ఇంత క్రూర పరిహాసమా స్వామీ! | Sakshi Editorial On Chandrababu coalition govt two Years Rule by Vardhelli Murali | Sakshi
Sakshi News home page

ఇంత క్రూర పరిహాసమా స్వామీ!

Jun 14 2026 12:04 AM | Updated on Jun 14 2026 12:04 AM

Sakshi Editorial On Chandrababu coalition govt two Years Rule by Vardhelli Murali

జనతంత్రం

తిరుపతి సమీపాన నిన్న కూటమి సర్కార్‌ రెండేళ్ల పండుగ సభ జరిగింది. ఆ సభలో చెప్పుకోవడానికి విశేషాలు చాలానే ఉన్నాయట! సభా ప్రాంగణంలో లోకేశ్‌బాబు కలియతిరిగారట. మంత్రులూ, ఎమ్మెల్యేలు, ఎంపీలతో ముచ్చటించారట! ఆంధ్రజ్యోతి రాసింది. మూడో క్లాస్‌ చదువుతున్న అనిత్‌రాజ్‌ అనే బాలుడు ‘డిప్యూటీ సీఎంతో ఫోటో దిగాలని ఉంద’ని ఓ ప్లకార్డు పట్టుకొని వేదిక సమీపంలో నిలబడ్డాడట! అది చూసిన పవన్‌ కల్యాణ్‌ వేదికపైకి అనిత్‌రాజ్‌ను పిలిపించుకున్నారట! ఈనాడు రాసింది.

వేదిక పైకి వచ్చిన అనిత్‌రాజ్‌ పవన్‌ను బాబాయ్‌ అని, చంద్రబాబును తాతయ్యా అని పిలిచాడట! లోకేశ్‌బాబును ఏమని పిలిచాడో ఈనాడు రాయలేదు. బహుశా ఆయన కలవ లేదేమో! తాతయ్యా అన్న బాలుని పిలుపుతో చంద్రబాబు ఉత్సాహం పొందినట్టున్నారు. యువత కలలను సాకారం చేసే బాధ్యత తమదేనని ఓ ట్వీట్‌ రువ్వారు. ఇది కూడా ఈనాడే రాసింది. మూడో క్లాసు చదివే అనిత్‌రాజ్‌కు ఎనిమిదేళ్లుంటా యేమో! ఆ సభలో తాతయ్య ప్రసంగం వినిఉండకపోవచ్చు. విన్నా అర్థం చేసుకునే వయసు కాదు.

డియర్‌ అనిత్‌రాజ్, ఆ తాతయ్య మాటల్లో కొసరుగా విసిరిన ఓ అవశేషంలో ఎంత నమ్మకద్రోహం దాగి ఉన్నదో నీకు బోధపడకపోవచ్చు. నీకంటే పదేళ్లు పెద్దవాళ్లయిన పెద్దక్కల దగ్గర్నుంచి, అమ్మ వయసు అత్తలూ, పెద్దమ్మలూ, పిన్నమ్మల వయసువాళ్లకూ, యాభై తొమ్మిదేళ్ల లోపు వుండే అమ్మమ్మలూ, నానమ్మలకూ వేదికపైనున్న తాతయ్య తీరని ద్రోహం చేశారు. దీన్నే నయవంచన అని కూడా అంటారు. ఆ వయసువాళ్ల ఆత్మీయ మహిళలందరికీ వెన్నుపోటు పొడిచిన తాతయ్య మీ కలలను నెరవేరుస్తారంటే నమ్మశక్యమేనా?

అన్నిటికంటే పెద్ద విశేషమేమిటంటే ఈ సభకు ‘నమ్మకం’ అనే పేరు పెట్టుకున్నారు. ‘రెండేళ్లలో ప్రజల నమ్మకాన్ని నిల బెట్టుకున్నాం, అదే కూటమి ప్రభుత్వ విజయం’ అనే మకుటంతో మీడియాలో అడ్వరై్టజ్‌మెంట్లను హోరెత్తించారు. ఆ సభ వేదికపై నుంచి మాట్లాడుతూనే ‘ఆడబిడ్డ నిధి’ పథకానికి ఆర్థిక సమస్యలున్నాయనీ, పీ–4 పథకంతో వారికి సహాయం చేస్తా మనీ ముఖ్యమంత్రి సన్నాయి నొక్కులు నొక్కారు. సూపర్‌ సిక్స్‌ పథకాలకు కూటమి మేనిఫెస్టోలో అత్యంత ప్రాధాన్యతనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రధానమైన ఈ ఆరు హామీలను నెరవేర్చడా నికి ఆర్థికపరమైన ఇబ్బందులేమీ ఉండవని ఎన్నికల సభల్లో చంద్రబాబు పలుమార్లు ప్రకటించారు.

2024 జూన్‌ నుంచే ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలుచేస్తా మని కూటమి వాగ్దానం చేసింది. రెండేళ్లు గడిచిపోయాయి. తల్లికి వందనం పథకానికి కూడా మొదటి సంవత్సరం ఎగ నామం పెట్టి, రెండో సంవత్సరం అమలు చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకొని రెండేళ్లు ఆలస్యంగానైనా ‘ఆడబిడ్డ నిధి’ని అమలుచేస్తారేమోనని కోటీ ఎనభై లక్షలమంది మహిళలు ఎదురు చూస్తున్నారు. వారి ఆశలపై చంద్రబాబు తిరుమలేశుని సాక్షిగా చల్లనీళ్లు చల్లారు. ఏపీలో ఓటుహక్కు ఉన్న మహిళలు రెండు కోట్ల ఏడు లక్షలమంది. వీరిలో అరవై, అంతకుమించిన వయసున్నవారు 12 శాతం వరకు ఉంటారని సెన్సస్‌ లెక్కలు చెబుతున్నాయి. వారిని మినహాయించి సుమారు ఒక కోటి ఎనభై లక్షలమంది మహిళలకు కూటమి సర్కార్‌ ఇప్పటికే ఒక్కొ క్కరికి ఏటా 18 వేలు చొప్పున రెండేళ్ల నిధులు బకాయి పడింది. ఇప్పుడు మొత్తానికే పథకాన్ని ఎత్తేస్తున్నట్టు ప్రకటించారు.

పీ–4 పథకంతో ఆదుకుంటామనేది పచ్చి బూటకం. అసలీ పథకమే పౌరుల ఆత్మగౌరవాన్ని అంగట్లో పెట్టే అమానవీయ స్వభావం గలది. తమకు దిక్కు దివాణం లేదని పేద కుటుంబాలు దరఖాస్తు చేసుకోవాలట! దయగలిగిన ధనవంతులు కొన్ని కుటుంబాలను దత్తత తీసుకొని వారికి సహాయం చేయా లట! ఇది అయ్యే పనేనా? పేదరికం నుంచి ప్రజలను విముక్తం చేయడం ప్రభుత్వాల బాధ్యత. నాణ్యమైన విద్యను వారికి అందజేయడం ద్వారా, అభ్యున్నతికి చేరుకునే అవకాశాలు కల్పించడం ద్వారా వారి జీవితాల్లో మార్పు చేయాలి. వనరుల్లో వారికి తగినంత వాటా కల్పించాలి. ఇది రాజ్యాంగబద్ధమైన ఆదేశం. అలాకాకుండా ధనవంతుల దొడ్లో పేదవాళ్లను కట్టేయ డమనేది బానిస వ్యవస్థ లక్షణం.

అయినా పీ–4 విధి విధానాలకు, ‘ఆడబిడ్డ నిధి’ పథకానికి సారూప్యత ఎక్కడున్నది! మహిళల కోసం జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన ‘చేయూత’, ‘ఆసరా’ పథకాలకు దీటుగా ప్రకటించిన పథకం ‘ఆడబిడ్డ నిధి’. ఈవిధంగా ఎన్నిక లకు ముందు నమ్మబలికి ఇప్పుడీ పథకాన్ని పూర్తిగా అటకెక్కించారు. మహిళల ఆత్మగౌరవానికీ, సాధికారతకూ పెద్దపీట వేస్తూ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన ప్రతిష్ఠాత్మకమైన ‘అమ్మవొడి’ పథకానికి బదులుగా ‘తల్లికి వందనం’ పేరుతో కూటమి ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది.

పేద కుటుంబాల పిల్లలు కూడా నాణ్యమైన విద్యను అభ్యసించాలని అభిలషిస్తూ ప్రభుత్వ పాఠశాలల స్థాయినీ, బోధనా పద్ధతులనూ అనూహ్యమైన స్థాయిలో ప్రైవేట్‌ స్కూళ్లను తలదన్నేలా మెరుగుపరిచింది జగన్‌ సర్కార్‌. జగన్‌ మోహన్‌రెడ్డి స్వయంగా పరిశీలించి విద్యార్థులందరికీ మంచి స్కూల్‌ బ్యాగ్‌లు, బూట్లు, బెల్ట్, శ్రేష్ఠమైన పౌష్ఠికాహారాన్ని ఎంపిక చేసిన సంగతి పాఠకులకు విదితమే. డిజిటల్‌ బోర్డులు, ట్యాబ్‌లూ ప్రభుత్వ బడుల్లో ప్రవేశించాయి. శిథిలమైన బడి భవనాలు, విరిగిపోయిన బల్లలు, అసహ్యకరమైన పరిస్థితుల్లో ఉండే సింగిల్‌ వాష్‌రూముల ముందట లైన్‌లో నిలబడే పిల్లలు, అసలు వాష్‌రూములే లేక బడి మానేసే ఆడపిల్లలు, తాగడానికి మురికి నీళ్లే గతి అనే పరిస్థితులను మార్చి కార్పొరేట్‌ స్కూళ్ల స్థాయిలో వాష్‌రూమ్‌లూ, శుభ్రమైన తాగునీరూ అందేలా జగన్‌ ఏర్పాట్లు చేశారు.

ఒకపక్క  ఇంత నాణ్యమైన విద్యకు మౌలిక వసతులను ఏర్పాటు చేస్తూనే ఇంగ్లీషు మీడియం బోధననూ, సీబీఎస్‌ఈ సిలబస్‌నూ పేద బిడ్డలకు పూర్తి ఉచితంగానే అందుబాటులోకి తెచ్చారు. దాంతోపాటు ఎట్టి పరిస్థితుల్లో డ్రాపవుట్లు ఉండకుండా బిడ్డలను బడికి పంపేలా తల్లిని ప్రోత్సహించడం కోసం జగన్‌మోహన్‌రెడ్డి ‘అమ్మవొడి’ పథకాన్ని ప్రవేశపెట్టారు. నాణ్యమైన విద్య ద్వారా ఉన్నతమైన సమాజాన్ని నిర్మించాలనే ఒక సమగ్ర వ్యూహంలో ‘నాడు–నేడు’ ‘అమ్మవొడి’ అనేవి రెండు అవిభాజ్యమైన అంశాలు. ఈ వ్యూహంలో అమ్మది కేంద్ర స్థానం.

‘అమ్మవొడి’ పథకం నేపథ్యంలో ఉన్న ఉన్నతమైన తాత్విక భూమిక ‘తల్లికి వందనం’ పథకానికి లేదు. అటువంటి ఉన్నత లక్ష్యమే ఉన్నట్లయితే ‘నాడు–నేడు’ పథకం కొనసాగి ఉండేది. ఇంగ్లీష్‌ మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్, సబ్జెక్ట్‌ టీచర్‌ మోడల్‌ కొనసాగి ఉండేవి. ఇప్పుడివేమీ లేవు. ప్రభుత్వ బడులకు మళ్లీ పూర్వపు రోజులు వచ్చాయి. దాదాపు పది లక్షలమంది విద్యార్థులు ప్రైవేట్‌ స్కూళ్ల బాట పట్టినట్టు సమాచారం. ప్రభుత్వం ఈ లెక్కలను ఉద్దేశపూర్వకంగానే తొక్కిపెడుతున్నది. ఎంత మంది విద్యార్థులు చదువు మానేశారో లెక్కల్లేవు. జగన్‌ ప్రభుత్వం ప్రతి విద్యార్థిని పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన ట్రాకింగ్‌ సిస్టమ్‌ ఇప్పుడు లేదు. ప్రభుత్వ బడుల పునరుజ్జీవనం, పేద పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్య లభించాలనే ఉద్దేశంతో ‘అమ్మవొడి’ని జగన్‌ తీర్చిదిద్దారు. కేవలం ఎన్నికల్లో తనకు సహకరించే కార్పొరేట్‌ స్కూళ్ల లాబీకి కాసుల వర్షం కురిపించేలా తల్లికి వందనం పథకాన్ని కూటమి డిజైన్‌ చేసింది. ఇదీ తేడా!

లక్ష్యం ఇంత హేయమైనది కనుకనే నీకు పదిహేను, నీకు పదిహేను ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదిహేను వేలంటూ చౌకబారు ప్రచారాన్ని కూటమి చేసింది. పోనీ ముందుగా చెప్పినట్టు పిల్లలందరికీ ఈ పథకం వర్తిస్తున్నదా? జగన్‌ ప్రభుత్వం దిగిపోయే నాటికి ప్రభుత్వం, ప్రైవేట్‌ స్కూళ్లలో 80 లక్షలకు పైగా విద్యార్థులుండేవారు. తల్లికి వందనం పథకానికి మాత్రం 67 లక్షల మందినే అర్హులుగా తేల్చారు. విద్యాహక్కు చట్టం కింద ప్రైవేట్‌ బడుల్లో చేరినవారిలో లక్షమందిని లబ్ధి దారుల జాబితా నుంచి తొలగించారు. కేంద్ర స్కాలర్‌షిప్‌ను పొందుతున్న మరో లక్షమందిని తొలగించారు. ఆధార్‌ సరిగా లేదనీ, అడ్రస్‌ సరిగా లేదనీ మూడు లక్షలమందికి మొండిచేయి చూపారు. పంచ పాండవులు – మంచం కోళ్ల సామెతలా సాగు తున్న ఈ పథకం చివరకు ఎక్కడ ఆగుతుందో చూడాలి.

అధికార యంత్రాంగంలో, రాజకీయ నేతలలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని ప్రతిపక్షం కాదు... అధికార పక్షానికి అనుకూలంగా ఉండేవారే విమర్శిస్తున్నారు. అమరావతి ప్రయోగం డిజాస్టర్‌గా మిగలబోతున్నదనీ, పోలవరం పనులు పరమ నాసిరకంగా జరుగుతున్నాయనీ నిపుణులు ఆరోపిస్తు న్నారు. డీఎస్సీ పరీక్షలో సాక్షాత్తూ ప్రభుత్వ ముఖ్యులే అవినీతికీ, ఆశ్రిత పక్షపాతానికీ తెరలేపి లక్షలాది మంది యువకుల కల లను కల్లలు చేశారు. వ్యవస్థల విశ్వసనీయత పట్ల యువతరంలో నమ్మకం సన్నగిల్లుతున్నది. పేదలు, మధ్యతరగతి ప్రజల పాలిట అపర సంజీవనిలాంటి ఆరోగ్యశ్రీ పథకానికి మరణ శాసనం అమలు చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఫార్సుగా మార్చారు. వృద్ధుల సంఖ్య పెరుగుతున్నదనీ, ముగ్గురు నలు గురు పిల్లల్ని కనాలనీ బోధిస్తున్న చంద్రబాబు సామాజిక పెన్షన్లలో మాత్రం వృద్ధుల సంఖ్యను తగ్గిస్తున్నారు. ఏ రంగం చూసినా ఏమున్నది గర్వకారణం, ప్రభుత్వాంగాలన్నీ అవినీతి రోగగ్రస్థం అన్నట్టుగా పరిస్థితులు తయారయ్యాయి. ఓట్లకోసం ప్రజల అరచేతుల్లోకి వైకుంఠం సినిమాను ప్రొజెక్ట్‌ చేసి ఇప్పుడు వారందరికీ సామూహికంగా వెన్నుపోటు పొడిచిన తర్వాత నమ్మకాన్ని నిలబెట్టుకున్నామంటూ సభ పెట్టడం న్యాయమా? సమాజం మీద ఇంత క్రూరమైన పరిహాసమేమిటి స్వామీ!


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement