తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి అంచనాలకూ దొరకని రీతిలో ప్రారంభమై రెండేళ్ల పాటు దాన్నే కొనసాగించి చివరకు అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని రీతిలో అత్యధిక స్థానాలున్న పార్టీగా ఆవిర్భవించిన టీవీకే ఏలుబడి మొదలైంది. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 144 మంది ఓటేయగా, వ్యతిరేకంగా 22 మంది, అయిదుగురు తటస్థంగా ఉండి పోయారు. డీఎంకే, డీఎండీకే, పీఎంకే, బీజేపీలు వాకౌట్ చేశాయి. సభ్యుల ప్రమాణ స్వీకారం మొదలుకొని సమావేశం పొడవునా విజయ్ వ్యవహరించిన తీరు, విశ్వాస తీర్మానంపై చర్చకు జవాబిస్తూ చేసిన ప్రసంగం విమర్శలకు తావీయకుండా ముగియటం గమనించదగ్గది. తమ ప్రభుత్వం సెక్యులర్ విధానాలకు కట్టుబడి ఉంటుందని ఆయన చెప్పటం మద్దతుగా నిలిచిన వామపక్షాలకూ, వీసీకేకూ ఊరటనిచ్చివుంటుంది. విజయ్ అణుకువతో, ఆవేశానికి తావీయని రీతిలో ఉంటూనే చేయదల్చుకున్నది చేస్తారని ఈ సమావేశం రుజువుచేసింది. వ్యక్తిగత జ్యోతిష్కుడు రికీ రాధన్ పండిట్ వెట్రివేల్‌ను ఓఎస్‌డీగా నియమించటాన్ని మిత్రపక్షం వీసీకే విశ్వాస తీర్మానం సమయంలో నిలదీసి నప్పుడు విజయ్ భేషజానికి పోకుండా వెంటనే ఆ నియామకాన్ని పునస్సమీక్షిస్తానని ప్రకటించారు. ఆ వెంటనే దాన్ని రద్దుచేసినట్టు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ప్రార్థనాస్థలాలు, విద్యాసంస్థలు, బస్టాండ్లు వగైరాలకు 50 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఉండొచ్చన్న నిబంధనను 500 మీటర్లకు సవరించటం, అది వెంటనే అమల్లో కొచ్చి పదులకొద్దీ దుకాణాలు మూతబడటం కూడా జనం మెచ్చే చర్య.
విజయ్ రాక ఇప్పటికే ప్రధాన కూటములు, పార్టీల్లో ఊహించని ప్రకంపనలకు దారి తీసింది. దాదాపు ఆరు దశాబ్దాల చరిత్రగల ద్రవిడ పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకేలు జనం ఆదరణ కరవై దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. ఎన్నో సంక్షోభాల్ని తట్టుకుని నిలబడ్డ డీఎంకే–కాంగ్రెస్ కూటమి చెల్లాచెదురైంది. అందలం కోసం ఆత్రపడి కాంగ్రెస్ డీఎంకే చెలిమిని వదులుకు పోయిందిగానీ సీపీఐ, సీపీఎం, వీసీకే వంటి పార్టీలు అదే కూటమిలో కొనసాగుతూనే విజయ్‌కి మద్దతివ్వక తప్పని స్థితికి చేరుకున్నాయి. అన్నాడీఎంకే చీలి ఆ పార్టీకి చెందిన 47 మంది ఎమ్మెల్యేల్లో 25 మంది మాజీ మంత్రి షణ్ముగం ఆధ్వర్యంలో పార్టీ నాయకుడు, మాజీ సీఎం పళనిస్వామికి షాకిచ్చారు. దాంతో టీవీకేకు చిన్న పార్టీల అవసరం నిజానికి ఇప్పటికే తీరిపోయింది. ఎవరిది అసలైన అన్నాడీఎంకే అనే అంశం తేలేసరికి చాలా సమయం పడుతుంది. ఈ క్రమంలో ఎక్కడా టీవీకే లేదా వ్యక్తిగతంగా విజయ్ ఆరోపణలు ఎదుర్కొనలేదు. ఎవరూ ఎవరితోనూ మాట్లాడకుండానే, గట్టి హామీలు ఇవ్వకుండానే అన్నాడీఎంకే చీలిపోయిందంటే ఎవరూ నమ్మరు. కానీ అదెక్కడా ప్రచారంలోకి రాకపోవటం విజయ్ వ్యూహచతురతకు నిదర్శనం.
ద్రవిడ పార్టీలను ఎలాగైనా బలహీనపరచాలని మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మొదలుకొని ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ వరకూ చేయని ప్రయత్నమంటూ లేదు. కాంగ్రెస్, బీజేపీలతో అవసరార్థం పొత్తు కుదుర్చుకుంటూనే వాటిని జనానికి చేరువ కానీయకుండా చేయటంలో అన్నాడీఎంకే, డీఎంకేలు ఇన్నాళ్లూ విజయం సాధించాయి. కానీ పార్టీకి ద్రవిడ నామం లేకుండా వచ్చిన విజయ్ సునాయాసంగా ఆ రెండు పక్షాలనూ మట్టికరిపించారు. అలాగని పెరియార్ రామస్వామి వంటివారిని ఉపేక్షించ కుండా నివాళులర్పించారు. ఆయన ఒకరకంగా రాష్ట్ర రాజకీయాల్లో మూడోపక్షానికి అవకాశం ఉన్నదని నిరూపించారు.
విజయ్ సినిమా ఇతివృత్తాలు కథానాయకుడు తనకెదురయ్యే అవరోధాలను ఎదుర్కొనటం అనే అంశం చుట్టూ తిరుగుతాయి. చివరగా హీరో విజయం సాధించటంతో అవి ముగుస్తాయి. గత వారం రోజుల పరిణామాలు సైతం అదే ఒరవడిలో వెళ్లాయి. నాటకీయత లేకుండా సాధ్యమైనంత తక్కువ మాట్లాడటం, చేయదల్చుకున్నది తక్షణం చేయటం ఆయనలో కనబడే ప్రత్యేక లక్షణం. దీన్నే కొనసాగిస్తే, ప్రజల అభీష్టాన్ని నెరవేర్చే నిర్ణయాలు తీసుకుంటే ఎన్నికల్లో కొట్టొచ్చినట్టు కనబడిన జనాకర్షణ కాస్తా త్వరలోనే దృఢమైన పునాదిగా మారి, రాష్ట్ర రాజకీయాల్లో విజయ్ తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు దోహదపడుతుంది.


