ఇరాన్‌తో యుద్ధం ముగిసే సమయానికి అమెరికా సర్వభ్రష్టమయ్యే సూచనలు కనబడు తున్నాయి. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ సలహాను శిరసావహించి యుద్ధంలోకి దిగిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఆయనతో చెడినట్టు కథనాలొస్తున్నాయి. గత ఏలుబడిలోనూ, రెండోసారి వచ్చాక అవకాశం దొరికినప్పుడల్లా నాటోను కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్న ట్రంప్ తాజాగా ఆ సంస్థ నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్టు బుధవారం ప్రకటించారు. ఇన్నేళ్లుగా తమను బహిరంగంగా దూషిస్తున్నా మౌనంగా ఉండిపోయిన దేశాలు, ఆయన మాట విని ఇరాన్‌తో అనవసర కయ్యానికి దిగదల్చు కోలేదని గత నెల రోజులుగా వాటి ప్రవర్తన చెబుతోంది. హార్మూజ్ జలసంధి దిగ్బంధాన్ని బద్దలు కొడదాం రమ్మని పిలుపునిస్తే ఎవరూ కదలకపోగా... దీంతో మాకేమిటి సంబంధమని స్పెయిన్ నిలదీసింది.
మొదట్లో సిద్ధపడినట్టే కనిపించిన జర్మనీ, ఫ్రాన్స్ చివరకు మౌనం పాటించాయి. డీగోగార్షియా సైనిక స్థావరాన్ని ఇవ్వబోమని యుద్ధం తొలినాళ్లలో తిరస్కరించిన బ్రిటన్ అటుతర్వాత అంగీకరించినా, ఇప్పుడు అది సైతం యుద్ధ నౌకలను పంపేదిలేదని చెబుతోంది. సైనిక విమానాలు ఇంధనం నింపు కోవటానికి అనుమతించబోమని ఇటలీ చెప్పగా, ఇజ్రాయెల్‌కు ఆయుధాలతో వెళ్లే విమా నాలను తమ గగనతలంలోకి రానీయబోమని ఫ్రాన్స్ ప్రకటించింది. ఇలా ఎవరికి వారు మొహం చాటేస్తుండగా నాటో నుంచి తప్పుకోవటం తప్ప దిక్కులేదని ట్రంప్ భావించ టంలో ఆశ్చర్యం లేదు.
నాటో ఆవిర్భవించి 77 యేళ్లు కావస్తోంది. స్థాపిత ఉద్దేశాలు మరిచి ప్రపంచ వ్యాప్తంగా అనేకచోట్ల అమెరికా ప్రయోజనాలు నెరవేర్చటానికి ముందుకురికిన ఆ సంస్థ వల్ల గతమంతా నెత్తుటితో తడిసింది. ఇన్ని దశాబ్దాల్లోనూ చోటుచేసుకున్న యుద్ధాల చిట్టా తీస్తే చాలావరకూ నాటోయే దోషిగా తేలుతుంది. పూర్వపు సోవియెట్ యూనియన్ నుంచి ముప్పు ముంచుకురాబోతున్నదని బెదిరి స్థాపించిన ఈ కూటమికి ఇన్నేళ్లలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఆ వైపునుంచి బెడద ఏర్పడింది లేదు. 1989లో ప్రచ్ఛన్న యుద్ధం ముగిశాక అప్పటి సోవియెట్ అధ్యక్షుడు గోర్బచెవ్ వార్సా కూటమిని రద్దుచేశాం గనుక, నాటోను కూడా రద్దు చేయమని కోరగా అందుకు అమెరికా, పాశ్చాత్య దేశాలు అంగీకరించలేదు. కనీసం దాన్లో తమను కూడా చేర్చుకోవాలని ప్రతిపాదించినా అవి తిరస్కరించాయి. పైపెచ్చు నాటోను ‘ఒక్క అంగుళం’ కూడా విస్తరించబోమని, రష్యా సరిహద్దు దేశాలను చేర్చుకునేది లేదని ఇచ్చిన వాగ్దానాన్ని ఉల్లంఘించాయి.
ప్రపంచంలో పనికిమాలిన సంస్థ ఏమైనా ఉన్నదంటే అది నాటోయే. ప్రచ్ఛన్న యుద్ధం ముగిశాక దాన్ని శాంతిస్థాపక సంస్థగా మారిస్తే ప్రపంచంలో సహజ వనరుల వినియోగం గరిష్ఠంగా పెరిగి సైనిక వ్యయానికయ్యే ఖర్చంతా ఆదా అయి అవిద్య, నిరు ద్యోగం, అధిక ధరలు, ప్రాణాంతక వ్యాధులు సమసిపోయేవి. ఐక్యరాజ్యసమితికయ్యే వార్షిక వ్యయంతో పోలిస్తే నాటో ఖర్చు 400 రెట్లు ఎక్కువ! ఇందులో అత్యధిక శాతం సొమ్ము మారణాయుధాలకూ, సైనిక స్థావరాల నిర్వహణకూ ఖర్చవుతుంది. నాటో పేరు చెప్పి వివిధ యూరప్ దేశాల్లో తిష్టవేసిన సైన్యంలో అమెరికా సైనికుల సంఖ్యే దాదాపు 20 లక్షలు! మిగిలిన దేశాలకు చెందినవారి సంఖ్య అందులో సగం కూడా ఉండదు. నాటో నుంచి వైదొలగుతామని ట్రంప్ చెబుతున్న కబుర్లు ఉత్త బడాయి మాటలు. అదే అమలైతే ఇంటిదారిపట్టిన లక్షలాదిమంది సైనికుల్ని పోషించలేక అమెరికా ఆర్థిక వ్యవస్థ చతికిల బడుతుంది. అది సజావుగా సాగాలంటే, డాలర్ పచ్చగా కళకళలాడాలంటే ప్రపంచంలో ఏదో మూల మారణాయుధం పేలాల్సిందే!
‘ఒక దశ దాటాక యుద్ధంలో నీకు ఆసక్తి లేకపోయినా, యుద్ధానికి నీపై ఆసక్తి తగ్గదు’ అని రష్యా విప్లవ సారథుల్లో ఒకరైన మార్క్సిస్టు సిద్ధాంతకర్త ట్రాట్సీ్క అంటాడు. కొరివితో తలగోక్కున్న చందంగా ఇరాన్‌పై అనవసర యుద్ధానికి దిగిన ట్రంప్‌కు దాన్నుంచి బయటపడటం ఎలాగో తెలియటం లేదు. అయినా రోజురోజుకూ పడిపోతున్న స్టాక్ మార్కెట్లను మాయజేయటం కోసం యుద్ధ విరమణ తథ్యమంటూ ప్రకటించటానికి ఆయన అలవాటుపడ్డారు. ఆ మాటెలా ఉన్నా ట్రంప్ బెదిరింపు నిజమై నాటో కనుమరుగైతే ప్రపంచం కాస్త ప్రశాంతంగా ఉంటుంది.


