నీటి గుడి | Sakshi Editorial On Help Drinking Water to People Needs | Sakshi
Sakshi News home page

నీటి గుడి

Apr 20 2026 12:14 AM | Updated on Apr 20 2026 12:14 AM

Sakshi Editorial On Help Drinking Water to People Needs

కాశీలోని ఒక ముసలామెకు రోజులు ముగిశాయి. యమభటులు వచ్చి ‘అవా... బయలుదేరు...’ అంటే ఆమె అందుకే కాచుకుని ఉన్నట్టు ఒకటీ అరా వస్తువులు ముల్లె కట్టుకొని ‘పదండి నాయనా’... అని కదలబోయింది. విష్ణుభటులు ప్రత్యక్షమయ్యారు. ‘మీరెందుకు వచ్చారు’ అన్నారు యమభటులు ఆశ్చర్యపోయి. ‘ఈ అవ్వ మా కేండేటు. స్వర్గానికి పిల్చకపోవడానికి వచ్చాము’ అన్నారు. ‘అంత ఘనకార్యం ఏం చేసిందీ అవ్వ. కొంపదీసి యజ్ఞాలుగానీ చేసిందా’ అన్నారు యమభటులు. ‘అంతకు మించే చేసింది. అవ్వకు కొడుకూ బిడ్డా ఎవరూ లేరు. ఉన్న ఒక్క ఇల్లు అమ్మేసి ఈ కాశీలో చలివేంద్రం పెట్టింది. ఇక్కడ రోజూ వచ్చే భక్తులు, బైరాగులు ఈమె పెట్టిన కుండల్లోని నీళ్లు తాగి దప్పిక తీర్చుకున్నారు. ఒక్క దప్పిక తీరిస్తే నూరు అశ్వమేధ యాగాల పుణ్యం. మరి ఈమె పుణ్యం లెక్కవేయడానికి మీ చిత్రగుప్తుడి చిట్టాపద్దులు సరిపోతాయా’ అని అవ్వను పల్లకీ ఎక్కించి, పూలవానలో స్వర్గలోకానికి తోడ్కొని వెళ్లారు. ఈ ఎండల్లో వినదగ్గ కథే ఇది.

అదేమిటో యుగాలు గడిచినా రంతిదేవుణ్ణి తలదన్నే ఉదారపురుషుడే కానరావడం లేదు. దానాలకు అన్నీ పోగా 48 రోజులు ఉపవాసం ఉన్న రంతిదేవుడికి కొంత జావా, కొన్ని నీళ్లు దక్కాయి. జావ తాగబోతే ఒక బ్రాహ్మణుడు వచ్చి ‘ఆకలి’ అన్నాడు. ఇచ్చేశాడు. నీళ్లు తాగబోతుంటే ఒక శూద్రుడు వచ్చి ‘దప్పిక’ అన్నాడు. ఇచ్చేశాడు. పాత్రలో ఉన్న చివరి నీటి చుక్కలను తాగుదామనుకునేలోపు ఒక పంచముడు వచ్చి ‘అయ్యా... దప్పికతో చచ్చేలా ఉన్నాను’ అనంటే ఆ చివరి నీటి చుక్కలతో పంచముడి పెదవులు తడిపాడు. అప్పుడు ఆగలేక విష్ణువు ప్రత్యక్షమై ‘నీ త్యాగం ముందు నా వైకుంఠం దిగదుడుపు’ అన్నాడు. ‘నీకేం కావాలో కోరుకో’ అనీ అన్నాడు. ‘నాకేం వద్దు. ఈ లోకంలో ఎవరినీ దప్పికతో ఉంచొద్దు’ అన్నాడు రంతిదేవుడు. ‘తథాస్తు’ అన్నాడు విష్ణువు. ఈ భగభగమండే ఎండల్లో అలా రోడ్డు మీద వెళితే ఈ ‘తథాస్తు’ ఏ మేరకు సిద్ధించిందో తెలుస్తుంది.

పనుల మీద ఊరుగాని ఊరుకు వస్తారు చాలామంది. ఉన్న ఊళ్లోనే రెక్కాడితేగాని డొక్కాడని బతుకుకై బయలుదేరుతారు చాలామంది. జనుల ఆకలి తీర్చడానికి తిండి బుట్టలు వీపున కట్టుకుని తిరిగేవారు వేలమంది. ఇక ఈ దేశంలో కోట్ల మందికి ట్రంకు రోడ్డే ఆఫీసు, మెయిన్‌రోడ్డే షాపు. కాసింత చెట్టు నీడ కూడా దొరకని ఈ పొడవైన, నిర్దాక్షిణ్యమైన, నల్లటి రోడ్డు మీద వేసవిలో బతుకులు వెళ్లమార్చే వారంతా ఉష్ణాన్ని తట్టుకోగలరేమోగానీ దప్పికను తట్టుకోగలరా? ఏం కావాలి వీరికి? మన మనసు చల్లదనం. అది మన చేత పెట్టించే చలివేంద్రం. తడి గుడ్డ కట్టిన, చూడగానే ప్రాణం లేచి వచ్చే చల్లని మంచినీరు!

‘అప ఏవ ససర్జాదౌ’ స్మృతివాక్యం. అంటే ‘పరమాత్ముడు మొదట నీరు సృష్టించాడు’. నారము– నీరును, ఆయనము– నివాసము చేసుకున్నవాడు నారాయణుడు. ‘నీటిలో రుచిని నేను’ అన్నాడు భగవద్గీతలో కృష్ణుడు. నీళ్లతో సేవ చేయడమంటే దేవునికి పూజ చేయడమే. ‘పానీయం పరమం దానం’. నీటిదానం అన్ని దానాల్లోకెల్లా గొప్పది. పామరులు ఈ మాటనే ‘కుండలో నీళ్లు పోస్తే పుణ్యం వాగు పారినట్టు’ అన్నారు. ‘దాహం అన్నవాడికి లేదనకు. లక్ష్మి ఇల్లు కదలుతుంది’ అని హెచ్చరించారు. ఉత్తర భారతాన ‘ప్యావూ’ అని పిలిచే చలివేంద్రాల సంస్కృతి ఉంది. ఇంటి బయట, వీధి చివర ఎవరో అజ్ఞాతవ్యక్తులు పెద్ద పెద్ద రజాయిలు పెట్టి నీళ్లు నింపుతుంటారు. 

ఎండన పడి వెళ్లేవాళ్లంతా తాగుతుంటారు. అజ్ఞాతంగా ఎందుకు? దప్పిక తీర్చి చెప్పుకోకూడదు. దప్పిక తీర్చామని అహానికి పోకూడదు. దప్పిక తీరినవారు ఫలానా వారికి రుణపడ్డామని అనుకోకూడదు. నీరు దైవసొత్తు. మనిషి సృష్టించింది కాదు. దైవసొత్తును మరో మనిషికి చేరవేయడంలో మన ఘనకార్యం ఏముంది? మరైతే మన దేశంలో చలివేంద్రాలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏదో తెలుసా? కేరళ. గతంలో తెలుగునాట ఎండలు వస్తే పోటీలు పడి చలివేంద్రాలు పెట్టేవారు. ఇప్పుడు రీల్స్‌ చూడటంలో పడి  బిజీగా ఉంటున్నారు. గ్లాసెడు నీరు ముంచి ఇచ్చి పోగేసుకునే సంతృప్తికి కౌంటింగ్‌ మెషీన్‌ లేదని వీరికి తెలిసేదెలా? ఎండాకాలంలో పుణ్యయాత్రలకు రెడీ అవుతుంటారు చాలామంది. మంచిదే.  కాని మన ఇంటి ముందే ఒక గుడి కట్టే వీలుండే ఈ కాలాన్ని మిస్‌ చేసుకోవద్దు. నీటి గుడి కట్టండి. నీరున్న కుండలో దేవుడు ఉన్నాడు! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement