గిన్నిస్ బుక్‌ వరల్డ్‌ రికార్డులో సిలికానాంధ్ర మనబడి | SiliconAndhra Manabadi Creates Guinness World Record, Invites Admissions for 2026–27 | Sakshi
Sakshi News home page

గిన్నిస్ బుక్‌ వరల్డ్‌ రికార్డులో సిలికానాంధ్ర మనబడి

Aug 6 2026 7:15 PM | Updated on Aug 6 2026 7:45 PM

SiliconAndhra Manabadi Creates Guinness World Record, Invites Admissions for 2026–27

వాషింగ్టన్‌: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం ఓక్‌లాండ్‌లో సిలికానాంధ్ర 25వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన అతిపెద్ద తెలుగు పద్య సమూహ పారాయణం గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించింది. ఈ కార్యక్రమంలో మొత్తం 1,712 మంది పాల్గొనగా, వారిలో అధిక సంఖ్యలో సిలికానాంధ్ర మనబడి విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, సమన్వయకర్తలు ఉండటం విశేషం.

పాల్గొన్నవారు సుమతీ శతకం, వేమన శతకం నుంచి ఎంపిక చేసిన 18 పద్యాలను ఏకకాలంలో కంఠస్థంగా పారాయణం చేసి తెలుగు భాషా ప్రావీణ్యాన్ని, తెలుగు సాహిత్యం పట్ల తమ అనుబంధాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. ఈ సమిష్టి పారాయణం ద్వారా తెలుగు భాష, సాహిత్య వైభవం అంతర్జాతీయ వేదికపై మరోసారి ప్రతిధ్వనించింది.

ఈ సందర్భంగా సిలికానాంధ్ర మనబడి ప్రెసిడెంట్, డీన్ చామర్తి రాజు మాట్లాడుతూ, గిన్నిస్ ప్రపంచ రికార్డు వేదికపై 1,712 మంది కలిసి తెలుగు పద్యాలను పారాయణం చేయడం మనబడి ఎన్నో ఏళ్లుగా సాగిస్తున్న భాషా సేవకు నిదర్శనమన్నారు. వేలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థుల ప్రయాణం మనబడి తరగతి గదిలోనే ప్రారంభమైందని పేర్కొన్నారు. అమెరికాలో నివసిస్తున్న తెలుగు కుటుంబాలు తమ పిల్లలను మనబడిలో చేర్పించి మాతృభాషను నేర్పించాలని, భారతదేశంలోని తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు కూడా ఈ విషయంలో ప్రోత్సహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

వెస్ట్రన్ అసోసియేషన్ ఆఫ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ (WASC) గుర్తింపు పొందిన ప్రపంచంలోని ఏకైక తెలుగు విద్యాసంస్థగా సిలికానాంధ్ర మనబడి గుర్తింపు పొందిందని సంస్థ తెలిపింది. స్థాపన నుంచి ఇప్పటివరకు 1.10 లక్షల మందికి పైగా విద్యార్థులకు తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం నేర్పినట్లు వెల్లడించింది.

విద్యార్థుల భాషా ప్రావీణ్యాన్ని దశలవారీగా పెంపొందించేలా బాలబడి–1, బాలబడి–2 నుంచి ప్రభాసం వరకు వివిధ స్థాయిల్లో పాఠ్య ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొంది. తెలుగు భాష, సాహిత్యాల్లో మరింత లోతైన అధ్యయనం కోసం 'ప్రబోధం' పేరుతో ఉన్నత స్థాయి ఐచ్ఛిక కోర్సును కూడా అందిస్తున్నట్లు తెలిపింది. బాలరంజని యాప్ ద్వారా ఇంటరాక్టివ్ అభ్యాసంతో పాటు బాలానందం, తెలుగు మాట్లాట, తెలుగుకి పరుగు, మనతరం వంటి పాఠ్యేతర కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు వివరించింది.

ఇదిలా ఉండగా, 2026–27 విద్యా సంవత్సరానికి సిలికానాంధ్ర మనబడి ప్రవేశాలు కొనసాగుతున్నాయని సంస్థ ప్రకటించింది. అమెరికా, కెనడాలోని 250కు పైగా కేంద్రాల్లో సెప్టెంబర్ మొదటి వారాంతం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయని, తెలుగు భాష, సంస్కృతిని భావితరాలకు అందించే ఈ కార్యక్రమంలో తమ పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement