‘తాత్కాలిక సంధి’ దశ! | Sakshi Editorial On USA, Iran Ceasefire | Sakshi
Sakshi News home page

‘తాత్కాలిక సంధి’ దశ!

Apr 9 2026 12:33 AM | Updated on Apr 9 2026 1:07 AM

Sakshi Editorial On USA, Iran Ceasefire

నలభై రోజులుగా ఇరాన్‌ పౌరుల్ని భీతావహుల్ని చేస్తూ, ప్రపంచాన్ని సైతం అల్లకల్లోల పరుస్తున్న యుద్ధం తాత్కాలికంగా నిలిచింది. రెండు వారాలపాటు కాల్పుల విరమణ పాటించటానికి అమెరికా, ఇరాన్‌లు అంగీకరించటంతోపాటు దాన్ని పూర్తిస్థాయి విరమణగా మార్చటానికి వీలుగా పరస్పరం చర్చించుకోవాలని నిర్ణయించాయి. పాకిస్తాన్‌ దౌత్యం వల్లే అంతా సాధ్యపడినట్టు కనిపిస్తున్నా ఇరాన్‌ను బలంగా ప్రభావితం చేయగల చైనా జోక్యమే ఫలించిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మాటలు చూస్తే అర్థమవుతుంది. పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో ఇరుపక్షాల మధ్యా శుక్రవారం జరగబోయే చర్చల ఫలితం ఎలా ఉండబోతుందో అంచనా వేయటం అంత సులభం కాదు. 

ఎందుకంటే, చర్చలకు ప్రాతిపదికగా అమెరికా విడుదల చేసిన 15 అంశాలకూ, ఇరాన్‌ ప్రతిపాదిస్తున్న 10 అంశాలకూ మధ్య చాలా విషయాల్లో పొసగటం లేదు. భూమిలో పాతిపెట్టిన 60 శాతం శుద్ధిచేసిన 440.9 గ్రాముల యురేనియంను ఇరాన్‌ తవ్వి తీయాల్సిందేనని అమెరికా కోరుతుండగా, ఆ విషయంలో రాజీపడబోమంటున్నది ఇరాన్‌. తమపై ఇన్నేళ్లుగా విధిస్తూవచ్చిన మౌలిక ఆంక్షలనూ, సెకండరీ ఆంక్షలనూ ఎత్తి వేయాలనీ, పశ్చిమాసియా నుంచి అమెరికా సేనలు వైదొలగాలనీ, స్తంభింపజేసిన తమ ఆస్తుల్ని వెనక్కివ్వాలనీ, శాంతి ఒప్పందానికి భద్రతామండలి గ్యారెంటీ ఉండాలనీ ఇరాన్‌ కోరుతోంది. కాల్పుల విరమణలో లెబనాన్‌పై దాడుల్ని నిలిపేయటం భాగమని పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ చెబుతుండగా, అమెరికా తాజా వైఖరిని అంగీక రిస్తూనే ఇజ్రాయెల్‌ ఆ దాడులు ఆగబోవంటున్నది. 

రెండుపక్షాల మధ్య అభిప్రాయ భేదాలు రావటం, అవి ఘర్షణలకు దారితీయటం అసాధారణమేమీ కాదు. ఆ ఘర్షణలు తెచ్చే తీవ్ర ఉద్రిక్తతల వల్ల సంధి కుదరటం ఓ పట్టాన సాధ్యపడదు. కాల్పుల విరమణ ప్రకటన వెలువడి ఏడెనిమిది గంటలు గడిచినా పశ్చిమాసియాలో క్షిపణి దాడులు, బాంబుల మోతలు ఆగకపోవటం ఇందుకు తార్కాణం. కొన్ని దేశాలు మధ్యవర్తి పాత్ర పోషిస్తేనే, ఘర్షణల్లోని నిరర్థకతను వైరి దేశాలకు గుర్తుచేసి ఒప్పిస్తేనే ఆ దిశగా అడుగులు పడతాయి. కానీ ఈసారి అందుకు భిన్నంగా జరిగింది. పెను మారణహోమాన్ని సృష్టిస్తాననీ, ఇరాన్‌ నాగరికత మొత్తాన్ని తుడిచిపెట్టేస్తాననీ ట్రంప్‌ చేసిన హెచ్చరిక చర్చలకు దారులు పరిచింది. యుద్ధనేరాల్లో అగ్రభాగాన ఉండే ‘మారణహోమం’ బెదిరింపు చర్చల సాధనంగా మారటం అత్యంత ప్రమాదకర పరిణామం. 

ఇవాళ ఇరాన్‌కి ఎదురైన పరిస్థితే రేపన్నరోజు వేరే దేశాలకూ ఎదురుకావొచ్చు. తాను వేరే దేశాధ్యక్షుణ్ణి అపహరించవచ్చు... కానీ ఇరాన్‌ మాత్రం ఆత్మరక్షణకు ఎలాంటి చర్యలూ తీసుకోకూడదన్నది ట్రంప్‌ నీతి. అమెరికాతో దాదాపు సమవుజ్జీలుగా ఉండి కూడా చైనా, రష్యాలు అమెరికా వైఖరిని నిర్ద్వంద్వంగా ఖండించలేకపోయాయి. భద్రతా మండలిలో ఒత్తిడి చేయలేకపోయాయి. ఉక్రెయిన్‌ చేస్తున్న దాడులకు అమెరికా సాయం చేస్తున్నది గనుక తాము ఇరాన్‌కు సహకరిస్తున్నామని మాత్రం రష్యా చెప్పింది. బాధిత దేశంగా తనను తాను చిత్రించుకుంటూ రెండేళ్ల పాటు గాజాను ఇజ్రాయెల్‌ వల్లకాడు చేస్తున్నా నోరు మెదపని దేశాలు... ఇరాన్‌ విషయంలోనూ మౌన ప్రేక్షకులుగా మిగిలిపోయాయి. అన్ని మర్యాదలూ మంటగలిపి, మతి చలించినట్టు ప్రవర్తిస్తున్న ట్రంప్‌ ఇరాన్‌పై అణ్వస్త్ర దాడికి తెగబడతారన్న భయంతోనే చివరి నిమిషంలో చైనా కదిలింది. అది నచ్చజెప్పనట్టయితే ఇరాన్‌ అంగుళమైనా వెనక్కి తగ్గేది కాదు.  

కాల్పుల విరమణ కోసం ఇరాన్‌ తమను ప్రాథేయపడిందని అమెరికా యుద్ధశాఖ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ స్వోత్కర్షకు పోతున్నారు. ట్రంప్‌ ఇరాన్‌ విషయంలో చాలా అసహనంగా ఉన్నారని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ అంటున్నారు. కానీ ట్రిగ్గర్‌పైన వేళ్లతోనే ఈ ఒడంబడికకు సిద్ధపడ్డామనీ, శత్రువు వైపు చిన్న పొరపాటు జరిగినా సర్వశక్తులూ ఒడ్డి ప్రతిఘటిస్తామనీ ఇరాన్‌ ప్రకటించింది. కనుక ఈ స్వల్పకాల శాంతిపై ఎవరూ భరోసా పెట్టుకోనవసరం లేదు. ఏ క్షణంలోనైనా అది నీటి బుడగలా మటుమాయం కావొచ్చు. ఇంటా బయటా పెద్ద వినాశకారిగా పరిణమించిన ట్రంప్‌ను అభిశంసన ద్వారా అమెరికా సాగనంపే వరకూ శాంతి, సంధి వంటివి క్షణభంగురాలు!  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement