పశ్చిమాసియా మళ్లీ మొదటికొచ్చింది. అమెరికా–ఇరాన్‌ల మధ్య కుదిరిన రెండు వారాల అరకొర కాల్పుల విరమణకు ఆదినుంచీ అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. అది కాస్తా మంగళవారం అర్ధరాత్రి ముగియబోతుండగా, ఇరుపక్షాల మధ్యా పాకిస్తాన్‌లో జరగాల్సిన రెండో విడత చర్చలకు అమెరికా దుందుడుకు చర్యవల్ల గండిపడింది. అరేబియా సముద్రం వైపునుంచి హార్మూజ్ జలసంధిలో ప్రవేశించబోతున్న ఇరాన్ రవాణా నౌకపై సోమవారం వేకువజామున దాడిచేసి, ధ్వంసం చేసి చర్చల విషయంలో తనకు చిత్తశుద్ధి లేదని ఆ దేశం మరోసారి నిరూపించుకుంది. కనుక రెండో విడత చర్చలకు పోదల్చుకోలేదని ఇరాన్ ప్రకటించటంలో వింతేమీ లేదు. శత్రుత్వంతో రగిలిపోయే వైరిపక్షాలమధ్య ఏకాభిప్రాయ సాధన అంత సులభం కాదు.
ఇరుపక్షాలూ నిజాయితీగా వ్యవహరిస్తే ఏదోమేరకు అపోహలు తొలగే అవకాశం ఉంటుంది. కానీ ఒప్పందం కుదిరిన మరుక్షణంనుంచీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పొంతనలేని ప్రకటనలు చేస్తూ ఇరాన్‌ను రెచ్చగొట్టారు. మరోపక్క ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నాయకత్వంలో రెండో విడత చర్చల కోసం పాకిస్తాన్‌కు ప్రతినిధి బృందాన్ని పంపారు. విట్‌కాఫ్, తన అల్లుడు జేడీ కుష్నెర్‌లాంటి రియలెస్టేట్ ఏజెంట్లున్న ఈ ప్రతినిధి బృందానికి కాల్పుల విరమణ గురించి ఏం అవగాహన ఉంటుంది? అసలు హార్మూజ్ జలసంధిని ఇకపై తామే పర్యవేక్షిస్తామనీ, రాకపోకలకు ఎవరినీ అనుమతించబోమనీ గతవారం ట్రంప్ ప్రకటించినప్పుడే ఆ ఒప్పందం కాస్తా అర్థరహితంగా మారింది.
ఇరాన్‌ను చుట్టుముట్టి దిగ్బంధిస్తే, దాని ఆర్థిక మూలాలను దెబ్బతీస్తే పాదాక్రాంత మవుతుందని ఇప్పటికీ ట్రంప్ కలలుగంటున్నారు. నష్టపోకతప్పని స్థితి ఏర్పడితే అది తనతో ఆగకుండా ప్రపంచం మొత్తానికి అంటుకునేలా ఇరాన్ ప్రత్యామ్నాయాన్ని సిద్ధపరిచే ఉంచింది. తాజా పరిణామాలతో సోమవారం ముడి చమురు ధర ఒక్కసారిగా 7 శాతం పెరిగి బ్యారెల్ చమురు 89 డాలర్లకు చేరుకోవటం జరగబోయేదేమిటో సూచిస్తోంది. గత నెల్లాళ్ల చమురు ధరలు గమనిస్తే ఇప్పటికీ ఆ ధరలు దాదాపు 10.4 శాతంమేర తక్కువగానే ఉన్నాయి. కానీ నిరుటితో పోల్చిచూస్తే 41.01 శాతం అధికం! అసలు గతవారం ట్రంప్ ప్రకటన తర్వాత ఇరాన్ సంయమనం పాటించకపోతే ఈపాటికే ఆ ప్రాంతం ఘర్షణలతో అట్టుడికేది.
ఎక్కడో వేలమైళ్ల దూరంనుంచి వచ్చి, నావికా దళాలను మోహరించి దిగ్బంధిస్తామని హెచ్చరిస్తే ఏ దేశమైనా సహించగలదా? సమర్థవంతంగా వ్యవహరించగలిగితేనే మధ్యవర్తి పాత్ర పోషించాలని పాకిస్తాన్‌కు ఈ పరిణామాల తర్వాతైనా అర్థమైవుండాలి. మధ్యవర్తిత్వమంటే పోస్టుమాన్ పని కాదు. భిన్న వాదనల్ని వినిపిస్తున్న ఇరుపక్షాలూ వాస్తవ పరిస్థితులేమిటో గ్రహించేలా చేసి, తన తర్కంతో ఒప్పందానికి ఒప్పించే నేర్పుండాలి. వెనకుండి ప్రోత్సహించిన చైనా ఏం చెప్పిందోగానీ... తనకు హఠాత్తుగా దక్కిన ఈ నడమంత్రపు కీర్తితో పాకిస్తాన్ అన్నీ మరిచినట్టు కనిపిస్తోంది.
తమ వద్ద యురేనియం ఉండాలో లేదో నిర్ణయించటానికి అమెరికా ఎవరన్న ఇరాన్ తాజా ప్రశ్నకు ట్రంప్ ఏం జవాబివ్వగలరు? అమెరికా దగ్గర దండిగా అణ్వాయుధా లున్నాయి. దశాబ్దాల క్రితమే తన మిత్రదేశం ఇజ్రాయెల్‌కు సైతం వాటిని చేరేసింది. అది అమెరికా అవలక్షణాలను పుణికిపుచ్చుకుని పశ్చిమాసియా దేశాలను బెదిరిస్తూ, అకారణంగా దాడులకు పాల్పడుతూ ఈ ప్రాంత శాంతికి విఘాతం కలిగిస్తోంది.
ఇలాంటి స్థితిలో తన ఆత్మరక్షణకు ఇరాన్ సైతం అదే బాట పడితే ఆశ్చర్యమేముంది? జరుగుతున్న పరిణామాలు గమనిస్తే, కాల్పుల విరమణ పేరిట మాయచేసి ఇరాన్‌ను లొంగదీసుకోవాలన్నదే ట్రంప్ ఆంతర్యంగా కనబడుతోంది. ఇప్పటికిప్పుడు యుద్ధ విరమణ ప్రకటించినా అమెరికాలో ఇప్పటికే 3.3 శాతానికి చేరిన ద్రవ్యోల్బణం కనీసం మరో ఏడాది వరకూ దిగిరాదు. 38 సభ్యదేశాలున్న ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ(ఓఈసీడీ) పరిధిలో ద్రవ్యోల్బణం 4 శాతం దాటొచ్చన్న అంచనాలున్నాయి. కనుక ఇప్పటికైనా అమెరికా తన వైఖరి మార్చుకోవాలి. ఓటమిని అంగీకరించి గౌరవప్రదంగా తప్పుకోవడం తప్ప ప్రత్యామ్నాయం లేదని గ్రహించాలి.


