ఫిరాయింపులు... ప్రశ్నలు! | Sakshi Editorial On Rajya Sabha members defections | Sakshi
Sakshi News home page

ఫిరాయింపులు... ప్రశ్నలు!

Apr 29 2026 1:36 AM | Updated on Apr 29 2026 1:36 AM

Sakshi Editorial On Rajya Sabha members defections

ఆప్‌ నుంచి నిష్క్రమించిన ఏడుగురు రాజ్యసభ సభ్యులతో ఏర్పడిన ఎంపీల బృందం బీజేపీలో విలీనం కావడాన్ని గుర్తిస్తూ రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ నిర్ణయం తీసుకోవటంతో ఫిరాయింపుల చట్టం ప్రహసనప్రాయమని మరోసారి తేలిపోయింది. బహుశా ఎన్నికల ముంగిట్లోవున్న పంజాబ్‌లో రేపో మాపో ఆప్‌ ప్రభుత్వానికీ ఇలాంటి గండం తప్పకపోవచ్చు. ఆప్‌ పుట్టుక, ఎదుగుదల భిన్నమైనవి. 2011–12 మధ్య దేశంలో హోరెత్తిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అగ్రభాగాన నిలిచిన కొద్దిమంది రాజకీయేతర నేతల్లో కేజ్రీవాల్‌ ఒకరు. ఆయన మాదిరే పూర్వాశ్రమంలో ఉన్నతోద్యోగ వర్గంలో, భిన్న సామాజిక రంగాల్లో పనిచేసి కొన్ని ఆదర్శాలు నమ్మి వచ్చినవారు చాలామంది ఉన్నారు. ఆదర్శాల్లో పుట్టి, వైవిధ్యాలతో ఎదిగి, స్వల్పకాలంలోనే మధ్యతరగతిలో పాతుకుపోయిన ఆ పార్టీ అచిరకాలంలోనే సంక్షోభంలో కూరుకుపోయింది. పార్టీ సారథుల్లో భిన్నాంశాలపై అప్పటికే ఉన్న మౌలిక విభేదాలు పలు నిష్క్రమణలకు దారితీశాయి. శాంతి భూషణ్, ప్రశాంత్‌ భూషణ్, యోగేంద్ర యాదవ్, అడ్మిరల్‌ రాందాస్‌ వంటి లబ్ధప్రతిష్టులైనవారిని కీలక పదవులనుంచి తప్పించారు. కొందరు వారికై వారు తప్పుకున్నారు. అటు తర్వాత మధ్యలో అడపా దడపా ఒకరిద్దరు నేతలు నిష్క్రమించినా ఇప్పుడు రాఘవ్‌ చడ్డా కొట్టిన దెబ్బ సామాన్యమైనది కాదు. 

ఒక సమస్య విషయంలో పార్టీ వైఖరితో ఏకీభావం లేనప్పుడూ, దాని సిద్ధాంతాలు దారితప్పుతున్నాయనుకున్నప్పుడూ బయటకుపోతే ఎవరూ తప్పుబట్టరు. కానీ పెద్ద మాటలు మాట్లాడుతూ, గంభీరమైన ఉపన్యాసాలిస్తూ కాస్తయినా నైతికత పాటించాలన్న స్పృహ లేనివారిని జనం చీదరించుకుంటారు. ఒక సాధారణ గుమాస్తా సంస్థ నుంచి తప్పుకుంటే మూణ్ణెల్ల నోటీసు ఇవ్వాలన్న నిబంధన ఉంటుంది. లేకుంటే సంస్థలు వాటి పద్ధతిలో అవి చర్య తీసుకుంటాయి. ప్రజానీకం సమస్యల్ని చర్చిస్తూ వారి సంక్షేమానికీ, భద్రతకూ అవసరమైన చట్టాలు తీసుకొచ్చే కర్తవ్యంలో నిమగ్నమై ఉండాల్సినవారికి మాత్రం ఏ  నిబంధనా ఉండొద్దా? వారి ప్రవర్తన నలుగురికీ ఆదర్శప్రాయం కావొద్దా?

రాజీవ్‌ గాంధీ హయాంలో 1985లో ఈ ఫిరాయింపుల జాడ్యాన్ని వదిలిస్తామంటూ 52వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి రాజ్యాంగంలో పదో షెడ్యూల్‌ చేర్చారు. కానీ అది ఎందుకూ కొరగాకుండా పోయిందని తేలిన చాన్నాళ్ల తర్వాత 2003లో 91వ రాజ్యాంగ సవరణ వచ్చింది. అందులో కేవలం లెజిస్లేచర్‌ పార్టీలో మూడింట రెండొంతుల మంది తప్పుకుని వేరే పార్టీలో విలీనమైతే సరిపోదనీ, ఆ చీలిక, విలీనం పార్టీ స్థాయిలో కూడా కనబడాలనీ నిర్దేశించింది. దురదృష్టమేమంటే... ఈ ప్రాతిపదికన ఫిరాయింపులు రాజ్యాంగ విరుద్ధమని మన న్యాయస్థానాలు తీర్పులిచ్చిన సందర్భాలు లేవు. ఫిరాయింపు సభ్యులను అనర్హులుగా ప్రకటించాలని సభాధ్యక్షుల దగ్గర ఫిర్యాదులైతే దాఖలవుతున్నాయి. కానీ వాటిపై వేగంగా నిర్ణయం తీసుకున్న ఉదంతాలు లేవు. సుప్రీంకోర్టు గడువు విధించటంతో తెలంగాణ స్పీకర్‌ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఇటీవల నిర్ణయం తీసుకోక తప్పలేదు. కానీ బీఆర్‌ఎస్‌ వినతుల్ని ఆయన తోసిపుచ్చారు. గతంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ లోక్‌సభలోనూ, ఏపీ అసెంబ్లీలోనూ చేసిన ఫిర్యాదులు తేలకుండానే ఆ సభల పదవీకాలం ముగిసిపోయింది. 

ఫిరాయించటానికి సృజనాత్మక మార్గాలు ఎంచుకోవటం నేతలకు వెన్నతో పెట్టిన విద్య అయిపోయింది. ఏపీలో ఆ మధ్య వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు చెందిన కొందరు రాజ్యసభ సభ్యులు ఏకంగా అయిదేళ్లకు మించి గడువున్న ఎంపీ పదవులకు కూడా రాజీనామా చేసి పోయారు. ఆ తర్వాత వారిలో కొందరు బీజేపీ, టీడీపీల పంచన ‘ఎన్నికయ్యారు’. నైతిక విలువలు లేకపోవటమే పెద్ద అర్హతగా మారిన వర్తమానంలో ఇలాంటి వెర్రిమొర్రి పోకడలు కనబడటం వింతేం కాదు. రాఘవ్‌ చడ్డా నిష్క్రమించదల్చుకున్నప్పటి నుంచీ మధ్యతరగతి పెను సమస్యలుగా భావించేవాటిని సభలో ప్రస్తావించటం, వాటిల్లో కొత్తేం లేకపోయినా అవి వైరల్‌ కావటం వెనకున్న సారాంశం చాలామంది గ్రహించకపోలేదు. ఏదేమైనా ఫిరాయింపులకు కళ్లెం పడనంత కాలమూ, ఈ గోడ దూకుళ్లు ఆగనంత కాలమూ మన ప్రజాస్వామ్యానికి అర్థం, పరమార్థం ఉండదు.  

Advertisement
 
Advertisement
Advertisement