సెషెల్స్‌తో మరింత బంధం | Sakshi Editorial On India ties with Seychelles | Sakshi
Sakshi News home page

సెషెల్స్‌తో మరింత బంధం

Jun 30 2026 1:58 AM | Updated on Jun 30 2026 1:58 AM

Sakshi Editorial On India ties with Seychelles

కేవలం 115 చిన్న చిన్న దీవుల సమాహారం. అందులో నివసించటానికి పనికొచ్చేవి నాలుగంటే నాలుగే. జనాభా చూస్తే లక్షా 30 వేలు. దేశ భూభాగం కేవలం 455 చదరపు కిలోమీటర్లు మాత్రమే. ఇంత చిన్న దేశం సెషెల్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజులు పర్యటించారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో అత్యంత కీలకస్థానంలో ఉన్న ఈ ద్వీపకల్పం ఆఫ్రికా తూర్పు తీరానికి సమీపంలో, హిందూమహా సముద్రంలోని అంతర్జాతీయ నౌకా రవాణా మార్గాలకు సమీపంలో ఉంది. ఇది ఆసియా–ఆఫ్రికా సముద్ర మార్గాల కూడలి కనుక ఆఫ్రికా, యూరప్, పశ్చిమాసియా దేశాలకు వెళ్లే నౌక లన్నీ ఈ ప్రాంతంనుంచే పోవాలి. ఆ నౌకలు నిత్యం ముడిచమురు, సహజవాయు నిక్షేపాలు, ఆహారపదార్థాలు, ముడి సరుకులు మోసుకుపోతుంటాయి. ఆ దేశాధ్యక్షుడు ప్యాట్రిక్‌ హెర్మినీ ఈ ఏడాది మొదట్లో మన దేశం వచ్చారు. అటు తర్వాత మన దేశం అక్కడికి 250 టన్నుల ఆహార పదార్థాలు, భవన నిర్మాణాలకు అవసరమయ్యే సిమెంట్, ఇతరమైనవి పంపింది. దానికి కొనసాగింపుగా మోదీ జరిపిన ప్రస్తుత పర్యటనలో ఇరు దేశాలమధ్యా 19 అంశాల్లో అంగీకారం కుదిరింది. 

తమవంటి ద్వీపకల్ప దేశాల ఆకాంక్షలను ప్రపంచ వేదికలపై ఎలుగెత్తిచాటుతూ, పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న భారత్‌పై ఆ దేశంలో ఆదరాభిమానాలున్నాయి. 1986లో అప్పటి దేశాధ్యక్షుడైన ఫ్రాన్స్‌ ఆల్బర్ట్‌ రెనే సోవియెట్‌ యూనియన్‌ పర్యటనకెళ్లినప్పుడు సెషెల్స్‌లో తిరుగుబాటుకు కుట్ర పన్నిన వైనంపై ముందస్తు సమా చారం అందుకున్న నాటి ప్రధాని రాజీవ్‌ గాంధీ హుటాహుటీన నావికా దళాన్ని పంపి దాన్ని అణిచేశారు. సెషెల్స్‌ నిడివి చిన్నదైనా సాగరజలాల్లో దాని ప్రత్యేక ఆర్థిక మండలి (ఈఎస్‌జెడ్‌) ఏకంగా 13.7 లక్షల చదరపు కిలోమీటర్లు. అంటే భూభాగంకన్నా దాని సముద్ర వ్యాప్తి దాదాపు 3,000 రెట్లు అధికం. హిందూ మహాసముద్రంలో చైనా క్రమేపీ తన ప్రాబల్యాన్ని విస్తరించుకోవటానికి ముత్యాల తీగ (స్ట్రింగ్‌ ఆఫ్‌ పెరెల్స్‌) పేరిట పాగా వేయాలని చూస్తోంది. ఆఫ్రికా తీరమైన జిబూటిలో ఇప్పటికే సైనిక స్థావరం ఏర్పాటులో బిజీగా ఉంది. 

కనుక ఈ ప్రాంతంలో తన పట్టు నిలుపుకొనాలంటే సెషెల్స్‌తో భారత్‌కు బలమైన బంధం ఉండితీరాలి. కోస్తా రాడార్‌ నెట్‌ వర్క్‌ పేరిట మన దేశం ఏర్పాటుచేసిన వ్యవస్థ ఆ ప్రాంతంలో ప్రయాణించే ప్రతి నౌక కదలికనూ ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది. అక్కడ సముద్ర దొంగల బెడద కూడా ఎక్కువే. దాంతోపాటు మాదకద్రవ్యాల స్మగ్లింగ్, అక్రమ చేపలవేట ఉంటాయి. ఇలాంటి సమస్యలను ఎదుర్కొనటానికి రాడార్‌ నెట్‌ వర్క్‌ ఎంతగానో తోడ్పడుతున్నది. దీంతోపాటు మన దేశం డోర్నియర్‌ నిఘా విమానాలనూ, గస్తీ నౌకలనూ బహుమతిగా ఇచ్చింది. వాటిపై సెషెల్స్‌ రక్షణ సిబ్బందికి శిక్షణనిచ్చింది. 2020లో ఆ దేశ సుప్రీంకోర్టు భవనాన్ని ఉచితంగా నిర్మించి ఇచ్చింది.

ప్రసిద్ధ నావికుడు వాస్కోడిగామా 1502లో తొలిసారి ఈ ద్వీపకల్పాన్ని సందర్శించి నప్పుడు ఇక్కడ మానవ సంచారం లేదని చెబుతారు. అటుతర్వాత 1756లో ఫ్రాన్స్‌ దీన్ని తమ అధీనంలోకి తెచ్చుకుంది. అప్పటి ఫ్రాన్స్‌ ఆర్థికమంత్రి జీన్‌ మోరో సెషెల్స్‌ పేరిట ఈ ద్వీపకల్పానికి సెషెల్స్‌గా నామకరణం చేశారు. 1770లో ఇక్కడ వ్యవసాయ పనులకు ఫ్రాన్స్‌ ఆఫ్రికానుంచి భారీయెత్తున కార్మికులను తరలించింది. అప్పుడు మన దేశం నుంచి కూడా వెళ్లారు. నెపోలియన్‌ యుద్ధాల్లో ఒకదానిలో ఫ్రాన్స్‌ ఓడిపోవటంతో 1814లో ఇది బ్రిటన్‌ అధీనంలోకి వచ్చింది. చివరకు 1976లో దీనికి స్వాతంత్య్రం వచ్చింది. ప్రస్తుత సెషెల్స్‌ జనాభాలో 12 శాతంమంది మన దేశంనుంచి వలసవెళ్లిన గుజరాత్, తమిళనాడులకు చెందినవారే.  

హిందూ మహాసముద్ర ప్రాంత ప్రాముఖ్యత రోజురోజుకూ పెరుగుతోంది. అవకాశం దొరికితే కాలూనడానికి చైనాతోపాటు చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రాంతం శాంతియుత మండలంగా ఉండాలని మన దేశం మొదటినుంచీ కోరుకుంటోంది. ఇరు దేశాల సంబంధాలూ భద్రతకే పరిమితం కాకుండా పర్యావరణ పునరు ద్ధరణ, పరిశ్రమలు, పునరుత్పాదక ఇంధన వనరులు, డిజిటల్‌ రంగ సదుపాయాలు వగైరాలకు సైతం విస్తరించాయి. ఇరు దేశాల బాంధవ్యం మున్ముందు మరింతగా ఎదుగు తుందని మోదీ పర్యటన నిరూపించింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement