మన ప్రాచీనులు అడవులను దైవంగా ఆరాధించేవారు. అడవులను జీవజాలానికి ప్రాణాధారంగా చూసేవారు. అడవులను పవిత్ర తపోభూములుగా పరిగణించేవారు. అరణ్యాల ప్రస్తావన లేని పురాణేతిహాసాలేవీ మనకు లేవు. ఉద్యాన వర్ణన లేని ప్రబంధాలేవీ మనకు లేవు. అరణ్యకాండ లేని రామాయణాన్ని, అరణ్యపర్వం లేని మహాభారతాన్ని మనం ఊహించుకోలేం. ప్రాచీన వేదర్షులు సైతం వన ప్రాశస్త్యాన్ని ప్రస్తుతించారు. ‘అంజనగంధిం సురభిం బహున్నామ కృషీవలామ్/ ప్రాహం మృగాణాం మాతరమరణ్యానిమశంసిషమ్’ అని ఋగ్వేదంలోని ‘అరణ్యాని సూక్తం’ చెబుతోంది. అంటే, అంజనంలా సుగంధభరితమైనది, అనేక జంతువులకు తల్లివంటిది అయిన అరణ్యదేవతను స్తుతిస్తున్నాను అని అర్థం.
‘దశకూప సమా వాపీ దశవాపీ సమో హ్రదః/ దశహ్రద సమః పుత్రో దశపుత్ర సమో ద్రుమః’ అని ‘పద్మపురాణం’ చెబుతోంది. అంటే, పది బావులకు సమానం ఒక చెరువు, పది చెరువులకు సమానం ఒక సరస్సు, పది సరస్సులకు సమానం ఒక పుత్రుడు, పదిమంది పుత్రులకు సమానం ఒక వృక్షం అని అర్థం. ‘అశ్వత్థమేకం పిచుమందమేకం న్యగ్రోధమేకం దశతింత్రిణీకం/ కపిత్థ బిల్వామలకత్రయాంచ పంచామ్రవాపీ నరకం న వశ్యేత్’– రావిచెట్టు, వేపచెట్టు, మర్రిచెట్టు ఒక్కొక్కటి చొప్పున; పది చింతచెట్లు; మూడేసి వెలగచెట్లు, మారేడుచెట్లు, ఉసిరిచెట్లు; ఐదు మామిడిచెట్లు పెంచినవాడికి నరకం ఉండదు అని స్కాందపురాణం చెబుతోంది. వేద పురాణేతిహాసాలను గమనిస్తే, ప్రాచీనులు చెట్టు చేమలతో నిండిన అడవులకు ఎంతటి విలువనిచ్చేవారో అర్థమవుతుంది.
ప్రాచీనకాలంలో రాజులు కూడా అడవుల సంరక్షణను బాధ్యతగా భావించేవారు. ‘ద్రవ్యవనకర్మాంతాశ్చ ప్రయోజయేత్/ ద్రవ్యవనచ్ఛిదాం చ దండం కారయేత్’ అని కౌటిల్యుడి అర్థశాస్త్రం చెబుతోంది. అంటే, అటవీ సంపదనకు సక్రమంగా వినియోగించాలి. అక్రమంగా అడవులను నరికివేసేవారిని శిక్షించాలి అని అర్థం. కౌటిల్యుడు ‘అర్థశాస్త్రం’లో అభయవనాలు, హస్తివనాలు వంటి రకరకాల అడవుల సంరక్షణ కోసం పాటించవలసిన విధి విధానాలను వివరంగా చెప్పాడు. దాదాపు పదివేల ఏళ్ల కిందట– నాగరికతలు మొదలైన కాలంలో భూమ్మీద దాదాపు అరవై శాతం అడవులే ఉండేవి. పద్దెనిమిదో శతాబ్దిలో పారిశ్రామిక విప్లవం మొదలయ్యేంత వరకు అడవుల పరిమాణం దాదాపు ఇదే స్థాయిలో ఉండేది. పారిశ్రామిక విప్లవం నాటి నుంచి అడవులు క్షీణించడం మొదలైంది.
ఆధునికత, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ అడవుల విస్తీర్ణాన్ని కబళించడం మొదలైంది. ఇప్పుడు భూమ్మీద దాదాపు ముప్పయి శాతం అడవులు మాత్రమే మిగిలి ఉన్నాయి. పారిశ్రామిక విప్లవం నాటి నుంచి నేటి వరకు భూమ్మీద ఉన్న అడవుల విస్తీర్ణం సగానికి సగం క్షీణించి పోయింది. ప్రస్తుత శతాబ్ది మొదలైన తొలి ఇరవై ఏళ్లలోనే ఏకంగా ఆరు శాతం మేరకు అడవులు తరిగిపోయాయి. మన దేశంలోనైతే, స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు సగానికి సగం అడవులు అంతరించిపోయాయి. ఒకవైపు అడవుల విస్తీర్ణం తరిగిపోతుంటే, మరోవైపు మరుభూముల విస్తీర్ణం పెరుగుతోంది. గడచిన శతాబ్ద కాలంలో సహారా ఎడారి విస్తీర్ణం పది శాతం పెరిగింది.
‘ఒక అడవిని సృష్టించడం కంటే ఒక ఎడారిని సృష్టించడం తేలిక కావడమే విచారకరం’ అన్నాడు ఇంగ్లిష్ శాస్త్రవేత్త, పర్యావరణవేత్త జేమ్స్ లవ్‌లాక్. పనులు తేలిక చేసుకోవడానికి అలవాటుపడ్డ ఆధునికులు అడవులను సృష్టించే శ్రమ తీసుకోకుండా, తేలికగా ఎడారులను సృష్టించుకుంటున్నారు. అడవులు పుడమికి ఊపిరితిత్తులు. ఆధునిక మానవులు వాటికి తూట్లు పొడుస్తున్నారు. పర్యవసానంగా భూతాపం పెరిగి, మనుషులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మనుషులకు ఊపిరాడాలన్నా, సకాలంలో వానలు కురిసి పంటలు పండాలన్నా, ఇంకా ఈ భూమ్మీద మానవాళి మరిన్ని కాలాలపాటు మనుగడ సాగించాలన్నా, మనం ఇప్పటికైనా మేలుకొని అడవులను కాపాడుకోవాలి. అడవులన్నీ నశించాక మానవాళి చేసే ఆక్రందనలు అరణ్యరోదనలే అవుతాయి.


