ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాల దురాక్రమణ యుద్ధం పద్దెనిమిదో రోజుకు చేరుకున్నా ఆ రెండు దేశాలకూ దారీతెన్నూ తోచడం లేదు. మంగళవారం కీలకమైన ఇద్దరు ఇరాన్ నేతలు అలీ లారిజానీ, సులేమానీలనూ, బుధవారం మరో అగ్రశ్రేణి నేత ఇస్మాయిల్ ఖతీబ్‌నూ హతమార్చామని అమెరికా, ఇజ్రాయెల్ ఘనంగా చెప్పుకున్నా ఈ పరిణామాల తక్షణ ప్రభావం పెద్దగా లేదని ఇరాన్ సాగిస్తున్న ప్రతిదాడులే నిరూపిస్తున్నాయి. యుద్ధకాలంలో ఎవరి ఆదేశాల కోసమూ ఎదురుచూడకుండా ఏయే దశల్లో ఎలా స్పందించాలో దేశం నలుమూలలా మోహరించి ఉన్న సైనిక దళాలకు ముందే నిర్దేశించి ఉండటం ఇందుకు కారణం. యుద్ధరంగంలో సాధిస్తున్న విజయాల గురించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏం చెప్పుకుంటున్నా ఆయనకు ప్రతికూలతలే ఎదురవుతున్నాయని మంగళవారం నాటి రెండు పరిణామాలు చాటుతున్నాయి. హార్మూజ్ జలసంధి విముక్తికి యుద్ధ నౌకలతో, విమానాలతో తరలి రావాలన్న ట్రంప్ పిలుపును నాటో దేశాలు తిరస్కరించాయి.
‘మీ యుద్ధంతో మాకేమిటి సంబంధమ’ంటూ ఎదురు ప్రశ్నించాయి. దానికితోడు అమెరికా జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం (ఎన్‌సీటీసీ) చీఫ్ జో కెంట్ తన పదవికి రాజీనామా చేశారు. అమెరికా భద్రతకు ఏమాత్రం ముప్పులేని ఇరాన్‌పై యుద్ధం ప్రకటించటం అనైతికమని ఆయన ప్రకటించారు. జో కెంట్ మొదటి నుంచీ ట్రంప్‌కు గట్టి మద్దతుదారు. ‘మాగా’ ఉద్యమ సూత్రధారుల్లో ఒకరు. ట్రంప్ చుట్టూ చేరిన పాలనా వ్యవస్థలోని ఇజ్రాయెల్ అనుకూలురు, ప్రధాన మీడియా ఆయన్ను పక్కదోవ పట్టించాయన్నది కెంట్ అభియోగం. ట్రంప్‌ది అమాయకత్వమా, మూర్ఖత్వమా అన్న సంగతలా ఉంచి అమెరికా అధ్యక్షులుగా ఎవరున్నా ఇజ్రాయెల్ మాటే చెల్లుబాటవుతున్నదని చరిత్ర చూస్తే తెలుస్తుంది. అయితే ప్రస్తుత యుద్ధం ఇజ్రాయెల్ కోసమే అయినా రెండు దేశాలూ సమాన స్థాయిలో ఇరాన్‌పై విరుచుకుపడుతున్నాయి. అమెరికా ఇంతవరకూ 7,000 లక్ష్యాలపై విరుచుకుపడగా, ఇజ్రాయెల్ 7,600 దాడులు చేసిందని సోమవారం అమెరికా సెంట్రల్ కమాండ్ లెక్కలు చెబుతున్నాయి.
సైనికంగా ఇరాన్‌ను బలహీనపరచటం శక్తిమంతమైన అమెరికాకు పెద్ద కష్టం కాకపోవచ్చు. ఇరాన్ దగ్గరున్న డ్రోన్‌లూ, క్షిపణులూ కాలం గడుస్తున్నకొద్దీ తగ్గిపోవచ్చు. అదే పరిస్థితి కాస్త వెనకో ముందో ఇజ్రాయెల్, అమెరికాలకు కూడా ఎదురవుతుంది. కానీ దీర్ఘకాలం ఈ యుద్ధాన్ని సాగదీయటం ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థనూ, ఆ తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థనూ కోలుకోలేని విధంగా దెబ్బతీసే శక్తి ఇరాన్‌కుంది. గత నెల 24న జాతినుద్దేశించి ట్రంప్ ప్రసంగించినప్పుడు అందులో ఎక్కడా ఇరాన్ ప్రస్తావన లేదు. ఆకాశాన్నంటుతున్న గ్యాస్ ధరలు, ద్రవ్యోల్బణం గురించే ఆయన ఏకరువు పెట్టారు. ఇప్పుడు హార్మూజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించటంతో అవి పట్టపగ్గాల్లేకుండా విజృంభిస్తున్నాయి. మున్ముందు మరింత ఉగ్రరూపం దాలుస్తాయి. అందుకే ట్రంప్ విజయాలేవీ అమెరికన్లను రంజింప జేయలేక పోతున్నాయి.
కనుకనే అందరిపైనా ట్రంప్ ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. మాట వినని నాటో మాత్రమే కాదు... నిలదీస్తున్న రిపబ్లికన్లు, యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న ‘మాగా’ ఉద్యమ కారులు ఆయన్ను కుదురుగా ఉండనీయటం లేదు. ఆయన చేస్తున్న పరస్పర విరుద్ధ ప్రకటనలే అందుకు రుజువు. తొలుత బ్రిటన్ సాయాన్ని అర్థించి, ఆ తర్వాత హార్మూజ్ విముక్తికి సహకరించమని నాటోతోపాటు చైనాను కూడా వేడుకుని, వారంతా నిరాకరించాక ఇరాన్‌ను ఒంటరిగానే ఎదుర్కొంటామంటూ ఆర్భాటంగా ప్రకటించడం ఆయన మానసిక స్థితిని వెల్లడిస్తోంది.
నాటోను కోరడంలో వింతేమీ లేదు. కానీ ఆర్థిక రంగంలో సవాలుగా మారిన చైనాను అర్థించటం ట్రంప్ బలహీనతను బయటపెడుతోంది. 2003 నాటి ఇరాక్ దురాక్రమణ అమెరికాను ఆర్థికంగా దెబ్బతీస్తే, ఆ మేరకు చైనా లాభపడింది. ఇప్పుడు సైతం చైనా అలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తుండగా, అది సాయ పడుతుందని ట్రంప్ ఎలా అనుకున్నారో అనూహ్యం. మొత్తానికి ఆయన ఇరాన్ అనే ఊబిలో దిగబడ్డారు. దాన్నుంచి బయటపడటం సులభమేం కాదు.


