ఓటర్లు చాటుతున్నదేమిటి? | Sakshi Editorial On Five States Assembly Elections Result | Sakshi
Sakshi News home page

ఓటర్లు చాటుతున్నదేమిటి?

May 5 2026 12:39 AM | Updated on May 5 2026 12:40 AM

Sakshi Editorial On Five States Assembly Elections Result

ప్రజలేమనుకుంటున్నారో పట్టకుండా స్వోత్కర్షలతో, ప్రచారార్భాటాలతో పొద్దుపుచ్చే  అధికార పార్టీలకు ఓటర్లు గుణపాఠం నేర్పారు. సోమవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది మొదలు బెంగాల్‌లో బీజేపీ అప్రహతిహతంగా దూసుకెళ్లి, డబుల్‌ సెంచరీ ఖాయం చేసుకుంది. ఆ పార్టీకి 208 రాగా, టీఎంసీ 79 దగ్గర ఆగిపోయింది. ఆ రాష్ట్రంలో మూడు దఫాలు విజయకేతనం ఎగరేసి అధికారంలో కొనసాగిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం భవానీ పూర్‌లో గెలుపోటముల మధ్య ఊగిసలాడుతూ ఉత్కంఠ రేపారు. మెజారిటీ క్రమేపీ కోల్పోతూ చివరకు ఓడారు. అటు తమిళనాడులో వరసగా రెండుసార్లు అధికార పీఠం కైవసం చేసుకున్న డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కూడా తమిళ హీరో విజయ్‌ కొత్తగా స్థాపించిన తమిళ వెట్రి కళగం(టీవీకే) ప్రభంజనం ముందు నిలబడ లేకపోయారు. 

బెంగాల్‌లో మమత మాదిరే ఓటమిపాలయ్యారు. ఆయన కుమారుడు, ఉపముఖ్యమంత్రి ఉదయనిధి గెలుపు ఉన్నంతలో ఊరట. కేరళలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌ కూటమిపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతి రేకతను కాంగ్రెస్‌ నాయకత్వంలోని యూడీఎఫ్‌ సొమ్ముచేసుకోగలిగింది. అస్సాంలో బీజేపీ, పుదుచ్చేరిలో ఎన్డీయే కూటమి విజేతలుగా నిలిచాయి. అయితే కర్ణాటక మినహా దక్షిణాదిలో మరే రాష్ట్రంలోనూ పాగావేయని బీజేపీని కేరళ, తమినాడు మళ్లీ నిరాశ పరిచాయని చెప్పాలి. తృణమూల్‌ పాలన అధ్వాన్నంగా ఉన్నదని సంకేతాలు వస్తూనే ఉన్నాయి. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా... అంతకుమించి అవినీతి, దౌర్జన్యం కట్టుదాటాయి. 

జనంనుంచి వసూలు చేసిన లంచాల సొమ్ము తక్షణమే వెనక్కివ్వాలంటూ 2019లో మమత సొంత పార్టీ నేతలకు బహిరంగంగా అల్టిమేటం ఇవ్వటం పెను సంచలనం. ఆ పిలుపు ఫలించింది. జనం సైతం పార్టీలో అవినీతిపరులకూ, ఆమెకూ మధ్య విభజన రేఖ గీసుకున్నారు. కానీ ఆపై అవినీతిని ఆమె చూసీచూడనట్టు వదిలేశారు. దాని పర్యవసానమే ఈ ఫలితాలు. బెంగాల్‌లో ఎన్నికల సంఘం(ఈసీ) ఓటర్ల జాబితా సవరణ పేరుతో ఓవరాక్షన్‌ చేయపోయినా కొంత అటూ ఇటూగా ఇవే ఫలితాలొచ్చేవి. జాబితాలకు కోతలు పెట్టడం లేదా కొత్త పేర్లు చేర్చడం అనే రెండు ప్రక్రియల్లోనూ తనది అసమర్థతే నని ఈసీ నిరూపించుకుంది. ఏదో యుద్ధం జరుగుతున్నదన్న స్థాయిలో రెండున్నర లక్షలమంది భద్రతా బలగాలను దించటంవల్లా, 91 లక్షలమంది ఓట్ల తొలగింపువల్లా దేశానికి అప్రతిష్ఠ మిగిలింది. 

కేరళలో యూడీఎఫ్‌ 100కు పైగా స్థానాలు తన ఖాతాలో వేసుకుంది. 44 యేళ్ల తర్వాత అధికారంలోవున్న పార్టీ తొలిసారి వరసగా రెండుసార్లు గెలిచిన రికార్డు దక్కించుకుని గత ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్‌ అందరినీ ఆశ్చర్యపరిచింది. బహుశా పార్టీలో అసమ్మతి లేనట్టయితే, అవినీతి ఆరోపణలు రానట్టయితే ఈ రికార్డు కూడా బద్దలయ్యేది. కానీ రెబెల్స్‌ బెడదతో సీపీఎం ఆ అదృష్టాన్ని చేజార్చుకుంది. స్వతంత్రులుగా బరిలోకి దిగి యూడీఎఫ్‌ మద్దతుపొంది గెలిచిన ముగ్గురూ పార్టీ శ్రేణుల్లో అంతర్గతంగా ఉన్న అసంతృప్తికి అద్దంపట్టారు. రెబెల్స్‌ లేవనెత్తిన అంశాలు ప్రభుత్వ పని తీరును ప్రశ్నార్థకం చేశాయి. 1957లో దేశంలోనే తొలిసారి వామపక్ష ప్రభుత్వం ఆవిర్భ వించటానికి దోహద పడిన రాష్ట్రమే దానికి చరమగీతం పాడటం గమనార్హం. ప్రస్తుతం దేశంలో మరెక్కడా వామపక్షాలు అధికారంలో లేవు సరిగదా... అత్తెసరు స్థానాలతో అవి వెలవెలబోతు న్నాయి. వచ్చేసారైనా కేరళ మళ్లీ ఆదరిస్తుందా అన్నది ప్రశ్నార్థకం.

అయితే ఎన్నికల్లో గెలుపు వేరు, పాలన వేరు. భావోద్వేగాల ఆసరాతోనో, ఆల్‌ ఫ్రీ వాగ్దానాలతోనో అధికారం దక్కించుకోవచ్చు. కానీ ప్రజల ఆకాంక్షలు తీర్చటం, సమర్థవంతమైన పాలన అందించటం ఆ గెలుపంత సులభం కాదు. ఈ సంగతిని కొత్తగా పార్టీ పెట్టి అధికారానికి చేరువలో ఉన్న విజయ్‌ అయినా, బెంగాల్‌లో బీజేపీ అయినా తెలుసుకోవాలి. స్థానికంగా మమతకు దీటైన నాయకులు లేకపోయినా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాల వ్యూహం, వారి ప్రచార హోరు పనికొచ్చాయి. ఈ గెలుపు నిరంతరం కావాలంటే స్థానికంగా నాయకత్వం ఎదగాలి. ఇచ్చిన హామీలు తీర్చాలి. విద్వేషపూరిత వాతావరణం అంతానికి చిత్తశుద్ధితో కృషి చేయాలి. 

Advertisement
 
Advertisement
Advertisement