జై భీమ్‌... జై సంవిధాన్‌! | Sakshi Editorial On Chandrababu Govt Redbook Rule By Vardhelli Murali | Sakshi
Sakshi News home page

జై భీమ్‌... జై సంవిధాన్‌!

Jun 21 2026 5:41 AM | Updated on Jun 21 2026 2:22 PM

Sakshi Editorial On Chandrababu Govt Redbook Rule By Vardhelli Murali

జనతంత్రం

ఏప్రిల్‌ ఏడో తేదీన దేశంలోని అన్ని దినపత్రికల్లో ఒక వార్త చాలా ప్రముఖంగా రిపోర్టయింది. చిరువ్యాపారులైన తండ్రీ కొడుకులిద్దరినీ కస్టడీలో చిత్రహింసలు పెట్టి వారి చావుకు కారణమైన తొమ్మిదిమంది తమిళనాడు పోలీసులకు మధురై హైకోర్టు బెంచ్‌ ఉరిశిక్ష విధించింది. మొదట ఈ కేసుపై రాష్ట్ర స్థాయి పోలీసు విచారణకు ఆదేశించారు. దానివలన ఫలితం ఉండదని భావించిన మద్రాసు హైకోర్టు స్వయంగా జోక్యం చేసుకొని సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడంతో నిజాలు బయట కొచ్చాయి. ఉరిశిక్ష వార్త విన్న తర్వాత లాఠీ ప్రభువుల ఉత్సాహా నికి కొంతకాలమైనా కళ్లెం పడుతుందని ఎవరైనా భావిస్తారు.

ఉన్నతస్థాయుల్లో పుష్కలంగా పలుకుబడి, అండదండలు ఉన్న అధికారులకు మాత్రం ఏ వార్తలు విన్నా ఎటువంటి భయాలూ ఉండవని తేలిపోవడానికి ఎంతోకాలం పట్టలేదు. ఉరిశిక్షల వార్త వెలువడిన ఒక్క నెలరోజుల నుంచి మరో నెల గడిచేలోగా ఆంధ్రప్రదేశ్‌లో ఖాకీ తాండవానికి సంబంధించి నాలుగు విషాద ఉదంతాలు వెలుగుచూశాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించుకున్న ‘పొలిటికల్‌ గవర్నెన్స్‌’ను గుర్తుచేసు కోవడం ఇక్కడ అసందర్భం కాకపోవచ్చు. అదేవిధంగా ఎన్నికలకు ముందే లోకేశ్‌బాబు రచించి, అధికారంలోకి రాగానే అమల్లోకి తెచ్చిన రెడ్‌బుక్‌ దిశానిర్దేశం గురించి గుర్తుచేయడం కూడా అసంగతమేమీ కాదు. పొలిటికల్‌ గవర్నెన్స్‌కూ, రెడ్‌బుక్‌ సందేశవ్యాప్తికీ పోలీసుల ‘ఆఫ్‌ ద రికార్డు’ సేవలు అవసరమైనప్పుడు, ఉభయ కుశలోపరిగా పోలీసు అధికారులు చిక్కుల్లో పడ్డప్పుడు ఉన్నతస్థాయి సహకారం ఉంటుందని భావించడం సహజం. 

కూటమి గద్దెనెక్కిన కొద్దిరోజుల్లోనే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వినుకొండ పట్టణంలో రషీద్‌ అనే వైసీపీ కార్యకర్తను పబ్లిగ్గా నడిరోడ్డు మీద పరిగెత్తిస్తూ కత్తులతో పొడిచి చంపారు. నో పోలీస్‌! అదే ఉమ్మడి జిల్లాలోని తెనాలి పట్టణంలో కొద్ది నెలల తర్వాత దళిత, మైనారిటీ యువకులను నడివీధిలో పడుకోబెట్టి సమస్త ప్రజల సమక్షంలో పోలీసులు వారిపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు. నో యాక్షన్‌!! థర్డ్‌ డిగ్రీ హింసను సుప్రీంకోర్టు నిషేధించింది. కానీ పొలిటికల్‌ గవర్నెన్స్‌ వ్యవస్థలో పరస్పర సహకారం వర్ధిల్లుతున్న వేళ న్యాయస్థానాల విధి నిషేధాలను ఎవరు ఖాతరు చేస్తారు?

ఈ దేశంలోని ప్రతి పౌరునికీ జీవించే హక్కునూ, వ్యక్తిగత స్వేచ్ఛనూ, ఆత్మగౌరవంతో కూడిన జీవనయాన హక్కునూ భారత రాజ్యాంగంలో 21వ అధికరణం ప్రసాదించింది. చట్టపర మైన విధివిధానాల ద్వారా తప్ప మరేరకంగా ఈ హక్కులో జోక్యం చేసుకునే వీలు లేదని స్పష్టం చేసింది. అయినా పెరిగిపోతున్న పోలీసుల అతి ప్రవర్తన, కస్టోడియల్‌ మరణాల పట్ల ఉన్నత న్యాయస్థానాలు పలుమార్లు ఆందోళన వ్యక్తం చేస్తూ పలు మార్గదర్శకాలను విడుదల చేశాయి. ఒక వ్యక్తి పోలీసు స్టేషన్‌ మెట్లెక్కినంతనే అతని ప్రాథమిక హక్కులు మాయమై పోవని న్యాయమూర్తులు అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు. లాకప్‌ హింస ద్వారా వ్యక్తి జీవించే హక్కును, వ్యక్తిగత గౌర వాన్ని ధ్వంసం చేసే హక్కును లాగేసుకోవడమంటే, అనుల్లంఘనీయమైనవిగా భారత రాజ్యాంగం నిర్వచించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే అవుతుంది. కంచె చేను మేయడ మవుతుంది. రాజ్యాంగ ద్రోహమే అవుతుంది.

రాజ్యాంగ వ్యవస్థను కూలదోసే లక్ష్యంతో పనిచేసే నక్స లైట్లు రాజ్యాంగ ద్రోహానికి పాల్పడుతున్నారని నిర్ణయించి రాజ్యవ్యవస్థ వారిని ఎన్‌కౌంటర్‌ హత్యలు చేసింది. మరి రాజ్య వ్యవస్థలో అంతర్భాగంగా ఉన్నవారే రాజ్యాంగానికి ద్రోహం తలపెడితే? ఇదిగో ఇలాంటివారే మరింత ప్రమాదకారులని న్యాయశాస్త్ర కోవిదులు వ్యాఖ్యానిస్తున్నారు. తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్‌ చంద్రు అడ్వకేట్‌గా ఉన్నకాలంలో ఈ సూత్రం మీదనే వాదించి ఒక నిస్సహాయ పేద గిరిజనుడి లాకప్‌ మృతికి ప్రభుత్వాన్ని బాధ్యురాలిగా నిలబెట్ట గలిగారు. సూర్య నటించిన ‘జై భీమ్‌’ సినిమా ఇతివృత్తం కూడా ఈ యథార్థ ఘటనే. చంద్రు వాదనల ఫలితంగా మృతుడి భార్యకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించడమే కాకుండా, నింది తులకు శిక్షపడేలా చేయగలిగింది.

మే 8 నుంచి జూన్‌ 16 వరకు ఏపీలో జరిగిన నాలుగు పోలీస్‌ సంబంధిత విషాదాల తర్వాత ప్రభుత్వ పెద్దల స్పందన గానీ, ఉన్నతాధికారుల కార్యాచరణగానీ సందేహాస్పదంగానే కనిపిస్తున్నది. ఒక కేసుకు సంబంధించి విచారణ పేరుతో మార్కాపురంలో పొట్టపోసుకుంటున్న సాయికృష్ణ అనే యువకు డిని విజయవాడ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఈనెల 8న అరెస్టు చేసి విజయవాడలోని కృష్ణలంక పోలీసులకు అప్పగించినట్టు ఇప్పటి వరకు అందుతున్న వార్తలను బట్టి తెలుస్తున్నది. కుమారుడిని స్టేషన్‌లో పెట్టి హింసిస్తున్నారనే సమాచారంతో సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి నెలరోజులపాటు పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ తిరిగారు. తన కుమారుడిని కనీసం చూపెట్టాలని కోరినా సీఐ నాగరాజు లక్ష్యపెట్టలేదు. పైగా, ‘మీవాడిని చంపేశాం, వెళ్లి ఫోటోకు దండ వేసుకో పో’ అని కూడా సీఐ అన్నారని విజయలక్ష్మి మీడియా ఎదుటే వాపోయారు. సిటీ పోలీస్‌ కమిషనర్‌ దగ్గరకీ, డీజీపీ దగ్గరికీ వెళ్లి బతిమాలుకున్నా న్యాయం జరగలేదని ఆమె కన్నీరు పెట్టుకున్నారు.

హైకోర్టులో విజయలక్ష్మి హెబియస్‌ కార్పస్‌ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఈనెల 29వ తేదీ లోగా సాయికృష్ణను న్యాయస్థానం ఎదుట హాజరుపరచాలని ఆదేశించింది. ఈలోగా ‘సాక్షి’ పత్రికలో వచ్చిన వార్తలు, ఫొటోలు రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. దీనిపై కొందరు వైసీపీ నాయకులతోపాటు మరికొందరు సామాజిక ఉద్యమ కారులు సాయికృష్ణ ఉదంతంపై గళం విప్పడం ప్రారంభించారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రులు గానీ, పోలీసు ఉన్నతాధికారులుగానీ ఈ అంశంపై మాట్లాడేందుకు సాహసించలేదు. రాజమండ్రి ఎస్పీ ఆధ్వర్యంలో ఒక విచారణ సంఘాన్ని వేసి చేతులు దులుపుకొన్నారు.

రెండు రోజుల క్రితం ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాయికృష్ణ ఇంటికి వెళ్లి అతని తల్లిని పరామర్శించి, ఉదంతంపై సీబీఐ ఎంక్వయిరీకి డిమాండ్‌ చేశారు. ఆ తర్వాత ప్రభుత్వంలో కొంత కదలిక వచ్చింది. విజయలక్ష్మి గతంలో మొరపెట్టుకున్నా స్పందించని కమిషనర్‌ వెంటనే ఆమె కుటుంబ సభ్యులను పిలి పించుకొని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారట! ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా విజయలక్ష్మిని, ఆమె సోదరులను తన నివా సానికి రప్పించి న్యాయం చేస్తామని చెప్పారట! నిందితులను శిక్షిస్తామని కూడా హామీ ఇచ్చారట! సీఐ నాగరాజును సస్పెండ్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. అతనిపై హత్య కేసు నమోదు చేసి విజయవాడ కమిషనరేట్‌ పరిధిలోని ఓ ఏసీపీని దర్యాప్తు అధికారిగా నియమించారు.

ఇక్కడే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాయికృష్ణ హత్య జరిగిందని పోలీసులు భావిస్తున్నట్టయితే దానికి సీఐ ఒక్కడే బాధ్యుడవుతాడా? కిందివారికిగానీ, పైస్థాయి వారికిగానీ ఎవ రికీ తెలియకుండానే నాగరాజు హత్య చేసి శవాన్ని మాయం చేశాడా? సాయికృష్ణను అరెస్టు చేసి తీసుకొచ్చిన టాస్క్‌ఫోర్స్‌ విజయవాడ కమిషనర్‌ పరిధిలో పనిచేస్తున్నది. కృష్ణలంక సీఐ నాగరాజు కూడా ఆయన పరిధిలోనే పని చేస్తున్నారు. పోలీస్‌ స్టేషన్‌లలో రోజువారీ రొటీన్‌ ప్రకారం డైలీ సిచువేషన్‌ రిపోర్టు (డీఎస్‌ఆర్‌)ను కమిషనర్‌ కార్యాలయానికి (గ్రామీణ జిల్లాల్లో అయితే ఎస్పీ ఆఫీసుకు) స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ పంపిస్తారు.



అందులో ఆరోజు అరెస్టు చేసి తీసుకొచ్చిన వివరాలు కూడా ఉంటాయి. పైగా రోజుకు రెండుసార్లు కమిషనర్‌తో స్టేషన్‌ అధి కారులకు టెలీకాన్ఫరెన్స్‌ కూడా ఉంటుంది. ఇందులో కమిషన ర్‌తో పాటు డీసీపీలు, ఏసీపీలు, సీఐలందరూ పాల్గొంటారు. ఆరోజు ఇరిగిన వ్యవహారాలన్నీ అందులో చర్చకు వస్తాయి. ఇటువంటి పకడ్బందీ ఏర్పాట్లు ఉన్నప్పుడు పైస్థాయి అధికారులకు సాయికృష్ణ లాకప్‌ వ్యవహారం తెలియకుండా ఎలా ఉంటుంది? అతను లాకప్‌లో చనిపోతే ఆ విషయం కూడా పైస్థాయి అధికారులకు ఎలా తెలియకుండాపోతుంది? ఓ దళిత యువకుడు క్రాంతికుమార్‌ కూడా మే 21న ఆత్మహత్య చేసు కున్నారు. ‘సీఐ నాగరాజు వేధింపులను తట్టుకోలేకపోతున్నాను. మళ్లీ పోలీస్‌ స్టేషన్‌కు రమ్మని పిలుస్తున్నారు. మాదిగ కులంలో పుట్టడమే నేను చేసిన పాపమా’ అని ప్రశ్నిస్తూ లైవ్‌లో ఆత్మ హత్య చేసుకున్న వీడియో ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నది. సాయికృష్ణ మృతి, క్రాంతి కుమార్‌ ఆత్మహత్య దాదాపు ఒక వారం రోజుల వ్యవధిలోనే జరిగి ఉంటాయి. పైస్థాయి తోడ్పా టుపై ఎంత భరోసా లేకపోతే ఆ సీఐ ఇంత విచ్చలవిడిగా వ్యవ హరిస్తాడు? ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో పోలీసు శాఖ పరిధిలోనే విచారణ జరిపితే న్యాయం జరిగే అవకాశం లేదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

నగర పోలీస్‌ కమిషనర్‌కు సీఐ నాగరాజు వ్యవహారం తెలిసే ఉంటుందనీ, లేకపోతే శవాన్ని మాయం చేయడంగానీ, ఇంతకాలం విషయాన్ని దాచిపెట్టడంగానీ సాధ్యం కాదనేది సహజంగా ఎవరికైనా కలిగే అభిప్రాయం. ఈ నేపథ్యంలో సాయికృష్ణ ఉదంతంపై, నాగరాజు నిర్వాకాలపై సీబీఐ విచారణ జరిగితేనే న్యాయం జరిగే అవకాశముంటుంది. లేకపోతే శవం దొరకలేదు కాబట్టి, లాకప్‌లో చంపారనేందుకు ఎవరూ సాక్ష్యం చెప్పలేదు కాబట్టి కేసును హుష్‌కాకి చేయరని చెప్పలేము. సాయికృష్ణ, క్రాంతికుమార్‌ ఉదంతాలే కాదు, తెనాలిలో తిరుపతమ్మ అనే మహిళ తాను చేయని నేరాన్ని ఒప్పుకోవాలని పోలీసులు వేధించడం వల్ల గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నది. మే 25న ఈ ఘటన జరిగింది. జూన్‌ 16న విజయనగరం జిల్లాలో కూడా మరో మహిళ అదే కారణాలతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నది.

చేయని నేరాలని అంగీకరించాలని బలహీన వర్గాలను వేధించడం యథేచ్ఛగా జరిగిపోతున్నది. పొలిటికల్‌ గవర్నెన్స్‌ కారణంగా ఈ ధోరణి మరింత పెచ్చరిల్లిపోతున్నది. పవర్‌ చేతిలో ఉన్నప్పుడు బాధిత కుటుంబాల సభ్యులను నయానో భయానో లొంగదీసుకోవడం అధికారులకూ, నేతలకూ పెద్ద కష్టం కాకపోవచ్చు. తమకు న్యాయం జరిగిందని బాధితుల నోటితో చెప్పించినా ఆశ్చర్యపడిపోవలసిన అవసరం లేదు. కానీ రాజ్యాంగ విలువల్ని ధ్వంసం చేసే ఈ దుర్మార్గాన్ని అంతం చేయాలంటే ప్రతి లాకప్‌ డెత్‌ కథను, ప్రతి పోలీసు వేధింపు ఉదంతాన్ని జై భీమ్‌ కథ లాగా ముగించవలసిన అవసర మున్నది. రాజ్య వ్యవస్థను బాధ్యురాలిగా నిలబెట్టవలసిన అవసరం పౌర సమాజం మీద ఉన్నది. అప్పుడే రాజ్యాంగబద్ధ పరిపాలన సాధ్యమవుతుంది. అందుకు తొలిమెట్టుగా విజయ వాడ ఘటనలపై సీబీఐ దర్యాప్తు జరిగేలా ఉద్యమించాలి. జై భీమ్, జై సంవిధాన్‌!!


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement