కోల్‌కతా టూ చెన్నయ్‌! | Sakshi Editorial On BJP By Vardhelli Murali | Sakshi
Sakshi News home page

కోల్‌కతా టూ చెన్నయ్‌!

May 10 2026 12:00 AM | Updated on May 10 2026 10:29 AM

Sakshi Editorial On BJP By Vardhelli Murali

జనతంత్రం

బెంగాల్‌ విజయంతో బీజేపీ చరిత్రలో ఒక ప్రధాన ఘట్టం పూర్తయినట్టే. జాతీయోద్యమ కాలంలో సమున్నతంగా రెపరెప లాడిన సాంస్కృతిక పతాకం బెంగాల్‌! ‘ఇవాళ బెంగాల్‌ ఏమని ఆలోచిస్తుందో రేపు మిగతా భారతదేశం అదే ఆలోచిస్తుంద’ని గోపాలకృష్ణ గోఖలే చేసిన ప్రశంస చరిత్ర ప్రసిద్ధమైనది. జనసంఘ్‌ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ సొంత రాష్ట్రం కూడా బెంగాలే. బీజేపీ తీవ్రంగా ద్వేషించే కమ్యూనిస్టు భావ జాలానికి దేశంలో ఒక దిక్సూచి మాదిరిగా దాదాపు అర్ధ శతాబ్దం పాటు బెంగాల్‌ నిలబడింది. అటువంటి బెంగాల్‌లో అఖండ విజయాన్ని సాధించినందున ఆ విజయానందం బీజేపీ శ్రేణుల్లో తొణికిసలాడుతున్నది. సువేందు అధికారి మంత్రివర్గ ప్రమాణ స్వీకారం వేదికపైనుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగాలీ ప్రజలకు సాష్టాంగ ప్రణామం చేశారు. ఎన్డీఏ దిగ్గజాలతో పాటు, ఆ కూటమికి చెందిన అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులు హాజరై ఈ కార్యక్రమాన్ని ఒక జాతీయ పర్వదినంగా మార్చారు.

బెంగాల్‌ సరే, బీజేపీది చారిత్రాత్మకమైన విజయమే. మరి ఒక్క సీటే గెలిచిన తమిళనాడులో ఏ ప్రయోజనాన్ని ఆశించి బీజేపీ హైటెన్షన్‌ డ్రామాను నడిపించింది? అత్యధిక సంఖ్యా బలం కలిగిన విజయ్‌ ఐదు రోజులపాటు గవర్నర్‌ కటాక్షం కోసం ఎందుకు నిరీక్షించవలసి వచ్చింది? ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రానప్పుడు ఏకైక పెద్ద పార్టీగా అవతరించిన పక్షం నేతను గవర్నర్‌ ఆహ్వానించాలనీ, శాసనసభ వేదికపై బలాన్ని నిరూపించుకునే అవకాశాన్నీయాలనీ గతంలో సుప్రీంకోర్టు విస్పష్టంగా ప్రకటించింది. మెజారిటీ బలపరీక్ష జరగాల్సింది శాసనసభలో తప్ప, రాజ్‌భవన్‌ (లోక్‌ భవన్‌)లో కాదని కూడా సర్వోన్నత న్యాయస్థానం కుండబద్దలు కొట్టింది. కేంద్ర – రాష్ట్ర సంబంధాలపై ఏర్పాటైన సర్కారియా, పూంఛీ కమిషన్లు కూడా ఇదే మాటను చెప్పాయి. సంప్రదాయాలు కూడా అవే సంకేతాలు ఇస్తున్నాయి. 1996లో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 161 స్థానాలను గెలుచుకొని ఏకైక పెద్ద పార్టీగా అవతరించింది. 140 స్థానాలతో కాంగ్రెస్‌ రెండో స్థానంలో నిలిచింది. లోక్‌సభలో మెజారిటీ సీట్ల కంటే బీజేపీకి 111 సీట్లు తక్కువున్నాయి. అయినప్పటికీ సంప్రదాయాన్ని అనుసరించి నాటి రాష్ట్రపతి డాక్టర్‌ శంకర్‌ దయాళ్‌ శర్మ బీజేపీ నేత వాజ్‌పేయిని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించారు.

మెజారిటీ నిరూపించుకోలేక 13 రోజుల్లోనే ఆ ప్రభుత్వం కూలిపోయింది. దేశ ఆర్థిక గమనాన్నే ఒక మలుపు తిప్పిన పీవీ నరసింహారావు కూడా మైనారిటీ ప్రభుత్వాన్నే చాలా కాలంపాటు నడిపారు. 240 సీట్లే గెలిచిన కాంగ్రెస్‌ పార్టీ 1991లో పెద్ద పార్టీగా అవతరించడంతో, మెజారిటీకి 32 సీట్లు తక్కువ ఉన్న ప్పటికీ నాటి రాష్ట్రపతి ఆర్‌.వెంకట్రామన్‌ ప్రభుత్వ ఏర్పాటుకు పి.వి. నరసింహారావును ఆహ్వానించారు. 2018లో కర్ణాటక ముఖ్యమంత్రిగా బీజేపీ నేత యడ్యూరప్ప కూడా ఇదే పద్ధతిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరి, ప్రస్తుత తమిళనాడు తాత్కాలిక గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ ఆర్లేకర్‌కు ఎందుకింత ధర్మం మీమాంస ఏర్పడిందో, ఎందుకు విజయ్‌ను పడిగాపులు పడేలా చేశారో తెలుసుకోవడం అసాధ్యమేమీ కాదు.

బెంగాల్‌ మాదిరిగానే తమిళనాడు కూడా ఘనమైన సాంస్కృతిక వారసత్వ సంపద కలిగిన రాష్ట్రం. వర్తమాన చరిత్రలో ఆర్థిక పారిశ్రామిక రంగాల్లో ముందంజలో ఉన్న ఘనత దానిది. సంప్రదాయాలూ– హేతుబద్ధమైన ఆలోచనలూ సహజీవనం చేసే గతిశీలత కలిగిన ప్రాంతం. ఎన్ని ప్రయత్నాలు చేసినా తమిళనాడులో బీజేపీకి అడుగు మోపే అవకాశం చాలా కాలంగా చిక్కడం లేదు. జయలలిత మరణం తర్వాత ఆమె పార్టీ అన్నాడీఎంకేను లొంగదీసుకుని ఎన్డీఏ కూటమిలో చేర్చు కున్నా కూడా బీజేపీకి ఆశించిన ఫలితం రావడం లేదు. ఇప్పుడు రెండు ద్రవిడ పార్టీలను వెనక్కు నెట్టి దళపతి విజయ్‌ అత్యధిక స్థానాలు సాధించడంతో తమిళ రాజకీయాలు బీజేపీకి మరింత పజిల్‌గా మారాయి.

పూర్తి మెజారిటీకి కేవలం 10 సీట్లు మాత్రమే తక్కువ గెలిచిన విజయ్, గవర్నర్‌ నిర్ణయం కోసం ఐదు రోజులుగా నిరీ క్షించవలసి వచ్చింది. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంల మద్దతు తర్వాత పూర్తి మెజారిటీకి కేవలం ఒకే ఒక్క సీటు తక్కువున్నప్ప టికీ, మూడుసార్లు గవర్నర్‌ను విజయ్‌ కలిసి శాసనసభలో తన మెజారిటీని నిరూపించుకుంటానని చెప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరకు నాలుగోసారి శనివారం సాయంత్రం 121 మంది మద్దతుదారుల జాబితాతో, వివిధ పార్టీల మద్దతు లేఖలతో కలిసిన తర్వాత ఆయనకు ప్రమాణ స్వీకారం చేసే అనుమతి లభించింది. బీజేపీ వ్యూహం ప్రకారమే గవర్నర్‌ ఈ నాటకాన్ని నడిపారనే అభిప్రాయం జనసామాన్యంలో సహజంగానే వ్యాపించింది. 

తమిళగ వెట్రి కళగం (విజయ్‌ పార్టీ)తో కలిసి అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం తొలుత ఆ పార్టీ నాయకుడు పళని స్వామి ప్రయత్నాలు చేశారు. అది కుదరకపోవడంతో డీఎంకే, అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాద నతో ప్రయత్నాలు చేశారని వార్తలు వచ్చాయి. దీనికి స్టాలిన్‌ అంగీకరించలేదని తెలుస్తున్నది. బీజేపీ ఆశీస్సులు లేకుండా పళని స్వామి ఇటువంటి ప్రయత్నాలు చేస్తారని ఊహించలేము. కేంద్రంలో అధికారంలో ఉన్న తమ సహకారం లేకుండా రాజ కీయాలు నడపడం అంత తేలిక కాదని విజయ్‌ గ్రహించడం కోసమే బీజేపీ ఈ సాగదీత డ్రామాను నడిపించినట్టు కూడా మరో వాదన ఉన్నది.

పళని స్వామి ప్రయత్నాలేమో గానీ, ఆయన పార్టీకే ఎసరు పెట్టే పరిణామాలు శనివారం నాడు జరిగాయి. ఆయన నిర్వ హించిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశానికి ఆరుగురు గైర్హాజర య్యారు. అన్నాడీఎంకేలో మరో సీనియర్‌ నాయకుడు ఆర్‌వీ షణ్ముగం నాయకత్వంలో 36 మంది ఎమ్మెల్యేలు సమావేశ మయ్యారనే వార్తలు వెలువడ్డాయి. అసెంబ్లీలో మెజారిటీ నిరూ పించుకునే అవకాశం విజయ్‌కిస్తే అన్నాడీఎంకేకు ఉన్న 47 మందిలో మెజారిటీ సభ్యులు విజయ్‌కు అనుకూలంగా ఓటేస్తా రనే ఆంతరంగిక సమాచారం బీజేపీకి ఉన్నందువల్లనే అటువంటి పరిస్థితి రానీయకుండానే ఈ తాత్సారాన్ని గవర్నర్‌ కొన సాగించారనే అభిప్రాయం ఉన్నది. తిరుగుబాటు ఎమ్మెల్యేలను బుజ్జగించడం కోసమే ప్రభుత్వాన్ని తాము ఏర్పాటు చేయబోతు న్నామనే డ్రామాను పళని స్వామి నడిపిస్తున్నట్టు తెలుస్తున్నది.

అన్నాడీఎంకేను అవమానకర పరిస్థితి నుంచి గట్టెక్కించ డానికి గవర్నర్‌ ద్వారా బీజేపీ సేఫ్‌ గేమ్‌ ఆడితే మరో రకమైన పాజిటివ్‌ గేమ్‌ను డీఎంకే నడిపించింది. డీఎంకే కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ స్టాలిన్‌తో మాట మాత్రమైనా చెప్పకుండానే విజయ్‌కు మద్దతు ప్రకటించి కూటమి ధర్మాన్ని గంగలో కలిపింది. నిజానికి విజయ్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి స్టాలిన్‌ వ్యతిరేకం కాదు. పెద్ద పార్టీగా గెలిచిన టీవీకేను ప్రభుత్వం ఏర్పాటుకు పిలవాలని గవర్నర్‌కు కూడా సూచించారు. అయితే ఈ వ్యవహారాన్ని భవిష్యత్‌ రాజకీయ అవసరాల దృష్ట్యా తనకు అనుకూలంగా మలుచుకోవడానికి స్టాలిన్‌ ప్రయత్నించారు. స్టాలిన్‌తో సంబంధం లేకుండా విజయ్‌కి మద్దతు ప్రకటించిన కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసు కున్నారు. మరోసారి మిత్రద్రోహానికి పాల్పడిన అపకీర్తిని కాంగ్రెస్‌ పార్టీ మూట కట్టుకున్నది.

స్టాలిన్‌ సలహా మేరకే సీపీఎం, సీపీఐ, వీసీకే, ఐయూ ఎంఎల్‌ పార్టీలు ఒకరి తర్వాత మరొకరు టీవీకేకు మద్దతు ఇచ్చినట్టు సమాచారం. ప్రభుత్వంలో అన్నాడీఎంకే ఏ రూపంలోనూ భాగస్వామి కాకుండా ఉండేందుకే స్టాలిన్‌ ఈ ఎత్తుగడను అవలంబించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ప్రభుత్వంలోనూ వీసీకేకు కీలక పదవి లభించేలా పావులు కదిపి పరోక్షంగా తన పలుకుబడిని కొనసాగించేందుకు ప్రయత్నించారనే వాదన కూడా ఉన్నది. వీసీకే ఉపముఖ్యమంత్రి పదవిని డిమాండ్‌ చేస్తున్నదనే వార్తలు కూడా శనివారం వెలువడ్డాయి. అయితే చివరకు బేషరతుగానే వీసీకే మద్దతు లేఖను  సమర్పించింది. లోపాయికారి షరతులు ఏమైనా ఉన్నాయేమో తెలి యదు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆలస్యంగానైనా విజయ్‌కు లైన్‌ క్లియర్‌ అయింది.

ప్రస్తుతానికైతే తమిళనాడులో బీజేపీ పాచిక పారినట్టు కనిపించడం లేదు. అన్నాడీఎంకేను ముందు పెట్టుకొని వేసిన ఎత్తులు స్టాలిన్‌ అప్రమత్తత వల్ల ఫలించలేదు. ఇకముందు ఎటువంటి వ్యూహాన్ని అనుసరిస్తుందో వేచి చూడాల్సి ఉంది. పదేళ్లపాటు విరామమెరుగని పోరాటం చేసి బెంగాల్‌ను గెలుచుకున్న బీజేపీ తమిళనాడుపై ఆశలు వదులుకుంటుందని భావించలేము. శనివారం కోల్‌కతాలో జరిగిన సువేందు ప్రమాణ స్వీకార సభలో పాల్గొన్న ప్రధాని మోదీ సోమవారం నాడు సోమనాథ్‌ ఆలయ పునరుద్ధరణ జరిగిన 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అక్కడికి వెళుతున్నారు. ఈ కార్యక్రమానికి భారత ప్రభుత్వం చాలా ప్రాధాన్యతనిస్తున్నది. సరిగ్గా వెయ్యేళ్ల కింద భారత్‌ పైకి దండెత్తి వచ్చిన మహమ్మద్‌ గజనీ సోమనాథ్‌ ఆలయాన్ని ధ్వంసం చేసి అక్కడ భద్రపరిచిన అపార ధనరాశిని కొల్లగొట్టాడని చరిత్ర చెబుతున్నది. మహమ్మదీయ దాడులు ఈ ఆలయంపై పలుమార్లు జరిగాయని కూడా చరిత్ర లిఖించింది.

మత దురహంకారాలు, విద్వేషాలు చెలరేగిన మధ్య యుగాల నాటి పరిస్థితికి సోమనాథ్‌ ఆలయ విధ్వంసం ఒక ప్రతీక. ఈ గజనీల లక్ష్యం కేవలం సంపద లూటీ మాత్రమే కాదనీ, ప్రజల విశ్వాసాలను దెబ్బతీయటం కూడా వాటి ధ్యేయ మనీ అల్‌బెరూనీ అనే పర్షియన్‌ పండితుడు తన రచనల్లో విశ్లే షించాడు. ఇదంతా వెయ్యేళ్లనాటి మాట. మతమౌఢ్యాలు రాజ్య మేలిన నాటి పరిస్థితి. ఈ వెయ్యేళ్లలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. మన దేశం లౌకిక రాజ్యాంగాన్ని రచించుకున్నది. ఈ నేపథ్యంలో సోమనాథ్‌ ఆలయం పునరుద్ధరణ 75వ వార్షికోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం భుజానికి ఎత్తుకొని దేశవ్యాప్తంగా అన్ని మీడియా మాధ్యమాల్లో భారీ ప్రకటనలను గుప్పించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రభుత్వాలతో సంబంధం లేకుండానే సోమనాథ్‌ ఆలయానికి హిందూ సమాజంలో విశిష్ట స్థానం ఉన్నది.

దేశంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఆది జ్యోతిర్లింగంగా సోమనాథ్‌ ప్రసిద్ధి చెందింది. బెంగాల్‌లో విజయం అనే ఒక చారిత్రకమైన మైలురాయిని బీజేపీ దాటిన వెంటనే సోమనాథ్‌ ఆలయ సందర్భం రావడం యాదృచ్ఛికమే కావచ్చు. కానీ జాతీయతను, మతాన్ని కలగా పులగం చేసే బీజేపీ రాజకీయ వ్యూహానికి ఉపకరించే విధంగానే ఈ సందర్భాన్ని బీజేపీ మలుచుకుంటున్నది. రాజ్యాంగ లౌకిక స్వభావాన్ని బలహీనపరచడంతో పాటు తన సైద్ధాంతిక విరో ధులైన కమ్యూనిస్టుల భావజాలాన్ని కూడా తుడిచేశామన్న ఆనందం బీజేపీ శ్రేణుల్లో కనిపిస్తున్నది. ఈ ఏడాది మార్చి 31 డెడ్‌లైన్‌ పెట్టి మరీ బుల్లెట్‌ కమ్యూనిస్టులను అణచివేశామనీ, కేరళలో ఎల్డీఎఫ్‌ ఓటమితో బ్యాలెట్‌ కమ్యూనిస్టులు కూడా అంతరించినట్టేననీ వారు భావిస్తున్నారు. 

ప్రధాని కూడా తన మనోగతాన్ని దాచుకోలేదు. ప్రజల ఆలోచనల్లో వచ్చిన మార్పు ఫలితంగానే ప్రపంచంలోనూ, దేశంలోనూ, అడవుల్లోనూ కమ్యూనిస్టులు అంతరించారని మొన్నటి విజయోత్సవ సభలో ప్రకటించారు. బహుశా ఈ సంగతి డోనాల్డ్‌ ట్రంప్‌కు తెలిసినట్టు లేదు. మమ్దానీ వంటి సోషల్‌ డెమోక్రాట్‌లను చూసి కూడా కమ్యూనిస్టులున్నారని ఆయన కంగారు పడుతున్నారు. కోల్‌ కతా, చెన్నయ్‌ నగరాల్లో శనివారం నాడు ఆవిష్కృతమైన రెండు సన్నివేశాలు బీజేపీ రాజకీయ వ్యూహానికి అద్దం పడుతున్నాయి. కోల్‌కతాలో అంతా అంగరంగ వైభోగం. చెన్నయ్‌లో విజేతకు ఆఖరి నిమిషం దాకా అంతులేని టెన్షన్‌. 


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com 

Advertisement
 
Advertisement
Advertisement