బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో రక్తం నల్లరంగులో ఉండేది. హీరోకో, హీరోయిన్‌కో నుదుటిన దెబ్బ తిగిలి రక్తం కారితే ‘కెవ్వు’మని కేక వేసి కళ్లు తిరిగి పడిపోయే పాత్ర ఒక్కటైనా ఉండేది. పాత సినిమాల ఫైటింగులన్నీ రక్తం కానరాని తుపాకీ మోతలే. ఢామ్మంటే ఒకడు పడేవాడు. ఢమామంటే మరొకడు. కత్తి యుద్ధాలన్నీ చుక్క నెత్తురు కారని కమ్మని కాలక్షేపాలే. కలర్ సినిమాలు వచ్చాక రక్తం రంగు తెర మీద ఎర్రగా కనిపించడం మొదలయ్యింది. అది కూడా ఆస్పత్రిలో బెడ్ పక్కన సీసాలో వేళ్లాడుతూ. హీరో తల్లికో, హీరోయిన్ తండ్రికో రక్తం కావాల్సి వస్తే ప్రేక్షకులు అప్పుడు రక్తం చూసేవారు.
చిన్నప్పుడు తప్పిపోయిన కొడుకు పెద్దయ్యి తానెవరో తెలియకనే తల్లికి రక్తం ఇవ్వడమనే సన్నివేశం మన సినిమాకు మాత్రమే సాధ్యమైన ఫార్ములా ఎమోషన్. దీనిని దర్శకుడు మన్‌మోహన్ దేశాయ్ సైన్స్‌కు అతీతంగా ఎత్తులకు చేర్చాడు. ‘అమర్ అక్బర్ ఆంథోని’లో హాస్పిటల్‌లో ఉన్న తల్లికి ఆమె తప్పిపోయిన ముగ్గురు కుమారులు ఒకేసారి రక్తం ఇస్తారు మూడు విడివిడి ట్యూబుల నుంచి. ఎమోషన్ పండి గల్లాపెట్టె నిండింది. ఇలాంటి అతి తార్కిక దర్శకుల మధ్యే, రక్తం అమ్మి రూమ్‌రెంట్ కట్టక తప్పని 1980ల నిరుద్యోలను చూపిన వేజెళ్ల సత్యనారాయణ వంటి గతితార్కిక దర్శకులు కూడా ఉండేవారు.
మన సినిమాల్లో చాలా రోజులకుగానీ రక్తం పౌరుషానికి గుర్తుగా మారలేదు. హీరో చాలాసేపు మామాలుగా ఫైట్ చేశాక ఒక దెబ్బ పడి అతని పెదవి చిట్లుతుంది. అప్పుడు హీరో పాజ్ ఇచ్చి చిట్లిన పెదవి నుంచి కారే రక్తాన్ని చూపుడు వేలితో చూసుకుంటాడు. అలా చూశాడంటే హీరో చెలరేగిపోతాడని ప్రేక్షకులు ఈలల మోత మోగించేసేవారు. ఈ ధోరణి సాగుతుండగానే రక్తం సత్తా ఏమిటో ‘ప్రేమ్‌నగర్’లో వాణిశ్రీ చాలా గట్టిగా తెలుగు ప్రేక్షకులకు చెప్పారు. తాగుడుకు బానిసైన అక్కినేని ఎదుట, తన నుదుటి నుంచి కారిన రక్తాన్ని గ్లాసులో పట్టి, పెట్టి ‘ఊ.. తాగండి’ అంటే అక్కినేనికే కాదు ప్రేక్షకులకూ జుగుప్స కలుగుతుంది. అవును... రక్తమంటే జుగుప్స. భీతి. బీభత్సం. ఏవగింపు. రోత. ఏహ్యత. అసహ్యం.
ఎన్ని మాటలనుకున్నా మన కమర్షియిల్ దర్శకులు మెచ్చదగినవారు. ఉత్తుత్తి ఫైటింగులన్నీ ఉత్తుత్తివే అన్నట్టు చూపేవారు. హీరోలు కెమెరా ముందు నిలబడి కెమెరాపై ముష్టిఘాతాలు విసిరి సరిపెట్టుకునేవారు. అయితే నిజంగా రక్తం వచ్చేలా ఒక హత్య చేస్తే ఎలా ఉంటుందో మొదటిసారి రామ్‌గోపాల్ వర్మ తెర మీద ఉలికిపాటుతో చూపించారు. ‘శివ’ సినిమాలో రక్తం పైకి కనిపించకపోయినా కథలో, ప్రేక్షకుడి మానసిక ఆవరణలో అంతటా వ్యాపించి ఉంటుంది. రక్తంతో చెలగాటం ప్రాణాంతకం అని ఈ సినిమా చూసిన తెలివైనవారు గ్రహిస్తారు.
అయితే దేశమంతా ఏ భాషకు ఆ భాష ఉన్నా అందరికీ అర్థమయ్యే భాష ‘రక్తభాష’ అని దర్శకులు మెల్లగా కనిపెట్టారు. సినిమాను పాన్ ఇండియా చేస్తూ హీరోకొక ఆయుధం చేతికిచ్చారు. ఒక సినిమా ముగిసేలోపు కనీసం వంద మందిని ఊచకోత కోయకపోతే అతను హీరో కాదు ఆ సినిమా పాన్ సుపారీ కాదు అని బాక్సాఫీసు సాక్షిగా తేల్చారు. ప్రతి సినిమా విడుదల సమయంలో హీరో చేతికి ఉన్న సరికొత్త ఆయుధాన్ని చూస్తే ప్రేక్షకులకు ఉద్రేకం వచ్చి బుక్ మై షో వైపు వేళ్ల కదలికలు సాగుతున్నాయి. నెత్తురు అలవాటు చేశారు. నెత్తురు చూడటం అలవాటుగా మారింది. నెత్తురును చూస్తే భీతి, ఏహ్యత, అసహ్యం కలగడంలేదు. నెత్తురు ఇప్పుడు ప్రేక్షకుడి పాలిట డోపమైన్.
యుద్ధంలో చిట్టచివరి నైచ్యం స్త్రీలను, పిల్లలను, రోగులను చంపడం. యుద్ధం వస్తే ఇప్పుడు మొదట వాళ్లనే చంపడాన్ని ‘నార్మలైజ్’ చేశారు. అత్యంత దారుణాలన్నీ ‘సాధారణ విషయాలు’గా మార్చే కొద్దీ, మారే కొద్దీ ఏమవుతుంది? ప్రతిస్పందన మాయమవుతుంది. నిరసన, ప్రతిఘటన, తిరుగుబాటు... అన్నీ మనకెందుకులే అని మంచినీరు తాగి పడుకుంటాయి. మనిషిలోని మృగ నిష్పత్తి పెరుగుతుంది. తెర మీద ఎంత రక్తం కనపడితే అంత హిట్ చేస్తున్న యువత ఏ వెలుతురుకు పురోగమిస్తుందో ఎవరైనా ఆలోచిస్తున్నారా? పిల్లల వేలు తెగితే తల్లడిల్లే తల్లిదండ్రులు తెర మీద డ్రమ్ముల కొద్దీ నెత్తురు చూస్తున్న పిల్లల గూర్చి ఏమనుకుంటున్నారో! ఇలాంటివి తీస్తున్న దర్శకుల ఇంటి ముందు రోజూ లోటాడు నెత్తురక్కర్లేదు ఎర్రరంగు ప్రత్యక్షమైతే రంజుగా ఉంటుందంటారా? రక్తం ప్రచండ శక్తి. అందుకే ప్రకృతి దానిని ఒంట్లో దాచి ఉంచింది. అట్లాగే ఉండనివ్వండి.


