కాంగ్రెస్‌ రంగు మారిందా? | Sakshi Editorial On Telangana Congress Party And Revanth Reddy | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ రంగు మారిందా?

Jan 25 2026 1:16 AM | Updated on Jan 25 2026 1:16 AM

Sakshi Editorial On Telangana Congress Party And Revanth Reddy

జనతంత్రం

సింగరేణిపై ఏ గద్దలనూ, ఏ పెద్దలనూ వాలనీయబోనని భట్టి విక్రమార్క ఘంటాపథంగా చెబుతున్నారు. ‘ఆంధ్రజ్యోతి’ రాధాకృష్ణ తన మీద చేసిన ఆరోపణలపై ఈ శనివారం కూడా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ అంశంపై ఇదేవారంలో తెలంగాణ ఉపముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన రెండో మీడియా సమావేశం ఇది. రాబందుల ప్రయోజనాలను కాపాడటానికే రాధాకృష్ణ తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని భట్టి విమర్శించారు. ‘పెట్టుబడికీ కట్టుకథకూ పుట్టిన విషపుత్రిక’గా ఆ పత్రికను అభివర్ణిస్తూ ‘ఎవరి కళ్లలో ఆనందం చూడటానికి నాపై తప్పుడు వార్తలు రాస్తున్నావ’ని రాధాకృష్ణను ఆయన ప్రశ్నించారు.

సింగరేణి యాజమాన్యం కింద ఉన్న నైనీ బ్లాక్‌ బొగ్గు తవ్వకాల కాంట్రాక్టును ఎన్టీవీ యజమాని బంధువుకు ఇప్పించడం కోసమే ఎక్కడా లేని ‘సైట్‌ విజిట్‌’ నిబంధనను భట్టి విక్రమార్క తీసుకొచ్చారని ఆ వ్యాసంలో రాధాకృష్ణ ఆరోపించారు. అదే కాంట్రాక్టు మీద కన్నేసిన మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డుతగలడంతో ఆయన మీద ఎన్టీవీలో ఒక అభ్యంతరకరమైన కథనం ప్రసారమైందని రాధాకృష్ణ ఆరోపించారు. ‘సైట్‌ విజిట్‌’ నిబంధనను తను తీసుకొని వచ్చానన్న ఆరోపణ శుద్ధ అబద్ధమని తేలుస్తూ శనివారం నాడు భట్టి డాక్యుమెంటరీ సాక్ష్యాలను విడుదల చేశారు.

నలభయ్యేళ్లుగా రాజకీయ నిబద్ధతతో నిర్మించుకున్న తన వ్యక్తిత్వాన్ని హననం చేయడం పట్ల భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి శిష్యుడిగా రాజకీయాల్లో ఎదిగినందుకే తనను రాధాకృష్ణ టార్గెట్‌ చేశారని కూడా మొదటి సమావేశంలో ఆయన ఆరోపించారు. నిజంగానే భట్టిది నిబద్ధతతో కూడిన రాజకీయ జీవితమే! దళిత కుటుంబం నుంచి ఎదిగిన విద్యాధి కుడు. హైదరాబాద్‌ యూనివర్సిటీలో ఎం.ఏ. చదివారు. వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కొంతకాలం ఎమ్మెల్సీగా పని చేసి, తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం నుంచి వరసగా నాలుగుసార్లు అసెంబ్లీకి ఎన్నికై కమ్యూనిస్టు నేత బోడేపూడి వెంకటేశ్వరరావు రికార్డును బద్దలు కొట్టారు. గడచిన అసెంబ్లీలో తన సహచర పార్టీ ఎమ్మెల్యేలు వరుసకట్టి పార్టీ ఫిరాయిస్తున్నా చలించకుండా పార్టీకే కట్టుబడిన వ్యక్తి. అనంతరం పార్టీ గెలుపు కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసి కాంగ్రెస్‌ గెలిస్తే ముఖ్యమంత్రి అయ్యే అవకాశమున్న వారిలో ముఖ్యమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. అటువంటి తన కెరీర్‌పై మీడియాలో బురద చల్లడం పట్ల సహజంగానే ఆయనకు ఆవేదన కలిగి ఉంటుంది.

భట్టితో పాటు అదే వ్యాసం మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా బజారున పెట్టింది. మంత్రి పదవిలో ఉండి సొంత పనికోసం తన పలుకుబడిని ఉపయోగించుకున్నారనే మరకను ఆయనకు అంటించారు. పేర్లు ప్రస్తావించకుండా మంత్రి మీద, మహిళా అధికారుల మీద ఎన్టీవీ ప్రసారం చేసిన ‘ఆఫ్‌ ది రికార్డు’ కథనం అభ్యంతరకరమైనదే! కాకపోతే మాజీ గవర్నర్, వయోవృద్ధుడైన ఎన్‌.డి. తివారీ మీద రాసలీలల పేరుతో కథనాలు వండివార్చిన ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక మరో మీడియా ఛానల్‌ను ఎత్తిచూపడమే వింతగొలుపుతున్నది. మీడియాలో అభ్యంతరకరమైన వార్తలు వచ్చినప్పుడు ఆ మీడియా సంస్థ ముఖ్యబాధ్యులకు నోటీసులివ్వడం, పరువు నష్టం కేసులు, సివిల్‌ కేసులు వేయడం ఒక సంప్రదాయం. కానీ ఎకాయెకిన క్రిమినల్‌ కేసులు పెట్టి, ఎంపిక చేసుకున్న ముగ్గురు బీసీ, ఎస్సీ జర్నలిస్టులను (దొంతు రమేశ్, పరిపూర్ణాచారి, సురేశ్‌) అరెస్టు చేశారు. 

గత కొంతకాలంగా పాత కాంగ్రెస్‌ నేతల మీద రకరకాల లీకులు, ఆరోపణలు అటు యెల్లో మీడియాలో, ఇటు సోషల్‌ మీడియాలో వరసగా కనిపిస్తున్నాయి. దీని వెనుకనున్న అదృశ్య హస్తం ఎవరిదనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది. కాంగ్రెసులోనే పుట్టి పెరిగిన బీసీ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడైన మంత్రి మీద కూడా సోషల్‌ మీడియాలో విప రీతంగా వ్యతిరేక ప్రచారం జరిగింది. నాలుగు దశాబ్దాలుగా జగి త్యాల ప్రాంత కాంగ్రెసుకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన సీనియర్‌ నేత, నిబద్ధత గల నాయకుడిగా పేరున్న జీవన్‌రెడ్డికి పార్టీలోనే పొగబెట్టడం కార్యకర్తలను విస్మయానికి గురిచేసింది. గాంధీ భవన్‌లో జరిగిన తమ పార్టీ ప్రాంతీయ సమావేశంనుంచి కూడా ఆయన వాకౌట్‌ చేసి బయటకు రావలసిన దుఃస్థితి పాత కాంగ్రెస్‌ నేతల పరిస్థితికి ఇప్పుడు అద్దం పడుతున్నది.

కాంగ్రెస్‌ వ్యవహారాల్లో ఈ లీకులు, ఆరోపణలు, యెల్లో మీడియా ద్వారా వెలువరిస్తున్న కథనాలు, కుంభకోణాలు వగైరాలన్నీ ఉపకథలు మాత్రమే. అసలు కథ అంతర్లీనంగా జరుగుతున్న రాజకీయ మార్పు. కొద్ది రోజుల కిందట ఖమ్మంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన రాజకీయ ప్రసంగం తెలంగాణ సమాజంలో తీవ్ర సంచలనాన్ని సృష్టించింది. రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీని లేకుండా చేసిన బీఆర్‌ఎస్‌ పార్టీని ఎన్టీఆర్‌ అభిమా నులూ, చంద్రబాబు అనుయాయులూ కలిసి బొందపెట్టాలని, బీఆర్‌ఎస్‌ పార్టీ జెండా దిమ్మెలను కూల్చేయాలని ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో ముఖ్య భాగ స్వామి. రేవంత్‌ కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి. కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన శత్రువు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి. 

మరి రేవంత్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ను ఓడించడానికి ఎన్డీఏ అభిమానులను ఆహ్వా నించడమేమిటి? రాష్ట్ర కాంగ్రెస్‌లో కాంగ్రెస్‌ రక్తమే ఉన్నదా? లేక ‘క్రమశిక్షణ కలిగిన రక్తకణాలు’ ఏవైనా బయట నుంచి ప్రవేశించాయా? ‘మా రక్తాన్ని ఎక్కించుకుంటే చిరంజీవి ఎన్నికల్లో గెలిచే వాడ’ని వెనుకటికి ఒక ‘కులోత్తుంగ’ చోళుడు నుడివిన పలుకులు ఎవరూ మరిచిపోయేవి కావు. తెలంగాణా కాంగ్రెస్‌ పార్టీలో ఏదో ఒక మార్పయితే జరుగుతున్నదనే అభిప్రాయం కార్యకర్తల్లో ఈమధ్య బాగా వినిపిస్తున్నది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బొందపెట్టిందెవరు? బీఆర్‌ఎస్సా? ఎంత మాత్రం కాదు. 2004లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి నాయకత్వం లోని కాంగ్రెస్‌ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ‘తెలుగుదేశం’ను భూస్థాపితం చేసింది. ‘మహాకూటమి’ని ఏర్పాటు చేసుకున్నా కూడా 2009లో అది లేవలేకపోయింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మాత్రమే ఆంధ్రప్రదేశ్‌లో మోదీతో, పవన్‌తో జోడీ కట్టి అలవికాని హామీలిచ్చి టీడీపీ పునరుజ్జీవం పొందగలిగింది. కానీ తెలంగాణలో రెండు దశాబ్దాలు దాటినా ఇంకా అది సమాధి స్థితిలోనే ఉన్నది.

కేసీఆర్‌ హయాంలో జరిగిందేమిటంటే, ‘ఓటుకు నోటు’ బాగోతంలో దొరికిపోయినందువల్ల ‘పదేళ్ల రాజధాని’ హైదరా బాద్‌ను వదిలేసుకుని చంద్రబాబు సర్కార్‌ పలాయనం చిత్తగించింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బొందపెట్టింది మాత్రం 2004లో కాంగ్రెస్‌ కార్యకర్తలు, ప్రజలే! ముఖ్యమంత్రి సందేశాన్ని అందుకొని తెలుగుదేశం అభిమానులు పగ సాధించ వలసింది ఎవరిపైన? కాంగ్రెస్‌పైనే కదా! నాటి కాంగ్రెస్‌ – నేటి కాంగ్రెస్‌ అని విభజించి యాక్షన్‌ ప్లాన్‌ అమలుచేయాలా? ఏమిటిప్పుడు తెలుగుదేశం అభిమానుల తక్షణ కర్తవ్యం?

‘ఎవరి కళ్లలో ఆనందం చూడటం కోసం నా మీద అసత్య వార్తలు రాస్తున్నావు రాధాకృష్ణా?’ అని భట్టి ప్రశ్నిస్తున్నారు. ఆ కళ్లు ఎవరివై ఉంటాయి? ఏ రాబందుల ప్రయోజనాల కోసం ఇలా చేస్తున్నావని ప్రశ్నిస్తున్నారు. ఆ రాబందులు ఎక్కడివై ఉంటాయి? భట్టి మీద, ఆయనతో సహా పాత తరం కాంగ్రెస్‌ నేతల మీద ఆ కళ్లు ఎందుకని నిప్పులు పోసుకుంటున్నాయి? జీవన్‌రెడ్డి వంటి నీతిమంతులైన నేతలను ఎందుకని మానసిక క్షోభకు గురిచేస్తున్నాయి? ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రొటో కాల్‌ను పక్కనపెట్టి ‘ఆంధ్రజ్యోతి’ రాధాకృష్ణను కలిసిరావడం కాంగ్రెస్‌ శ్రేణుల్లో కింది నుంచి పైస్థాయి వరకు చాలామందికి మింగుడుపడడం లేదు. బీఆర్‌ఎస్‌ను తరిమికొట్టే పేరుతో తెలుగుదేశం అభిమానులకు స్నేహహస్తం చాచడం కూడా పార్టీ కార్యకర్తలు జీర్ణం చేసుకోలేకపోతున్నారు. ఇరవై రెండేళ్ల కింద తామే స్వయంగా సమాధి చేసిన పార్టీ ఆత్మను ఇప్పుడు ఆవాహన చేయవలసిన అవసరమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు.

కాంగ్రెస్‌ పార్టీలో నిట్టనిలువునా ఒక సైద్ధాంతిక విభజనైతే ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నది. తెలంగాణ, ఏపీ కాంగ్రెస్‌ శ్రేణుల దౌర్భాగ్యం ఏమిటంటే స్వయానా ఆ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్‌గాంధీకి చంద్రబాబుతో అంతుచిక్కని చెలిమి ఏదో ఏర్పడి ఉండటం! ఫలితంగా ఇక్కడ జరుగుతున్న పరిణామాల పట్ల జాతీయ పార్టీకి నియంత్రణ లేకుండా పోయింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నందువల్ల, బీజేపీ మీద బలమైన సైద్ధాంతిక పోరాటం ఆ పార్టీ చేయాలని కాంగ్రెస్‌ నాయకులు గానీ, లౌకికవాదులు గానీ ఆశిస్తారు. కానీ ఇక్కడ ఎన్డీఏ ముఖ్య భాగస్వామి కనుసన్నల్లో జరుగుతున్న పరిణామాలు అందుకు భిన్నంగా ఉంటున్నాయి.

వ్యూహాత్మకంగానే రెండు రాజకీయ పరిణామాలు తెలంగాణలో నిశ్శబ్దంగా జరిగిపోతున్నాయనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఒకటి – కాంగ్రెస్‌ పార్టీలో పాత కాంగ్రెస్‌ లేదా సైద్ధాంతిక కాంగ్రెస్‌వాదులు పూర్తిగా పట్టు కోల్పోయేలా చేయడం! రెండు – రాష్ట్రంలో ప్రతిపక్షంగా బీజేపీ బలపడాలంటే బీఆర్‌ఎస్‌ నిర్వీర్యం కావాలి... అందుకు అవసరమైన భూమికను తయారుచేయడం! గత కొంత కాలంగా తెలంగాణలో జరుగుతున్న రాజకీయ వ్యవహారాలు, విచారణలు వగైరాలన్నీ ఈ కోణంలోంచి చూసినప్పుడే అర్థం చేసుకో గలుగుతాము. ఫోన్‌ ట్యాపింగ్‌ పేరుతో జరుగుతున్న దర్యాప్తులో వేగం పెంచాలని బీజేపీ నేతలు ఒత్తిడి చేయడం, ‘ఫార్ములా–ఇ’ రేసు కేసులో ఈడీ రంగప్రవేశం, ఆగమేఘాల మీద బొగ్గు వ్యవహారంపై కేంద్ర కమిటీ దర్యాప్తు ప్రారంభించడం వగైరాలన్నీ తెలంగాణలో తెర వెనుక జరుగుతున్న విచిత్ర రాజకీయ మైత్రీబంధాల సంకేతాలుగానే భావించాలి.


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement