినా బిహార్‌లో రోడ్లు, ఆరోగ్యరంగం, విద్యారంగం సక్రమంగా లేవు. లాలూ హయాంతో పోలిస్తే మెరుగ్గానే ఉండొచ్చుగానీ... శాంతిభద్రతలు ఇంకా పూర్తిస్థాయిలో చక్కబడలేదంటారు. మౌలిక సదుపాయాల మెరుగుదల, పారదర్శకత, జవాబుదారీతనం తన ప్రాముఖ్యతలని ప్రమాణస్వీకారం చేశాక ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో సమ్రాట్‌ ప్రకటించటం గమనిస్తే ఎక్కడెక్కడ మరమ్మతు అవసరమో ఆయన సక్రమంగానే గుర్తించారని అర్థమవుతుంది. మొత్తానికి బీజేపీ నేతృత్వంలో బిహార్‌ పయనం ఎలా ఉంటుందో మున్ముందు తెలుస్తుంది. 

Advertisement
 
Advertisement
Advertisement