కల్లోల కాలంలో శిఖరాగ్రం! | Sakshi Editorial On ASEAN Summit | Sakshi
Sakshi News home page

కల్లోల కాలంలో శిఖరాగ్రం!

May 8 2026 12:39 AM | Updated on May 8 2026 12:39 AM

Sakshi Editorial On ASEAN Summit

ప్రపంచం పెనుసంక్షోభంలో చిక్కుకున్న తరుణంలో ఫిలిప్పీన్స్‌లోని సెబూ నగరంలో శుక్రవారం ఆగ్నేయాసియా దేశాల సంస్థ (ఏసియాన్‌) శిఖరాగ్ర సదస్సు ప్రారంభం కాబోతోంది. దీనికి ముందు గురువారం ఏసియాన్‌ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొన్న వారంతా ఈ సంక్షోభ స్థితి గురించీ, దాన్ని అధిగమించటానికి గల మార్గాల గురించీ స్థూలంగా చర్చించారు. అమెరికా అనుసరిస్తున్న వైఖరి కారణంగా పశ్చిమాసియాలో ప్రతిష్టంభన ఏర్పడి, ఇంధన సంక్షోభం చుట్టుముడుతోంది. ఈ సంస్థలోని 11 సభ్య దేశాలూ ఇంధన దిగుమతులపై ఆధారపడినవే. ఈ ప్రతిష్టంభన వల్ల ఆహార సరఫరా మార్గాలు సైతం మూసుకుపోయాయి. వీటి జనాభా మొత్తంగా 70 కోట్లు. సంక్షోభం దీర్ఘకాలం కొనసాగితే ఇంధన ధరలు ఆకాశాన్నంటడంతోపాటు ఆహార పదార్థాల, సరుకుల లభ్యత గణనీయంగా పడిపోతుందనీ, ప్రాణావసర ఔషధాలు దొరక్క జనం తీవ్ర ఇబ్బందులకు లోనవుతారనీ ఆసియాన్‌ దేశాలు భయాందోళనలు చెందుతున్నాయి.  

అర్థరహితమైన ‘అమెరికా ఫస్ట్‌’ నినాదంతో తన తొలి ఏలుబడిలోనే డోనాల్డ్‌ ట్రంప్‌ స్వీయరక్షణ చర్యలు మొదలెట్టారు. రెండోసారి దాన్ని మరింత ముమ్మరం చేయటంతో పాటు స్వపర భేదం లేకుండా అదనపు సుంకాలతో ప్రపంచ దేశాలన్నిటినీ బెంబేలెత్తించారు. దాన్ని తట్టుకోవటం ఎలాగన్న మీమాంసలో అందరూ పడిన తరుణంలో గ్రీన్‌ ల్యాండ్‌ సొంతం చేసుకుంటామనీ, కెనడాను విలీనం చేసుకుంటామనీ బెదిరింపులు ప్రారంభించారు. కెనడాలో నిరుడు ఎన్నికల తర్వాత ప్రధానిగా వచ్చిన మార్క్‌ కెర్నీ ‘త్వరలోనే మా 51వ రాష్ట్ర గవర్నర్‌ అవుతారు’ అంటూ ట్వీట్‌ చేశారు. ఇక వెనెజులా వ్యవహారం అత్యంత దారుణమైనది. ఆ దేశాధ్యక్షుడు మదురోను, ఆయన భార్యను అపహరించి తీసుకొచ్చి అమెరికాలో తప్పుడు ఆరోపణలతో కేసులు పెట్టి విచారిస్తు న్నారు. ఇక ఇరాన్‌పై 68 రోజుల క్రితం అకారణంగా యుద్ధానికి దిగారు.

ఇరాన్‌కు ఒకే ఒక పేజీలో తాజా ప్రతిపాదనలు పంపామనీ, దానిపై ఆ దేశం తీసుకునే నిర్ణయం ఆధారంగా తదుపరి చర్యలుంటాయనీ అమెరికా చెబుతోంది. ఇది కేవలం ఏసియాన్‌ శిఖరాగ్ర సదస్సును దృష్టిలో ఉంచుకుని, దాన్ని మభ్యపెట్టేందుకు సాగిస్తున్న కపట నాటకమా లేక చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నమా అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి. ఎందుకంటే ఈ తాజా ప్రతిపాదనలన్నీ ఒబామా హయాంలో 2015 జూలైలో ‘ఉమ్మడి సమగ్ర కార్యాచరణ’ పేరిట ఇరాన్‌తో కుదిరిన అణు ఒప్పందంలోని అంశాలకు దగ్గరగా ఉన్నాయంటున్నారు. గత ఏలుబడిలో అది పనికిమాలిన ఒప్పందమంటూ బుట్టదాఖలా చేసింది ట్రంపే. సుదీర్ఘ ప్రతిష్టంభన వల్ల ప్రపంచ దేశాలతో పాటు అమెరికా కూడా దివాలా తీస్తుందన్న భయంతో కాళ్లబేరానికొస్తే మంచిదే. 

ఏసియాన్‌ దేశాల ఉమ్మడి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 3,80,000 కోట్ల డాలర్లు. ఇది కాస్తా దిగజారడం మొదలైందంటే... పొదుపు చర్యల అమలు తప్పనిసరైతే ఎక్కడి కక్కడ ప్రజాగ్రహం వెల్లువెత్తి ప్రభుత్వాలు కుప్పకూలే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే చాన్నాళ్లుగా ఫిలిప్పీన్స్‌ ప్రాంతీయ చమురు పంపకం ప్రతిపాదన చేస్తోంది. అన్ని ఆర్థిక వ్యవస్థలూ ఒకదానితో మరొకటి పెనవేసుకుని ఉంటాయి గనుక ఇలాంటి సహకారం సంక్షోభాన్ని నివారిస్తుందన్నది ఆ ప్రతిపాదన సారాంశం. కానీ పశ్చిమాసియాలో తిరిగి ప్రశాంతత నెలకొనడం తప్ప మరేదీ పరిష్కారం కాదు. మిగిలినవన్నీ తాత్కాలిక ఉపశ మనాలే. దీర్ఘకాలం కొనసాగించటానికి పనికొచ్చేవి కాదు. 

అమెరికా చాటున అణిగి మణిగి ఉండే పాత రోజులు అంతరించాయనీ, గట్టిగా నిలబడి స్వరం పెంచితేనే ఏదో మేరకు ఆ దేశం దిగొస్తుందనీ ఏసియాన్‌ గుర్తించాలి. అదే సమయంలో ఆహారం,ఇంధనం, వాణిజ్యం అంశాల్లో ఇతర ప్రాంతీయ బృందాలతో సమన్వయం చేసుకోవాలి. వాటి సహకారం పొందాలి. తమ వంతు సాయం అందించాలి. ఏసియాన్‌తో భారత్‌ వాణిజ్యం సరిగా లేదు. ఆ దేశాలనుంచి వచ్చే దిగుమతులతో పోలిస్తే, అక్కడికి మన ఎగుమతులు చాలా తక్కువున్నాయి. ఈ వాణిజ్యలోటు 2023 నాటికి 4,400 కోట్ల డాలర్లుంది. ఇలాంటి లోటుపాట్లన్నిటినీ సరిచేసుకుంటేనే ఏసియాన్‌ అన్ని రకాల సంక్షోభాలనూ దృఢంగా ఎదుర్కొనగలుగుతుందని శుక్రవారం జరగబోయే దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు గుర్తించాల్సి ఉంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement