సోషల్ మీడియా వేదికగా మరో రాయలసీమ ఉద్యమం!
‘మన రాయలసీమ’ అవగాహన సదస్సులో ప్రముఖుల మాట
అమెరికాలో ‘ఆటా-2026’ మహాసభల వేదికగా ఏకాభిప్రాయం
స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళయినా, తెలుగు వారికంటూ ప్రత్యేక రాష్ట్రం 1953లోనే ఏర్పడినా... రాయలసీమ ప్రాంతం ఇప్పటికీ ఆర్థిక, జల వనరుల కేటాయింపులోనూ, అభివృద్ధిలోనూ వివక్షకు గురవుతూనే ఉన్నదని సాహిత్య, సామాజిక, ఆర్థిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. రాయలేలిన సీమగా, రతనాలు రాశులుగా పోసి అమ్మిన సీమగా... సాహిత్య చరిత్రలో పేర్కొంటూ వచ్చినప్పటికీ, వాస్తవానికి పాలకుల నిర్లక్ష్యంలో రాయలసీమ వెనుకబడిన ప్రాంతంగానే నేటికీ కొనసాగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలోని బాల్టిమోర్‌లో ‘అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (ఆటా) 19వ ద్వైవార్షిక మహాసభలలో భాగంగా ‘మన రాయలసీమ’ పేరిట ‘రాయలసీమ అవగాహన సదస్సు’ జరిగింది. ఆ సదస్సులో అందరి నోటా ఈ అభిప్రాయం బలంగా వ్యక్తమైంది.
ప్రబంధ కవులంతా రాయలసీమ వారే!
దాదాపు నాలుగు దశాబ్దాలుగా అమెరికాలో స్థిరపడ్డ ఇంజనీరింగ్ నిపుణుడు, ‘ఆటా’ వారి త్రైమాసిక పత్రిక ‘అమెరికా భారతి’ సంపాదకుడు ప్రకాశ్ తిమ్మాపురం అధ్యక్షతన ఈ అవగాహన సదస్సు ఆవేదన నిండిన మాటలతో, ఆలోచనా స్ఫోరకంగా సాగింది. ఈ ‘రాయలసీమ అవగాహన సదస్సు’ తాలూకు ఉద్దేశాన్నీ, వర్తమాన పరిస్థితుల్లో దీనికి ఉన్న ప్రత్యేక ప్రాధాన్యాన్నీ ప్రకాశ్ తన మాటల్లో ముందుగా ప్రస్తావించారు. సముచితమైన రాయలసీమ డిమాండ్లకు అందరూ నడుం బిగించాల్సిన అవసరాన్ని పేర్కొన్నారు.
కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద అవార్డు గ్రహీత, సీనియర్ సాహిత్యవేత్త జె.ఎల్. రెడ్డి సదస్సులో ప్రధాన అతిథిగా పాల్గొన్నారు. ఆయన తన ప్రసంగంలో రాయలసీమ ప్రాంత సాహితీ ప్రముఖుల కృషిని ప్రేక్షకులతో విహంగవీక్షణం చేయించారు. కథ, కవిత్వం, నవల, విమర్శ తదితర ప్రక్రియల్లో రాయలసీమ ప్రాంతం నుంచి సాగిన అపూర్వ కృషిని సాధికారికంగా వివరించారు.

సీమ అభివృద్ధికి కట్టుబడ్డ వైఎస్ రాజశేఖరరెడ్డి!
అలాగే, ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ అవధాన కవి, సాహితీవేత్త నరాల రామారెడ్డి ప్రసంగిస్తూ, ప్రబంధ సాహిత్యకవుల్లో తెనాలి రామకృష్ణ లాంటి ఒకరిద్దరు మినహా అల్లసాని పెద్దన లాంటి అనేకులు రాయలసీమ వారేనని గుర్తు చేశారు. ఆయన తన విస్తృత సాహితీ అధ్యయనాన్ని పంచుకుంటూ, అనేక పద్య ఉదాహరణలతో, రాయలసీమ ప్రాంతం గొప్పదనాన్ని గుర్తుచేశారు. ప్రబంధ కవుల నుంచి పుట్టపర్తి నారాయణాచార్యుల వరకు ఎందరెందరో ప్రముఖుల రచనల్లోని ప్రత్యేకతను నరాల రామారెడ్డి వివరించారు.
ఈ ‘మన రాయలసీమ’ సదస్సు కు ప్రధాన సూత్రధారి, సామాజిక పరిశీలకుడు, ‘ఆటా సాహిత్య విభాగం’ సలహాదారు అయిన జయదేవ్ మెట్టుపల్లి మాట్లాడుతూ, రాయలసీమ వెనుకబాటుకు మూలమైన చరిత్రను వివరించారు. చారిత్రక, సామాజిక, రాజకీయ కారణాలను పేర్కొన్నారు. రక్షణ ఒప్పందం కోసం నిజామ్ ప్రభువు రాయలసీమ ప్రాంతాన్ని బ్రిటీషు వారికి ‘సీడెడ్’ (దత్తమండలాలు)గా కట్టబెట్టడం దగ్గర నుంచి 1928లో ‘రాయలసీమ’ అన్న నామకరణం జరగడం మొదలు నేటి దాకా జరిగిన చరిత్రను సంక్షిప్తంగా కళ్ళకు కట్టారు. రాయలసీమ ప్రాంతం నుంచే తెలుగు రాష్ట్రానికి అధిక సంఖ్యలో ముఖ్యమంత్రులు వచ్చినా, రాజకీయ సంఖ్యాబలం కోసం ఇతర ప్రాంతాలపై ఆధారపడక తప్పని పరిస్థితుల్లో ఈ ప్రాంతానికి ఎప్పుడూ అన్యాయం జరుగుతూనే ఉందని గుర్తు చేశారు. ఎంవి రమణారెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి లాంటివారు కొందరు మాత్రమే కడదాకా రాయలసీమ అభివృద్ధి కోసం కట్టుబడ్డారన్నారు.
కొన్ని జిల్లాలకు మరింత అన్యాయం!
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీకి చెందిన విశ్రాంత ఆచార్యులు దేవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితర ప్రముఖులు పంపిన సందేశాల సారాంశాన్ని సదస్సులో వినిపించారు. అమెరికాలో స్థిరపడ్డ కడప వాసి – సాఫ్ట్ వేర్ రంగ నిపుణుడు చరసాల ప్రసాద్ మాట్లాడుతూ, అనేక అంశాల్లో అనాదిగా రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని ఆవేదనాభరితంగా ప్రస్తావించారు. రాయలసీమ ప్రాంతంలోనూ కేటాయింపుల్లో కడప లాంటి జిల్లాలు మరింత వివక్షకు గురయ్యాయని ఆయన అభిప్రాయపడ్డారు. వివిధ చారిత్రక ఆధారాలు, గణాంకాలతో ‘కడప జిల్లా అభివృద్ధి – ఆత్మగౌరవం’ పేరిట రచయిత త్రివిక్రమ్ రాసిన పుస్తకంలోని పలు చర్చనీయాంశాలను ప్రసాద్ స్థూలంగా పరిచయం చేశారు. ఒకప్పటి ముఠా తగాదాలను సాకుగా చూపి, నేటికీ రాయలసీమ ప్రాంతాన్ని ఫ్యాక్షనిజానికి మారుపేరుగా రాజకీయ, సినీరంగాల్లో వేస్తున్న ముద్రను తీవ్రంగా ఖండించారు.

ప్రొద్దుటూరుకు చెందిన సాహితీ ప్రియుడు సాధు గోపాలకృష్ణ మాట్లాడుతూ, రాయలసీమ ప్రాంతాన్ని పారిశ్రామికంగా, ఉపాధి – ఉద్యోగావకాశాల పరంగా మెరుగుపరచడానికి తమ వంతుగా చేస్తున్న కృషిని తెలిపారు. పరిశ్రమల స్థాపనకు ఔత్సాహికులు మరింతగా ముందుకు వస్తే, చెన్నై, బెంగుళూరు లాంటి ప్రాంతాలకు రాయలసీమ నుంచి వలసలు తగ్గి, స్థానికంగా మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
తిరుపతికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి గిరిధర్ కుమార్ కుప్పాల ప్రసంగిస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానం (టి.టి.డి) నుంచి రైల్వేల వరకు తాను పనిచేసిన ప్రాంతాల్లో రాయలసీమకు ఎలా నష్టం వాటిల్లుతోందో తన స్వీయానుభవం నుంచి విశ్లేషించారు. 1980ల మధ్య నుంచి స్థానికేతరులదే టి.టి.డి.లో ప్రాబల్యం కావడంతో, రాయలసీమ స్థానిక పురోగతి, అవసరాలు, ఆకాంక్షలు నిర్లక్ష్యానికి గురయ్యాయని వివరించారు. అలాగే, రాయలసీమ ప్రాంత రైల్వే లైన్లు కొన్ని ఎన్నో దశాబ్దాల ముందే వచ్చినా, అనేక ప్రాంతాలతో పోలిస్తే రాయలసీమకు అన్యాయమే జరిగిందన్నారు. కొద్ది జిల్లాలకే కొత్త రైల్వే జోన్లు ఏర్పడుతున్నాయి కానీ, ఎప్పటి నుంచో ప్రజల డిమాండ్ లో ఉన్న బాలాజీ రైల్వే జోన్ ఇప్పటికీ నెరవేరనే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో పాలకుల మెడలు వండిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) ఉద్యమం తరహాలో సోషల్ మీడియాను ఆసరాగా చేసుకొని, మన వద్ద కూడా మరో రాయలసీమ ఉద్యమం రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. సభికులందరూ రాయలసీమ పురోభివృద్ధి కోసం ఉద్యమించాల్సిన అవసరంపై ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.
కర్నూలు హైకోర్టు కలకు ఇన్నేళ్ళా!
ఇక, హైదరాబాద్ నుంచి ‘ఆటా -2026’ సదస్సుగా ప్రత్యేక సాహితీ అతిథిగా హాజరైన ప్రముఖ జర్నలిస్టు – రచయిత డాక్టర్ రెంటాల జయదేవ మాట్లాడుతూ, రాయలసీమలో నీళ్ళకు కరవైనా కన్నీళ్ళకు కరువు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, పంటల సేద్యం బరువైనా ప్రేమాభిమానాలను పొరుగువారికి పంచడంలో రాయలసీమకు సాటి లేదని తన స్వీయానుభవాలను పంచుకున్నారు. సాహిత్యంలో పుట్టపర్తి, రాళ్ళపల్లి, సంగీతంలో శ్రీపాద పినాకపాణి, సినీ రంగంలో హెచ్ఎం రెడ్డి, బిఎన్ రెడ్డి, నాగిరెడ్డి, కెవి రెడ్డి, నాటక రంగంలో సురభి సంస్థ.. ఇలా రాయలసీమ తెలుగుజాతికి అందించిన రతనాలు అనేకమని సభికులకు గుర్తుచేశారు.
దాదాపు నూరేళ్ళవుతున్నా అలనాటి ‘శ్రీబాగ్ ఒడంబడిక’ (పెద్దమనుషుల ఒప్పందం) వాగ్దానాలు నేటికీ తీరకపోవడం, కనీసం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు లాంటి కష్టం – ఖర్చు పెద్దగా లేని పనులు సైతం పాలకపక్షాలు నెరవేర్చకపోవడం అన్యాయమని జయదేవ నిరసన వ్యక్తం చేశారు. ఘనమైన చరిత్ర, స్థానిక వనరులు ఉన్నప్పటికీ నేటికీ నిర్లక్ష్యం నీడలోనే మిగిలిపోయిన ఉత్తరాంధ్ర, రాయలసీమ లాంటి తోటి తెలుగు ప్రాంతాల న్యాయబద్ధమైన ఉద్యమంలో ఇతర ప్రాంతాల వారు సైతం గళం విప్పి, కదం తొక్కాలని ఆయన పిలుపునిచ్చారు. ఆ రకంగా తెలుగు ప్రాంతాలన్నిటి సర్వతోముఖాభివృద్ధికి అందరూ కలసి కృషి చేద్దామన్నారు.
రాయలసీమ అభివృద్ధికి అవసరమైతే మరో ఉద్యమం చేయాలని వక్తలతో పాటు సభికులందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తం మీద, ‘ఆటా’ వేదికగా, అమెరికా తీరంలో సైతం... రాయలసీమ అభివృద్ధి పట్ల ఆలోచన రేకెత్తించడంలో ఈ ‘మన రాయలసీమ’ అవగాహన సదస్సు సఫలీకృతమైంది. ఆలోచన నుంచి ఆచరణకు అడుగులు వేయడమే ఇక మిగిలింది!
- అమెరికా నుంచి రెంటాల జయదేవ


