రెండు సాధారణ దేశాల అధినేతలు కలిశారంటే వాణిజ్యం, వ్యాపారం, పరస్పర సహకారం, ఇచ్చిపుచ్చుకోవడాలు చర్చకొస్తాయి. ఒప్పందాలు కుదురుతాయి. కానీ రెండు అగ్రదేశాలు కలిశాయంటే పైకి కనబడే వాణిజ్య, వ్యాపారాదులతోపాటు గుట్టుచప్పుడు కాకుండా కుదిరే లాలూచీలుంటాయి. వారం రోజుల వ్యవధిలో మూడు అగ్ర రాజ్యాల మధ్య మంతనాలు సాగాయి. గతవారం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనకొస్తే, ఈ బుధవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వంతు. స్వల్ప వ్యవధిలో ఇలా ఇద్దరు అగ్రరాజ్యాధినేతలు రావటంవల్ల సహజంగానే చైనా స్థాయి అమాంతం పెరిగిపోయింది. పుతిన్ వచ్చిన సందర్భం సాధారణమైనది కాదు.
ఆయనే చెప్పినట్టు 54 సంవత్సరాల క్రితం ఇదేరోజున అప్పటి చైనా అధినేత మావో జెడాంగ్ ‘ప్రపంచ దేశాలన్నీ ఏకమై అమెరికా సామ్రాజ్యవాదంపై పోరాడాల’ని పిలుపునిచ్చారు. అప్పటికీ ఇప్పటికీ ప్రపంచం మారింది. పెట్టుబడి ఎగుమతిలో, దేశాలపై ఆర్థికంగా పట్టుబిగించటంలో, ఇరుగుపొరుగును చీకాకుపెట్టడంలో, కనిపించేదంతా తనదేనని ప్రకటించుకోవటంలో చైనా సైతం సామ్రాజ్యవాద పోకడలకు పోతోంది. మధ్యన ‘సోషల్ సామ్రాజ్యవాదం’ ముద్ర వేయించుకున్న సోవియెట్ యూనియన్ చీలికలూ, పేలికలై కుప్పకూలింది. అందులోని ప్రధాన భాగం రష్యా కూడదీసుకునే ప్రయత్నం చేస్తూ, గత వారసత్వాన్ని కొనసాగించటానికి ఆపసోపాలు పడుతోంది. ఇక అమెరికా పోకడలు దశాబ్దాలుగా అదే బాణీలో కొనసాగుతున్నాయి.
గతవారం ట్రంప్‌కు లభించిన స్వాగత సత్కారాలన్నీ పుతిన్‌కు కూడా దక్కాయి. రెడ్‌కార్పెట్ పరచడం, సైనిక వందనం, కేరింతలతో పిల్లలు అభివాదం చేయడం వంటివన్నీ కనబడ్డాయి. అయితే స్వీయ ప్రయోజనాల రక్షణలో తమకెవరూ సాటిరారని అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ నిరూపించారు. ఏవేవో ఒప్పందాలు కుదిరాయని ట్రంప్ చెప్పటమే తప్ప చైనా వైపునుంచి గతవారం ఎలాంటి ప్రకటనలూ రాలేదు. ఇప్పుడు పుతిన్‌కు కూడా దాదాపు అదే అనుభవం ఎదురైంది. ఇంధన సర ఫరా కోసం ‘పవర్ ఆఫ్ సైబీరియా 2’ పేరిట రెండో పైప్‌లైన్ నిర్మాణానికి రష్యా సిద్ధపడినా, చైనా అందుకు సంబంధించి మరింత లోతుగా చర్చించాల్సి ఉందంటూ వాయిదా వేసింది. కాకపోతే తైవాన్ విషయంలో ట్రంప్‌కు ‘రెడ్‌లైన్’ హెచ్చరిక జారీ అయిన పద్ధతిలో పుతిన్‌కు
ఎలాంటి భంగపాటు కలగలేదు.
ఎవరికి వారు అవతలివారిని వేలెత్తి చూపడమే తప్ప, తమ తప్పులెరగరని ట్రంప్, పుతిన్‌ల పర్యటనలు నిరూపించాయి. హార్మూజ్ జలసంధి ప్రతిష్టంభన, ఇరాన్ యుద్ధం విషయంలో గతవారం అమెరికా, చైనాలు ‘ఏకాభిప్రాయం’ ప్రకటిస్తే... ఇప్పుడు చైనా, రష్యాలు సైతం అలాంటి స్వరమే వినిపిస్తున్నాయి. ‘ఏకపక్ష వ్యవహారశైలి, ఆధిపత్యవాద ధోరణులు’ ఉండరాదని కోరాయి. ప్రపంచం ఆటవిక న్యాయంలోకి దిగజారే ప్రమాదం కనబడుతోందని ఆందోళన వ్యక్తంచేశాయి. తరచిచూస్తే ఈ మూడు దేశాలూ జంకూ గొంకూ లేకుండా ఆధిపత్య ధోరణులు ప్రదర్శిస్తున్నాయి. అయినా గంభీరస్వరాలతో హితవు పలికే సాహసం చేస్తున్నాయి. అమెరికా సైన్యం వెనెజులా అధ్యక్షుణ్ణి భార్యా సమేతంగా చీకటిచాటున అపహరించుకు పోయింది. ఇరాన్ అగ్రనేతను ఇజ్రాయెల్‌తో కలిసి హత్య చేసింది. క్యూబాను కబళించటానికి కత్తులు నూరుతోంది. రష్యా నాలు గేళ్లుగా ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉంది. దురాక్రమణకు దిగకపోయినా ఆసియా ఖండ దేశాల్లో చైనా కండబల ప్రదర్శన తక్కువేం కాదు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో పుతిన్‌కు చైనా అవసరమే ఎక్కువుంది. ఉక్రెయిన్‌ను తక్కువ అంచనా వేసి యుద్ధంలోకి దిగి, అది తీవ్రంగా దెబ్బతింది. పుతిన్ స్వీయభద్రతే ప్రమాదంలో పడింది. రష్యా కాల్పుల విరమణ ప్రతిపాదనకు అంగీకరించిన ఉక్రెయిన్... ‘రష్యా తలపెట్టిన మే 9 విక్టరీ పెరేడ్ సజావుగా సాగటానికే’ దీనికి అంగీకరించామంటూ ఎద్దేవా చేసింది. దానికితోడు 2008 తర్వాత తొలిసారి ట్యాంకులు, క్షిపణులు లేకుండా ఆ పెరేడ్ హడావుడిగా ముగిసింది. మొత్తానికి ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ఆ రెండు దేశాల మాదిరిగా తనపై ఇంకా దురాక్రమణదారు ముద్రపడనందువల్లే ఈమాత్రం ప్రతిష్ఠయినా దక్కుతున్నదని చైనా గ్రహించి సవ్యంగా వ్యవహరిస్తే అదే పదివేలు!


