యుద్ధానికి స్వస్తి? | Sakshi Editorial On USA, Israel, Iran War Finished | Sakshi
Sakshi News home page

యుద్ధానికి స్వస్తి?

Jun 16 2026 12:42 AM | Updated on Jun 16 2026 12:42 AM

Sakshi Editorial On USA, Israel, Iran War Finished

ప్రపంచాన్ని పలుమార్లు అంతిమ ఘడియల అంచులవరకూ తీసుకెళ్లిన పశ్చిమాసియా యుద్ధం పరిసమాప్తమైంది. ఘర్షణలు నిలిచిపోయాయని ఈ 107 రోజుల్లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంపే స్వయంగా ప్రకటించిన సందర్భాలు చాలా ఉన్నాయి గనుక, యుద్ధం ఆగిందంటే ఎవరూ నమ్మలేదు. చివరకు ఇరాన్‌ ధ్రువీకరించాకే ట్రంప్‌ మాటను అందరూ విశ్వసించారు. దీన్ని భగ్నం చేసితీరాలన్న కాంక్షతో ఇజ్రాయెల్‌ చెలరేగిపోతోంది. లెబనాన్‌పై క్షిపణి దాడులు చేస్తోంది. హార్మూజ్‌ జలసంధి దగ్గర ప్రస్తుతం 800 నౌకలు నిలిచిపోయాయి. వీటిల్లోని 20,000 మంది సిబ్బంది దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అంతక్రితం మాటెలా వున్నా ట్రంప్‌ రెండో ఏలుబడిలో అమెరికా, ఇజ్రాయెల్‌ అవిభక్త కవలల్లా ప్రవర్తించటం మొదలెట్టాయి. సకల వ్యవస్థల్లో ఇజ్రాయెల్‌ చాపకింద నీరులా విస్తరిస్తున్న తీరుపై అమెరికా ఉన్నతాధికార యంత్రాంగంలోనే భయాందోళనలు అలుముకున్నాయి. నిరుడు సెప్టెంబర్‌లో ట్రంప్‌ వీరాభిమాని, మాగా ఉద్యమ సారథుల్లో ఒకరైన చార్లీ కిర్క్‌ను దుండగుడు కాల్చిచంపిన ఉదంతంలో ఇజ్రాయెల్‌ హస్తముందని ఆ ఉద్యమకారులే ఆరోపించారు. అతను ఇరాన్‌పై యుద్ధానికి బద్ధవ్యతిరేకి. 

ఒబామా హయాంలో ఇరాన్‌తో కుదిరిన అణు ఒప్పందాన్ని గత ఏలుబడిలోనే రద్దుచేసిన ట్రంప్‌... దాన్ని తలదన్నేలా కొత్త ఒప్పందం సాధించితీరతానని శపథం చేశారు. తాజా ఒప్పందం వివరాలు తెలియాల్సేవున్నా, ఇరు దేశాలమధ్యా కుదిరిందంటున్న అవగాహన గమనిస్తే ఆ శపథం నీరుగారినట్టే. తననూ, పార్టీనీ, దేశాన్నీ అధః పాతాళానికి నెట్టేసిన ఈ యుద్ధం నుంచి బయటపడాలని మొదటి వారానికే ట్రంప్‌ తహతహలాడారు. కానీ దోవ దొరకలేదు. దీనికి ప్రపంచం భారీ మూల్యం చెల్లించింది. క్షిపణి దాడుల్లో దాదాపు 4,000 మంది ఇరాన్‌ పౌరులు చనిపోగా, అమెరికావైపు 13 మంది సైనికులు మరణించారు. ఇరాన్‌లో 240 వైద్య ఆరోగ్య కేంద్రాలు ధ్వంసంకాగా, 20 పాఠశాలలు శిథిలాలయ్యాయి. ప్రపంచ పురావస్తు సంపదగా గుర్తించిన అయిదు ప్రాంతాలు, 54 మ్యూజియంలు నాశనమయ్యాయి. చివరకు హార్మూజ్‌లో భారత్‌ వస్తున్న నౌకపై దాడి జరిగి మన  నావికులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. విమాన ఇంధన ధరలు రెట్టింపు కావటంతో పలు సంస్థలు వేలాది విమాన సర్వీసుల్ని రద్దు చేశాయి. చమురు ధరలు పైపైకి ఎగబాకి ద్రవ్యోల్బణం పెరిగింది. ఈ యుద్ధంతో మూడున్నర కోట్లమంది పేదరికంలోకి జారుకున్నారని ఏప్రిల్‌ నెలాఖరున ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. అమెరికా యుద్ధ వ్యయం లక్ష కోట్ల డాలర్లు ఉండొచ్చని హార్వర్డ్‌ ఆర్థికవేత్త లిండా బిల్మ్స్‌ అంచనా. 

విదేశీ యుద్ధాల్లో అమెరికా ప్రమేయం ఉండబోదని హామీ ఇచ్చి అధికారంలోకొచ్చిన ట్రంప్‌... దేశాన్ని యుద్ధం ఊబిలోకి నెట్టారు. యుద్ధం మొదలెడుతూనే ఆయతుల్లా అలీ ఖమేనీతోసహా పలువురు అగ్రనాయకుల్ని హతమార్చి అమెరికా చాలా నష్టపోయింది. ఉన్నంతలో మధ్యేవాద దృక్పథంతో ఉండే ఆ నాయకత్వంతో పోలిస్తే ఇప్పుడున్నవారంతా అత్యంత కఠినంగా వ్యవహరించే రకం. అందుకే ‘బేషరతు లొంగుబాటు’ తప్ప దేనికీ అంగీకరించబోనని మొదట్లో బీరాలు పలికిన ట్రంప్, చివరకు రాజీకోసం కాళ్లావేళ్లా పడాల్సివచ్చింది. ఇంతకూ తనదగ్గరున్న శుద్ధి చేసిన యురేనియంను ఇవ్వ డానికీ, బాలిస్టిక్‌ క్షిపణుల తయారీని ఆపటానికీ, హార్మూజ్‌ వద్ద యథాపూర్వస్థితి పునరుద్ధరణకూ ఇరాన్‌ అంగీకరించిందా? మరో నాలుగు రోజుల్లో ఆ సంగతి తేలాక ట్రంప్‌ పరువు మరింత దిగజారుతుంది. 

వచ్చే నవంబర్‌ మధ్యంతర ఎన్నికలనాటికి ఆర్థికవ్యవస్థ ఎంతో కొంత మెరుగు పడితేనే రిపబ్లికన్‌ పార్టీకి ఓట్లు రాలతాయనీ, లేదంటే అమెరికన్‌ కాంగ్రెస్‌పై పట్టు కోల్పోవటం ఖాయమనీ ట్రంప్‌ బెంగపడుతున్నారు. కానీ ఇంతవరకూ వెల్లడైన వివరా లకే అన్ని వర్గాలూ ఆయన్ను దుయ్యబడుతున్నాయి. ఇరాన్‌ ముందు సాగిలపడ్డారని విమర్శిస్తున్నాయి. ఆర్థికంగా, సైనికంగా నష్టపోయినా తనకున్న అరకొర బలంతోనే చివరివరకూ దృఢంగా పోరాడి ఇరాన్‌ తన పంతం నెగ్గించుకుంది. ఏదేమైనా యుద్ధంలో ఆయుధ సంపత్తి కాదు... సంకల్ప బలమే విజేతను నిర్ణయిస్తుందన్న పురాతన చైనా యుద్ధ వీరుడు సన్‌ జూ మాట మరోమారు రుజువైంది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement