యుద్ధంపై రణభేరి! | Sakshi Editorial On America, Israel, Iran war Issues | Sakshi
Sakshi News home page

యుద్ధంపై రణభేరి!

Mar 31 2026 3:19 AM | Updated on Mar 31 2026 3:19 AM

Sakshi Editorial On America, Israel, Iran war Issues

రాత్రింబగళ్లు నిప్పులు కురుస్తున్నా భూగోళంపైనున్న జనారణ్యాలన్నీ నిశ్చలన చిత్రాలై నిర్లిప్తంగా ఉండిపోతున్నాయన్న నిరాశ సర్వత్రా ఆవరించిన తరుణంలో అమెరికా వ్యాప్తంగా శనివారం ఒక మానవ మహాసముద్రం పోటెత్తింది. దశాబ్దాలనాటి వియత్నాం యుద్ధ వ్యతిరేక ర్యాలీలను తలపిస్తూ, అంతకన్నా మరిన్ని రెట్లు ఎక్కువగా నగరాలు, పట్టణాలు, మారుమూల పల్లెలన్న వ్యత్యాసం లేకుండా– అమెరికాలోని అన్ని వర్గాలూ ఏకమై 3,300 నిరసన ప్రదర్శనలు నిర్వహించి ముక్తకంఠంతో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ సాగిస్తున్న యుద్ధాన్ని ఖండించిన తీరు చరిత్రలో నిలిచిపోతుంది. 

అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఇంటా, బయటా తన అరాచకంతో ప్రజాస్వామ్యానికీ, మానవతకూ మహాపచారం చేస్తున్నారని ప్రదర్శకులు మండిపడ్డారంటే ఏడాది పాలనలో వారెంత విసిగిపోయారో అర్థమవుతుంది. ఖర్గ్‌ ద్వీపాన్ని బుగ్గి చేస్తానని, ఇరాన్‌ ఇంధన క్షేత్రాలకూ, విద్యుదుత్పాదన ప్లాంట్లకూ నిప్పెడతాననీ ట్రంప్‌ బెదిరిస్తున్న తరుణంలో ‘నో కింగ్స్‌’ పేరిట ఇంత పెద్దయెత్తున నిరసనలు ఎగిసిపడటం అసాధారణం. ఉత్తర ధ్రువప్రాంత అలస్కాలో కేవలం 3,000 మంది జనాభా నివసించే కోట్జెబు మొదలుకొని కరేబియన్‌ ద్వీపంలోని ప్యూర్టోరికో... న్యూయార్క్, వాషింగ్టన్, శాన్‌ఫ్రాన్సిస్కో, షికాగో తదితర మహా నగరాల వరకూ ప్రదర్శకులు భారీయెత్తున పాల్గొనగా, యూరప్, లాటిన్‌ అమెరికా, ఆస్ట్రేలియాల్లో సైతం ‘నో కింగ్స్‌’ ర్యాలీలు జరిగాయి. 

‘నో కింగ్స్‌’ ఒక్క ట్రంప్‌ పైన మాత్రమే కాదు... ఆయనకు అపరిమితమైన అధికా రాలు కట్టబెట్టిన, చట్టపరమైన రక్షణలిచ్చిన వ్యవస్థలన్నిటిపైనా మోగించిన రణభేరి. అధికారం అహంకరించినప్పుడూ, న్యాయం సైతం దానితో కుమ్మక్కయినప్పుడూ నడి వీధులే న్యాయస్థానాలవుతాయి. శనివారంనాటి నిరసనల సారాంశం అదే. రాచరిక, భూస్వామ్య వ్యవస్థలపై శతాబ్దాల క్రితం పోరాడి నిర్మించుకున్న ప్రజాస్వామ్యంలో వ్యవస్థలన్నీ కలిసి మరో ‘రాజు’ను ప్రతిష్ఠించటానికి పూనుకోవడంపై ‘నో కింగ్స్‌’ ఒక తిరుగుబాటు. 

స్వదేశంలో నియంతగా మారిన పాలకుడు ప్రపంచానికి సైతం శాపంగా పరిణమించే ప్రమాదం ఉన్నదని ట్రంప్‌ పోకడలు చాటుతున్నాయి. నియంతృత్వం రాజ్యమేలేచోట అరాచకాలు పెరిగినప్పుడు మౌనప్రేక్షకులుగా మిగిలే సాధారణ జనంలో సైతం ఆలోచనలు రేకెత్తించడానికీ, కార్యోన్ముఖుల్ని చేయటానికీ ఈ నిరసనలు పుట్టు కొస్తాయి. రిపబ్లికన్‌ల ఆధిక్యతగల రాష్ట్రాలూ, ‘మాగా’ ఉద్యమ ప్రాబల్యంగల ప్రాంతాలూ సైతం ఈసారి నిరసనలతో హోరెత్తటం గమనించదగ్గది. జనహననం కోసం పశ్చిమాసియాకు ట్రంప్‌ తరలించిన మెరైన్ల తల్లులు కూడా ఇందులో పాల్గొన్నారు. 

నెలక్రితంతో పోలిస్తే... వారం రోజులుగా ఇరాన్‌ ప్రతిదాడుల సంఖ్య తగ్గిందనీ, రోజుకు 30 మించటం లేదనీ అంటున్నారు. కానీ అవి నేరుగా లక్ష్యాన్ని గురి చూస్తున్నాయి. వ్యూహాత్మక ప్రాంతాల్లో ఇరాన్‌ ప్రయోగించిన క్షిపణిని ప్రత్యర్థి పక్షాలు నిలువరిస్తున్నా అది కిందపడుతూ పదుల బాంబులై పేలటం, జననష్టంతోపాటు ఆస్తి నష్టం తీసుకురావటం కనబడుతూనే ఉంది. ఎదురుదాడుల క్రమంలోనే అంచనాలు పదు నెక్కించుకుని, నిఘా కార్యకలాపాలను సమన్వయపరుచుకుని ఇరాన్‌ దళాలు వ్యవహ రిస్తున్నాయని ఇది తేటతెల్లం చేస్తోంది. 

గల్ఫ్‌ దేశాల్లో, ఇజ్రాయెల్‌లో లక్షలాదిమంది పౌరులు ఇప్పటికీ బాంబు షెల్టర్లలో తలదాచుకొనక తప్పని స్థితి ఉంది. ప్రత్యర్థి పక్షాల ప్రాంతాల్లో ఒకసారంటూ అస్థిర పరిస్థితుల్నీ, అభద్రతా భావాన్నీ తీసుకొచ్చాక దాడుల సంఖ్య గణించదగ్గది కాదు. గత జూన్‌లో 12 రోజుల అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల తర్వాత ఇరాన్‌ విశ్రమించలేదని తాజా పరిణామాలు చెబుతున్నాయి.  

ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రజల జీవితాలనూ అస్తవ్యస్తం చేస్తోంది. వారి జీవికను దెబ్బతీస్తోంది. ఇరాన్‌పై యుద్ధం ఆపకుండా, హార్మూజ్‌ జలసంధి మాత్రం ప్రశాంతంగా ఉండాలనీ, ఇంధన రవాణా నిరాటంకంగా జరగాలనీ ట్రంప్‌ కోరుకోవటం దురాశ. ఇంధన ధరలు మిన్నంటితే తన కొలువుకు ఎసరొస్తుందన్న ఏకైక భయంతోనే పశ్చిమాసియాలో ప్రస్తుతం ఆయన వేలాదిమంది మెరైన్లను మోహరించారు. అమెరికా ప్రజల అభీష్టమేమిటో తెలిసింది గనుక ఇకనైనా ట్రంప్‌ తన దుష్ట పోకడలకు స్వస్తి చెప్పాలి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement