ప్రపంచమంతా ఎంతో ఆశగా, ఆత్రంగా ఎదురుచూసిన కాల్పుల విరమణ ఒప్పందం ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాకుండానే ముగిసిపోయే ప్రమాదం కనబడుతోంది. తీవ్ర వైషమ్యాలతో కాలుదువ్వుకునే వైరిపక్షాలు యుద్ధ క్షేత్రాన్ని విడిచిపెట్టడం అంత సులభమేమీ కాదు. అందుకే ఒప్పందం కుదిరాక కూడా అక్కడక్కడ పరస్పర దాడులు తప్పవు. కానీ పశ్చిమాసియా పరిస్థితి కాస్త భిన్నమైనది. కాల్పుల విరమణపై తొలుత అమెరికా, ఆ తర్వాత ఇరాన్ ధ్రువీకరించాక, మధ్యవర్తి పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సైతం ప్రకటన చేశారు. ఎప్పుడూ లేనిది ఇజ్రాయెల్ కూడా ఒప్పందాన్ని అంగీక రిస్తున్నట్టు తెలిపింది. కానీ 24 గంటలు గడవకుండానే అందరిదీ తలోమాట అయింది. మధ్యవర్తి పాత్ర పోషించే దేశం దృఢమైన స్వరం వినిపించగలగాలి. అవసరమైతే
శాసించగలగాలి. కానీ అమెరికా అప్పులపై ఆధారపడే పాక్ ఆ పని చేయగలదా? ఘర్షణలు నివారించిన ఖ్యాతిని కూడా ‘త్యాగం’ చేసి, తెరవెనకుండి పాకిస్తాన్ ద్వారా కథ నడిపిస్తున్న చైనా ప్రత్యక్షంగా రంగంలోకి దిగితే అమెరికా, ఇజ్రాయెల్ ఈ మాదిరి డ్రామాలకు సాహసించేవి కాదు.
అసలు పశ్చిమాసియాకు సంబంధించి ఏ ఒప్పందం కుదరాలన్నా అమెరికాను సంతృప్తిపరిస్తే సరిపోదు. ఆ దేశం ఒకటి కాదు... రెండు! అవిభాజ్య కవలల మాదిరిగా వ్యవహరిస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ రెండూ ఒప్పుకుంటే తప్ప ఏదీ సాధ్యపడదు. ఒక్కోసారి ఆ రెండూ కావాలని భిన్న స్వరాలు వినిపిస్తాయి. దీన్ని వ్యూహం అనాలో, చవకబారు ఎత్తుగడగా భావించాలో ఎవరికీ తెలియదు. అమెరికా అవునంటుంది... కాసేపటికి ఇజ్రాయెల్ కాదంటుంది. పర్యవసానంగా అనుకున్నది అమలుకాక అవతలి పక్షం అయోమయంలో పడుతుంది. అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ పట్టాభిషేకమయ్యాక ఆయన అల్లుడు జేర్‌డ్ కుష్నెర్ ద్వారా ఇజ్రాయెల్‌కు చుట్టరికం కలవడంతో పట్టపగ్గా ల్లేకుండా పోయాయి. అందుకే వైట్‌హౌస్‌లో, ట్రంప్‌కు బాగా దగ్గరగావుండే వ్యక్తుల్లో కలకలం మొదలైంది. ఇప్పుడు తోకే కుక్కను ఆడిస్తోందన్న రీతిలో వ్యవహారం ముదిరింది.
కనుకనే ఒప్పందంపై తొలుత ప్రకటించిన ట్రంప్ లెబనాన్‌పై దాడులు సాగుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయారు. అటు తర్వాత ఒప్పందంలో లెబనాన్ ప్రస్తావన లేదని బుకాయించటం మొదలుపెట్టారు. ఇరాన్ 10 అంశాల ముసాయిదా కొత్తదేమీ కాదు. దురాక్రమణకు ముందే ఇరాన్ దాన్ని ప్రతిపాదించింది. అప్పట్లో అది ట్రంప్‌కు నచ్చలేదు. ఇక ఇరాన్ ఎంతకూ లొంగకపోవటం, చమురు ధరలు ఆకాశాన్నంటడంతో కొంపమునుగుతుందని అర్థమై అది ఆచరణయోగ్యమేనని అంగీకరించక తప్పలేదు. తన కూటమిలోని ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేయరాదంటున్న ట్రంప్... ఆ దేశానికి మద్దతుగా నిలబడిన లెబనాన్‌లో మాత్రం ఇజ్రాయెల్ ఊచకోత కొనసాగించటం సబబేనంటున్నారు. ఇది మర్కట తర్కం కాదా? కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం ఉత్సవం చేసుకుంటున్న జనంపై పది నిమిషాలపాటు ఏకధాటిగా సాగించిన కాల్పుల్లో 250 మందికిపైగా మరణించారు. మరో 1,000 మంది గాయపడ్డారు.
కాల్పుల విరమణ ప్రకటించాక అంతవరకూ 119 డాలర్లుగావున్న బ్యారెల్ ముడి చమురు ధర 94 డాలర్లకు చేరింది. కానీ ఇజ్రాయెల్ హంతక దాడులతో అదికాస్తా మళ్లీ 97కు పెరిగింది. అమెరికా, ఇజ్రాయెల్ కపట నాటకాలు కట్టిపెడితే తప్ప ప్రపంచం ప్రశాంతంగా మనుగడ సాగించలేదు. అది జరగాలంటే ఆ రెండు దేశాల్లోని ప్రజలతో పాటు ప్రపంచ దేశాలన్నీ ఒత్తిడి తీసుకురావాలి. ప్రపంచం సంక్షోభం అంచుల్లో ఉంది. ఇరాన్ ఇప్పటికే యుద్ధంవల్ల సమస్తం కోల్పోయింది. 3,000 మంది పౌరులు మరణించగా, లక్షలాది జనావాసాలు శిథిలాలుగా మారాయి. మౌలిక సదుపాయాలన్నీ ధ్వంస మయ్యాయి. ఇరాన్ శక్తిమేరకు ప్రతీకార దాడులు చేస్తూ దురాక్రమణకు దిగిన ఆ రెండు దేశాలతోపాటు, వాటికి సహకరిస్తున్న ఇరుగు పొరుగు దేశాలను సైతం దెబ్బతీయగలి
గింది. పశ్చిమాసియాలో ఇంతకుమించి మరేం జరగకూడదకునే దేశాలు ఇక తటస్థ అవతారాలు చాలించి నిక్కచ్చిగా వ్యవహరించాలి. ఎన్ని లోటుపాట్లున్నా ఈ ఒప్పందం కొనసాగేలా చూడాలి. శుక్రవారం జరిగే చర్చలు ఫలవంతం కావాలి. లేనట్టయితే చరిత్ర క్షమించదు.


