దేశంలో మూడు వారాలలోపే మరో ఘోరం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో సోమవారం మధ్యాహ్నం ఒక యానిమేషన్ కోచింగ్ సెంటర్ మంటల్లో చిక్కుకోవటంతో నలుగురు బాలికలతోపాటు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గాయపడ్డారు. వీరిలో అత్యధికులు 25 యేళ్ల లోపువారే. మృతుల్లో దాదాపు అందరూ కాలిన గాయాలతోకాక, దట్టమైన పొగలో చిక్కుకుని ఊపిరాడక మరణించిన వారే కావటం గమనించదగ్గది. నివాసగృహ సముదాయాలైనా, వాణిజ్యభవనాలైనా నిర్దిష్ట నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సివుంటుంది.
భవన నిర్మాణ సమయంలోనే నిరభ్యంతర పత్రం(ఎన్‌ఓసీ) కోసం దరఖాస్తు చేసుకోవటం, అధికారుల తనిఖీలు నిబంధనల ప్రకారం జరిగితీరాలి. ఒకసారి కాదు... భవనం పూర్తయ్యేలోగా రెండు మూడు సార్లు ఈ తనిఖీలుండాలి. అగ్నిమాపక వ్యవస్థలు సక్రమంగా ఉన్నాయా లేదా... అను కోని విపత్తు ముంచుకొచ్చినప్పుడు తప్పించుకోవటానికి అత్యవసర మార్గాలు ఏర్పాటు చేసుకున్నారా లేదా అనే అంశాలు వీటిల్లో తప్పనిసరి. ఎన్‌ఓసీకి చెల్లుబాటయ్యే కాలం పూర్తయినాక కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి. మళ్లీ అన్ని తనిఖీలూ ఉంటాయి. ఇవన్నీ కాగితాల్లో పొందుపరిచినంతగా ఆచరణలో కనబడవు. సమస్య మూలం అక్కడేవుంది.
లక్నోకూ, ఢిల్లీకీ మధ్య ఏమంత దూరం లేదు. ఢిల్లీలో ఈ నెల మొదట్లో జరిగిన రెండు విషాద ఘటనల్లో 30 మంది వరకూ మరణించారు. అనేకులు గాయపడ్డారు. మొదటి ఉదంతంలో అయిదంతస్తుల భవనం కుప్పకూలింది. రెండో ఘటన ఒక హోటల్ మంటల్లో చిక్కుకోవటానికి సంబంధించింది. ఇవి రెండూ మూడు రోజుల వ్యవధిలో జరిగాయి. కానీ ఉత్తరప్రదేశ్ అధికార యంత్రాంగం మన్నుతిన్న పాములా ఉండిపోయింది. ‘విషాదం చోటుచేసుకున్నది ఎక్కడో కదా... మనకేమిటి సంబంధమ’ని భావించే ధోరణి అన్ని వ్యవస్థల్లో పాతుకుపోయిన పర్యవసానంగా ఎక్కడో ఒకచోట ఇలాంటివి తప్పడం లేదు. లక్నోలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఆవాసానికే అనుమతు లున్నచోట వాణిజ్య కార్యకలాపాలు సాగుతుంటే అధికారుల్లో ఏ ఒక్కరికీ పట్టలేదు.
లక్నో అభివృద్ధి ప్రాధికార సంస్థ అధికారులు దీన్ని కూల్చటానికి 2016లో నోటీసు లిచ్చినా రెండు నెలల తర్వాత వాటిని ఉపసంహరించుకున్నారు. కారణమేమిటో ఎవరికీ తెలియదు! ఇలా ఏదో ఒక విభాగానికి సర్వాధికారాలూ ఇవ్వటం సమస్యలకు కారణ మవుతున్నది. స్థానిక పోలీసు విభాగం, అగ్నిమాపక విభాగం, విద్యుత్ శాఖ ఇంజినీర్లు, భవన నిర్మాణ నిపుణులు వగైరాలతో కమిటీ ఏర్పరిచి, నిర్దిష్ట వ్యవధిలో అది తప్పని సరిగా సమావేశమయ్యేలా... అనుమతులకూ, నిరాకరణలకూ స్పష్టమైన కారణాలు నమోదు చేసేలా ఉంటే ఇలా లోపాయికారీ వ్యవహారాలు సాగవు. కానీ మన ప్రభు త్వాలు ఆ పని చేయవు. ఘటన జరగ్గానే రావటం, సానుభూతులూ, సంతాపాలూ, ఎక్స్‌గ్రేషియా ప్రకటనలు మాత్రం రివాజు.
అగ్నిప్రమాదం గురించి తెలిశాక ఏకంగా 19 అగ్నిమాపక యంత్రాలు వచ్చాయి. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. కానీ చాలాసేపటివరకూ ప్రమాదంలో చిక్కుకున్న భవంతిలోకి వెళ్లటం శక్యం కాలేదు. ఆ భవంతికి ఇరుకైన మెట్ల దారి మినహా మరేం లేకపోవటంతో పక్క భవనాలనుంచి అప్పటికప్పుడు నిచ్చెనలు వేసి ఆ భవనంపైకి చేరుకుని పనిచేయాల్సివచ్చింది. బయటపడే మార్గం లేక వాష్‌రూంలో చేరి నలుగురు పిల్లలు కాపాడమంటూ ఫోన్లలో తమ తల్లిదండ్రులను వేడుకున్నారు. బయటకు వినపడేలా ఆర్తనాదాలు చేశారు. కానీ ఈలోగానే మృత్యుధూమం వారిని కాటేసింది.
అవి నివాస భవనాలైనా, వాణిజ్య సముదాయాలైనా తొలినాళ్ల అంచనాకు మించి విద్యుత్ వినియోగం ఉంటుంది. అధిక శక్తిగల విద్యుత్ ఉపకరణాల వాడకం పెరగటం, వాటికి అనుగుణమైన వైరింగ్ లేకపోవటంవల్ల లోడ్ ఎక్కువై షార్ట్ సర్క్యూట్ జరిగిమంటలంటుకుంటాయి. నిర్మాణానికి వాడేవన్నీ మండే స్వభావంగలవి కావటంతో మంటలు పెనువేగంతో వ్యాపిస్తున్నాయి. ఈ రెండేళ్లలో ఒక్క ఢిల్లీలోనే ఆసుపత్రుల్లో 78 అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. నివాసప్రాంతాల్లో వెయ్యికిపైగా ప్రమాదాలు సంభవించాయి. లక్నో విషాదమైనా ప్రభుత్వాల కళ్లు తెరిపించకపోతే అంతకన్నా దారుణం మరోటి ఉండదు.


