చార్లీ చాప్లిన్ అద్భుత దృశ్యకావ్యాల్లో ఒకటైన ‘గోల్డ్ రష్’ నిరుడు శతవసంతాలు పూర్తిచేసుకుంది. 1890ల్లో కెనడాలోని క్లోన్‌డైక్ ప్రాంతంలో బంగారం గనులున్నాయని వెల్లడై ప్రపంచం నలుమూలలనుంచీ వేలాదిమంది జనం అక్కడికి పరుగులు తీయడం, పోటీపడటం కథాంశం. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కృత్రిమ మేధ(ఏఐ)కి సంబంధించిన డేటా సెంటర్లలో పెట్టుబడుల్ని ఆకర్షించటానికి అలాగే పరుగులు తీస్తున్నాయి. నిరుడు అక్టోబర్‌లో ప్రపంచ ఆర్థిక ఫోరం విడుదల చేసిన విశ్లేషణ డేటా సెంటర్ల సామర్థ్యం మరో నాలుగేళ్లలోనే మూడు రెట్లు పెరుగుతుందని అంచనా వేసింది. అదే సమయంలో తీవ్ర ఉష్ణోగ్రతలు, కరువుకాటకలు, ఇతర వాతావరణ దుష్ఫలితాల కారణంగా డేటా సెంటర్ల వార్షిక ఖర్చులు 2035కు 8,100 కోట్ల డాలర్లనుంచి 2065 నాటికి 16,800 కోట్ల డాలర్లకు పెరుగుతాయని అంచనా వేసింది. ఇప్పటికే క్లౌడ్ కంప్యూటింగ్ నిర్వహించటానికి... ఓటీటీలు, యూట్యూబ్‌వంటి వాటికోసం లైబ్రరీల నిర్వహణకూ, ఇతరేతర వినియోగానికీ డేటా సెంటర్లున్నాయి. ఏఐ రాకతో ఇవి మరింతగా పెరుగుతున్నాయి.
డేటా సెంటర్ల విస్తరణతోపాటే వాటికి సంబంధించిన అవగాహన మొదలైంది. వాటివల్ల కలిగే దుష్పరిణామాల గురించి ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తోంది. ఆన్‌లైన్ సెర్చ్‌లతో పోలిస్తే ఏఐ ఆధారిత సెర్చ్‌లు పది రెట్లు అధిక విద్యుత్‌ను తీసుకుంటున్నా యని గణాంకాలు తేల్చాయి. ఈమధ్య విడుదలైన ఐక్యరాజ్యసమితికి చెందిన యూనివర్సిటీ అధ్యయన నివేదిక డేటా సెంటర్లను చల్లబరచడానికి బిలియన్లకొద్దీ లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు ఆవిరైపోతున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ డేటా సెంటర్ల వల్ల తాగునీటి హక్కులకూ, వ్యవసాయానికీ తీవ్ర విఘాతం కలుగుతోందని హెచ్చరించింది. వీటిని అనుమతించే ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో పునరుత్పాదక ఇంధన వనరు లున్న ప్రాంతాలనే ఎంచుకునేలా చూడాలని సూచించింది. వినియోగిస్తున్న నీరు ఆవిరయ్యే ప్రస్తుత విధానానికి బదులు నీటి అవసరం లేని ఎయిర్ కూలింగ్, లిక్విడ్ ఇమ్మర్షన్ కూలింగ్‌వైపు మారేలా డేటా సెంటర్లపై ఒత్తిడి తేవాలని ప్రభుత్వాలకు సలహా ఇచ్చింది. డేటా సెంటర్లు తాము వినియోగించే నీరు, విద్యుత్ ఎంతో... విడుదలయ్యే కర్బన ఉద్గారాల పరిమాణం ఎంతో తెలిపే డేటాను అందరికీ అందుబాటులో ఉంచేలా నిబంధనలు రూపొందించాలని తెలిపింది.
డేటా సెంటర్లపై అక్కడక్కడా ఆందోళనలు పెరుగుతున్నాయి. ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో ఈ సెంటర్లు పెరగటాన్ని నిరసిస్తూ ఉద్యమాలు జరగటంతో కొత్తవాటిపై కఠిన మైన ఆంక్షలు విధించారు. నెదర్లాండ్స్‌లో కూడా రైతులు, పర్యావరణవేత్తలు ఆందోళ నలు చేశారు. దాంతో హైపర్‌స్కిల్ డేటాసెంటర్ల నిర్మాణాలను ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధించింది. సింగపూర్‌లో పర్యావరణహిత సెంటర్లకు పరిమితమైన అనుమతు లిస్తున్నారు. చిలీలో డేటా సెంటర్ ఏర్పాటుపై జనం తిరగబడటంతో గూగుల్ సంస్థ గాలితో చల్లబరిచే సాంకేతికత దిశగా ప్రాజెక్టును డిజైన్ చేసుకుంది.
ఏడాదిలో 365 రోజులూ వేలాది సర్వర్ రాక్‌లూ, డిజిటల్ డేటాను భద్రపరిచే హార్డ్ డ్రైవ్‌లూ, నెట్‌వర్కింగ్ పరికరాలూ, లక్షలసంఖ్యలో యూపీఎస్‌లు పనిచేస్తుండటంవల్ల వాటిని చల్లబరచటానికి నిరంతరాయంగా నీరు అవసరమవుతుంది. భారీగా విద్యుత్ కావలసివస్తుంది. ఇక ఆ సెంటర్లలోవాడే భారీ కూలింగ్ ఫ్యాన్లు , ఇండస్ట్రియల్ ఏసీల వల్ల ఒకరకమైన ధ్వని తప్పదు. పగలు ఇతర చప్పుళ్లతో ఇది కలిసిపోయినా, రాత్రివేళల్లో మూడు నాలుగు కిలోమీటర్ల మేర ఈ ధ్వని వినబడుతుంది. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో, అమెరికాలోని వర్జీనియాలో కేవలం ఈ కారణం వల్లే స్థానికులు కోర్టులకెక్కారు.
ప్రజల ఒత్తిళ్లతో ఈమధ్య కాలిఫోర్నియాలోని ఒక మున్సిపాలిటీ కొత్త డేటా సెంటర్లపై నిషేధం విధించింది. వీటన్నిటి నేపథ్యంలో నీటి అవసరం పెద్దగా లేని సాంకేతికతలు వస్తున్నాయి. ఏఐ ఆధారిత సాంకేతికత ద్వారా ఒక్క చుక్క నీరు కూడా అదనంగా వినియోగించకుండా కట్టడి చేస్తున్నారు. ప్రభుత్వాలు పారదర్శకంగా వ్యవహరిస్తే, ఆ సెంటర్లు వినియోగించే పర్యావరణహిత సాంకేతికతల సమాచారాన్నీ, వాటి ఉద్గారాల పరిమాణాన్నీ ప్రజలకూ, పర్యావరణవేత్తలకూ అందుబాటులో ఉంచితే ప్రజల్లో ఉండే ఆందోళన తగ్గుతుంది.


