గత కొన్నేళ్లుగా ప్రభ కోల్పోయిన వెస్టిండీస్ పేస్ బౌలింగ్ విభాగానికి మూలాధారంగా నిలబడిన 38 కెమార్ రోచ్ కెరీర్ చరమాంకంలో ఓ అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్‌ల్లో 300 వికెట్ల సాధించిన ఐదో విండీస్ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. తాజాగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.
రెండో ఇన్నింగ్స్‌లో అసిత ఫెర్నాండోను ఇన్‌స్వింగర్‌తో బౌల్డ్ చేసి తన 300వ టెస్ట్ వికెట్‌ను నమోదు చేశాడు. రోచ్‌కు ముందు వాల్ష్ (519), ఆంబ్రోస్ (405), మాల్కమ్ మార్షల్ (376), లాన్స్ గిబ్స్ (309) మాత్రమే విండీస్ తరఫున ట్రిపుల్ సెంచరీ వికెట్లు సాధించారు.
రోచ్ సహా పేస్ విభాగమంతా సత్తా చాటడంతో శ్రీలంకపై వెస్టిండీస్ ఇన్నింగ్స్ 217 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. రోచ్ (11-0-51-4), జేడన్ సీల్స్ (10.2-3-14-3), షమార్ జోసఫ్ (5-0-19-2), అల్జరీ జోసఫ్ (5-1-11-1) ధాటికి లంక జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 101 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. లంక బ్యాటరల్లో దినేశ్ చండీమల్ (43), సోనల్ దినుష (12 నాటౌట్) మినహా ఎవ్వరూ కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు.
అంతకుముందు అమిర్ జాంగూ (233) డబుల్ సెంచరీతో, కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (194) భారీ శతకంతో కదంతొక్కడంతో విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 626 పరుగుల భారీ స్కోర్ చేసింది. జాంగూ-ఛేజ్ ఆరో వికెట్‌కు రికార్డు స్థాయిలో 401 పరుగులు జోడించారు. లంక బౌలర్లలో మిలన్ ప్రియానాథ్ 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. అషిత ఫెర్నాండో, సోనల్ దినుష తలో 2 వికెట్లు తీశారు.
దీనికి ముందు ధనుంజయ డిసిల్వ (120) సెంచరీతో కదంతొక్కడంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులు చేసింది. దినేశ్ చండీమల్ (54) అర్ద సెంచరీతో రాణించాడు. దినుష 43 పరుగులతో పర్వాలేదనిపించాడు. విండీస్ బౌలర్లలో గ్రీవ్స్ 3, రోచ్, అల్జరీ జోసఫ్, షమార్ జోసఫ్ తలో 2, సీల్స్ ఓ వికెట్ తీశారు.
కాగా, ఈ మ్యాచ్ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగింది. రెండో టెస్ట్ అంటిగ్వా వేదికగానే జులై 3న ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌ల కోసం శ్రీలంక వెస్టిండీస్‌లో పర్యటిస్తుంది. టెస్ట్‌లకు ముందు 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరిగాయి. వన్డే సిరీస్‌ను శ్రీలంక (1-0), టీ20 సిరీస్‌ను వెస్టిండీస్ (2-1) చేజిక్కించుకున్నాయి.


