అరాచకమే విధానం | Sakshi Editorial On Exam Question Paper Leaks | Sakshi
Sakshi News home page

అరాచకమే విధానం

May 30 2026 3:55 AM | Updated on May 30 2026 3:55 AM

Sakshi Editorial On Exam Question Paper Leaks

మన విద్యావిధానానికేమైంది? ‘నీట్‌’ పోటీ పరీక్ష ప్రశ్నపత్రాల లీక్‌తో మొదలై ఇప్పుడు సీబీఎస్‌ఈ జవాబుపత్రాల తప్పుడు మూల్యాంకనం బయటికొచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన డీఎస్సీలో ప్రశ్నపత్రాలు లీకయ్యాయనీ, పోస్టుల్ని అమ్ముకున్నారనీ, అనర్హులకు దొంగ ర్యాంకులు పంచారనీ వెల్లడై ప్రభుత్వం అభాసుపాలవుతుండగానే, అక్కడ ఎస్సెస్సీ జవాబుపత్రాల మూల్యాంకనం పరమ అధ్వాన్నంగా సాగిందని బట్ట బయలైంది. ‘నీట్‌’కు ఈసారి 22.79 లక్షలమంది పోటీపడ్డారు.

వీరంతా అర్ధాకలితో మాడుతూ నెలల తరబడి పట్టణాల్లో, నగరాల్లో ఉండి కోచింగ్‌ సంస్థలకు వేలాది రూపాయలు అర్పించి చదువుకున్నవారు. కానీ ప్రశ్నపత్రాలు లీకై అదంతా వ్యర్థమైంది. పరీక్ష రద్దయ్యాక పలుచోట్ల నిరాశా నిస్పృహలతో అభ్యర్థులు ఆత్మహత్య చేసుకున్నారు. గత పన్నెండేళ్లలో 15 రాష్ట్రాల్లో 70 ప్రధాన లీక్‌లు చోటుచేసుకున్నాయని ఒక కథనం చెబుతోంది. అదే నిజమైతే ప్రశ్నపత్రాల వెల్లడి యాదృచ్ఛికంగా జరిగింది కాదు. దీనివెనక పెద్ద మాఫియానే ఉండొచ్చు. బట్టబయలైనప్పుడే సమస్య అందరికీ తెలుస్తోంది. 

నీట్‌ వివాదం సద్దుమణగకముందే సీబీఎస్‌ఈ వంతు వచ్చింది. ఈ ఏడాది పన్నెండో తరగతి పరీక్షలు 18 లక్షలమంది రాశారు. నిద్రాహారాలు మాని చదువుకున్న ఈ పిల్లల జవాబు పత్రాలు దిద్దటానికి ‘హైటెక్‌’ ఆలోచన చేసింది సంస్థ. ఆ పత్రాలను స్కాన్‌ చేసి వాటి డిజిటల్‌ ఫైళ్లను అప్‌లోడ్‌ చేసి మూల్యాంకనం చేసే విధానాన్ని అనుసరించింది. ఆన్‌ స్క్రీన్‌ మార్కింగ్‌(ఓఎస్‌ఎం) అనే ఈ విధానం గురించి తొలి పరీక్షకు పదిరోజుల ముందు పాఠశాలలకు చెప్పిందంటున్నారు. ఇలాంటి కొత్త విధానంపై పాఠశాల ప్రిన్సిపాళ్లకూ, విద్యార్థులకూ అవగాహన కల్పించాలనీ, అభ్యంతరాలు వ్యక్తమైతే ప్రత్యామ్నాయం ఆలోచించాలనీ దానికి లేకపోయింది.

తీరా ఈ నెల 13న ఫలితాలు వెలువడినప్పుడు లక్షలాదిమంది విద్యార్థులు నిర్ఘాంతపోయారు. 90 శాతం వరకూ మార్కులొస్తాయని నమ్మినవారి స్కోర్‌ అడ్డంగా పడిపోయింది. అప్పటికే హార్వర్డ్, బ్రౌన్, యేల్, కార్నెల్‌ వంటి ఉన్నత శ్రేణి విశ్వవిద్యాలయాల్లో సీట్లు లభించినవారు బావురుమన్నారు. ఈ అరకొర మార్కులతో కనీసం ఆ విశ్వవిద్యాలయాల గేట్లు తాకే అర్హత కూడా ఉండదు మరి! సీబీఎస్‌ఈలో నిరుడు ఉత్తీర్ణత శాతం 88.39 అయితే, ఈసారి 85.29 శాతానికి పడిపోయింది. 90 శాతంపైగా మార్కులొచ్చినవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. 

బ్రిటిష్‌ వలసపాలకుల హయాంలో 1921లో అత్యున్నత విద్యాప్రమాణాల కోసం స్థాపించిన ఒక సంస్థ కాలక్రమంలో... అంటే 1962లో ఇప్పుడున్న రూపానికి మారింది. అక్కడ ఉత్తీర్ణత సాధించి, సర్టిఫికెట్‌ తెచ్చుకుంటే ప్రపంచంలో అత్యున్నత శ్రేణి విశ్వ విద్యాలయాలు రెడ్‌ కార్పెట్‌ పరిచేంత ప్రతిష్ఠను సీబీఎస్‌ఈ సంపాదించుకుంది.

ఆ సంస్థ ఇప్పుడెంతగా భ్రష్టుపట్టిందంటే... పాఠశాలలు మొదలై మూణ్ణెల్లు గడిచి, ఒక యూనిట్‌ టెస్ట్‌ కూడా అయినాక, మెడమీద కత్తిపెట్టి త్రిభాషా సూత్రం పేరిట హిందీ లేదా సంస్కృతం నేర్చుకుతీరాలని శాసిస్తోంది. అందుకోసం పాఠ్యపుస్తకం కూడా లేదంటే... ఆరో తరగతి పుస్తకం చదవాలంటోంది. పైగా ఆ మార్కుల్ని పట్టించుకోబోనని అభయమిస్తోంది. ఇంతకన్నా అరాచకం ఉంటుందా అని అందరూ అనుకునేలోగానే ఈ ముదనష్టపు మూల్యాంకనం వెల్లడైంది. 

డీఎస్సీ నిర్వాకం బయటపడ్డాక, అంతా సవ్యంగానే ఉందంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం  దబాయిస్తున్న తరుణంలోనే తాజాగా టెన్త్‌ మూల్యాంకనం అడ్డదిడ్డంగా సాగిన వైనం బయటపడింది. విద్యార్థులు రాసిన కొన్ని జవాబుల్ని పట్టించుకోకపోవటం, దిద్దినా ఆ మార్కుల్ని పరిగణించకపోవటం వంటి చిత్రాలు చోటుచేసు కున్నాయి. తెలివైన విద్యార్థులు అనుమానం వచ్చి రీవెరిఫికేషన్, రీవాల్యూయేషన్‌ కోసం దరఖాస్తులు చేశాక ఇదంతా బయటికొచ్చింది.

పాలన గాలికొదిలిన చోట ఇలాంటి అరాచకాలు జరగటంలో ఆశ్చర్యమేమీ లేదుగానీ...‘నీట్‌’ నిర్వహించే నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ)కు ఏమైంది? సీబీఎస్‌ఈ ఎలా ధ్వంసమైంది? పాలకులు జవాబుదారీ తనంతో వ్యవహరించటం, జరిగే తప్పులకు నైతిక బాధ్యత తీసుకోవటం తప్పనిసర య్యేలా ప్రజలు ఒత్తిళ్లు తెస్తేనే ఈ దుఃస్థితి మారుతుంది. అప్పుడే ఇతర వ్యవస్థలు కూడా తమ వంతు పాత్ర పోషిస్తాయి. లేకుంటే అవి కూడా చోద్యం చూస్తుంటాయి.

Advertisement
 
Advertisement
Advertisement