breaking news
water pot
-
నీటి గుడి
కాశీలోని ఒక ముసలామెకు రోజులు ముగిశాయి. యమభటులు వచ్చి ‘అవా... బయలుదేరు...’ అంటే ఆమె అందుకే కాచుకుని ఉన్నట్టు ఒకటీ అరా వస్తువులు ముల్లె కట్టుకొని ‘పదండి నాయనా’... అని కదలబోయింది. విష్ణుభటులు ప్రత్యక్షమయ్యారు. ‘మీరెందుకు వచ్చారు’ అన్నారు యమభటులు ఆశ్చర్యపోయి. ‘ఈ అవ్వ మా కేండేటు. స్వర్గానికి పిల్చకపోవడానికి వచ్చాము’ అన్నారు. ‘అంత ఘనకార్యం ఏం చేసిందీ అవ్వ. కొంపదీసి యజ్ఞాలుగానీ చేసిందా’ అన్నారు యమభటులు. ‘అంతకు మించే చేసింది. అవ్వకు కొడుకూ బిడ్డా ఎవరూ లేరు. ఉన్న ఒక్క ఇల్లు అమ్మేసి ఈ కాశీలో చలివేంద్రం పెట్టింది. ఇక్కడ రోజూ వచ్చే భక్తులు, బైరాగులు ఈమె పెట్టిన కుండల్లోని నీళ్లు తాగి దప్పిక తీర్చుకున్నారు. ఒక్క దప్పిక తీరిస్తే నూరు అశ్వమేధ యాగాల పుణ్యం. మరి ఈమె పుణ్యం లెక్కవేయడానికి మీ చిత్రగుప్తుడి చిట్టాపద్దులు సరిపోతాయా’ అని అవ్వను పల్లకీ ఎక్కించి, పూలవానలో స్వర్గలోకానికి తోడ్కొని వెళ్లారు. ఈ ఎండల్లో వినదగ్గ కథే ఇది.అదేమిటో యుగాలు గడిచినా రంతిదేవుణ్ణి తలదన్నే ఉదారపురుషుడే కానరావడం లేదు. దానాలకు అన్నీ పోగా 48 రోజులు ఉపవాసం ఉన్న రంతిదేవుడికి కొంత జావా, కొన్ని నీళ్లు దక్కాయి. జావ తాగబోతే ఒక బ్రాహ్మణుడు వచ్చి ‘ఆకలి’ అన్నాడు. ఇచ్చేశాడు. నీళ్లు తాగబోతుంటే ఒక శూద్రుడు వచ్చి ‘దప్పిక’ అన్నాడు. ఇచ్చేశాడు. పాత్రలో ఉన్న చివరి నీటి చుక్కలను తాగుదామనుకునేలోపు ఒక పంచముడు వచ్చి ‘అయ్యా... దప్పికతో చచ్చేలా ఉన్నాను’ అనంటే ఆ చివరి నీటి చుక్కలతో పంచముడి పెదవులు తడిపాడు. అప్పుడు ఆగలేక విష్ణువు ప్రత్యక్షమై ‘నీ త్యాగం ముందు నా వైకుంఠం దిగదుడుపు’ అన్నాడు. ‘నీకేం కావాలో కోరుకో’ అనీ అన్నాడు. ‘నాకేం వద్దు. ఈ లోకంలో ఎవరినీ దప్పికతో ఉంచొద్దు’ అన్నాడు రంతిదేవుడు. ‘తథాస్తు’ అన్నాడు విష్ణువు. ఈ భగభగమండే ఎండల్లో అలా రోడ్డు మీద వెళితే ఈ ‘తథాస్తు’ ఏ మేరకు సిద్ధించిందో తెలుస్తుంది.పనుల మీద ఊరుగాని ఊరుకు వస్తారు చాలామంది. ఉన్న ఊళ్లోనే రెక్కాడితేగాని డొక్కాడని బతుకుకై బయలుదేరుతారు చాలామంది. జనుల ఆకలి తీర్చడానికి తిండి బుట్టలు వీపున కట్టుకుని తిరిగేవారు వేలమంది. ఇక ఈ దేశంలో కోట్ల మందికి ట్రంకు రోడ్డే ఆఫీసు, మెయిన్రోడ్డే షాపు. కాసింత చెట్టు నీడ కూడా దొరకని ఈ పొడవైన, నిర్దాక్షిణ్యమైన, నల్లటి రోడ్డు మీద వేసవిలో బతుకులు వెళ్లమార్చే వారంతా ఉష్ణాన్ని తట్టుకోగలరేమోగానీ దప్పికను తట్టుకోగలరా? ఏం కావాలి వీరికి? మన మనసు చల్లదనం. అది మన చేత పెట్టించే చలివేంద్రం. తడి గుడ్డ కట్టిన, చూడగానే ప్రాణం లేచి వచ్చే చల్లని మంచినీరు!‘అప ఏవ ససర్జాదౌ’ స్మృతివాక్యం. అంటే ‘పరమాత్ముడు మొదట నీరు సృష్టించాడు’. నారము– నీరును, ఆయనము– నివాసము చేసుకున్నవాడు నారాయణుడు. ‘నీటిలో రుచిని నేను’ అన్నాడు భగవద్గీతలో కృష్ణుడు. నీళ్లతో సేవ చేయడమంటే దేవునికి పూజ చేయడమే. ‘పానీయం పరమం దానం’. నీటిదానం అన్ని దానాల్లోకెల్లా గొప్పది. పామరులు ఈ మాటనే ‘కుండలో నీళ్లు పోస్తే పుణ్యం వాగు పారినట్టు’ అన్నారు. ‘దాహం అన్నవాడికి లేదనకు. లక్ష్మి ఇల్లు కదలుతుంది’ అని హెచ్చరించారు. ఉత్తర భారతాన ‘ప్యావూ’ అని పిలిచే చలివేంద్రాల సంస్కృతి ఉంది. ఇంటి బయట, వీధి చివర ఎవరో అజ్ఞాతవ్యక్తులు పెద్ద పెద్ద రజాయిలు పెట్టి నీళ్లు నింపుతుంటారు. ఎండన పడి వెళ్లేవాళ్లంతా తాగుతుంటారు. అజ్ఞాతంగా ఎందుకు? దప్పిక తీర్చి చెప్పుకోకూడదు. దప్పిక తీర్చామని అహానికి పోకూడదు. దప్పిక తీరినవారు ఫలానా వారికి రుణపడ్డామని అనుకోకూడదు. నీరు దైవసొత్తు. మనిషి సృష్టించింది కాదు. దైవసొత్తును మరో మనిషికి చేరవేయడంలో మన ఘనకార్యం ఏముంది? మరైతే మన దేశంలో చలివేంద్రాలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏదో తెలుసా? కేరళ. గతంలో తెలుగునాట ఎండలు వస్తే పోటీలు పడి చలివేంద్రాలు పెట్టేవారు. ఇప్పుడు రీల్స్ చూడటంలో పడి బిజీగా ఉంటున్నారు. గ్లాసెడు నీరు ముంచి ఇచ్చి పోగేసుకునే సంతృప్తికి కౌంటింగ్ మెషీన్ లేదని వీరికి తెలిసేదెలా? ఎండాకాలంలో పుణ్యయాత్రలకు రెడీ అవుతుంటారు చాలామంది. మంచిదే. కాని మన ఇంటి ముందే ఒక గుడి కట్టే వీలుండే ఈ కాలాన్ని మిస్ చేసుకోవద్దు. నీటి గుడి కట్టండి. నీరున్న కుండలో దేవుడు ఉన్నాడు! -
నీళ్ల కుండను తాకాడని .. దళిత బాలుడ్ని కొట్టి చంపిన టీచర్
ఉదయపూర్: స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ కూడా దేశంలో కుల వివక్ష వికృతరూపం ఎక్కడో ఒకచోట బట్టబయలువుతూనే ఉంది. రాజస్తాన్లోని జలోర్ జిల్లాలోని సురానా గ్రామంలోని ఓ ప్రైవేటు స్కూల్లో చెయిల్ సింగ్ అనే టీచర్ తన కోసం ప్రత్యేకంగా ఉంచుకున్న నీళ్లకుండను ఇంద్రకుమార్ మేఘవాలా దళిత విద్యార్థి తాకాడు. దాంతో తొమ్మిదేళ్ల ఆ బాలుడ్ని విచక్షణారహితంగా చితకబాదాడు. తీవ్రంగా గాయపడిన బాలుడు చికిత్స పొందుతూ శనివారం చనిపోయాడు. జులై 20న ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టీచర్ దెబ్బలకు తన కొడుకు చెవులు, కళ్లు, ముఖానికి తీవ్రంగా గాయాలయ్యాయని, అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడని తండ్రి దేవరామ్ మేఘవాలా కన్నీటిపర్యంతమయ్యారు. పైగా కులం పేరుతో దూషించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీన్ని రాజస్థాన్ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. సమగ్ర విచారణకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆదేశించారు. టీచర్ను అరెస్ట్ చేసినట్టు ఎస్పీ చెప్పారు. -
తల ప్రాణం బిందెలోకొచ్చింది..
దాహం తీరకపోగా తల బిందెలో ఇరు క్కుపోవడంతో వదిలించుకోవడానికి ఓ శునకం నానా పాట్లు పడింది. బెరెడ్డిపల్లె మండలం దేవదొడ్డి–దాసార్లపల్లె రహదారిలోని తీర్థం సమీపంలో ఆదివారం ఓ శునకం ప్లాస్టిక్ బిందెలోని నీటిని తాగేందుకు ప్రయత్నించడంతో తల ఇరుక్కుపోయింది. బిందెను విదిలించుకోవడానికి పడిన అవస్థలు వర్ణనాతీతం. చివరకు రహదారి పక్కనే ఉన్న చెట్టును తలపై ఉన్న బిందెతో కొట్టుకుంటూ పగులకొట్టింది. ఉక్కిరిబిక్కిరి అయిన శునకానికి ఊపిరి ఆడడంతో పొలం గట్లపైకి వెళ్లింది. – బైరెడ్డిపల్లె -
నిండుకుండలా..కిన్నెరసాని..
పాల్వంచ రూరల్: కిన్నెరసాని రిజర్వాయర్ 407 అడుగల నీటి నిల్వ సామర్థ్యానికి గాను 406.60 అడుగులకు వరద చేరగా.శుక్రవారం ఉదయం నుంచి రెండు గేట్లను ఎత్తి, దిగువకు 6వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. రాజాపురం, యానంబైల్ గ్రామాల మధ్య లోలేవల్ చప్టాపైనుంచి వరదనీరు పొంగింది. యానంబైల్, ఉల్వనూరు, చండ్రాలగూడెం గ్రామ పంచాయతీల పరిధిలో 20కిపైగా గిరిజన గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.


