దశాబ్దకాలంగా ఆర్థిక, వాణిజ్య, సాంకేతిక, ఇంధన రంగాల్లో పరస్పరం తలపడుతూ, వాటితోపాటే ఒకదానిపై మరొకటి అవిశ్వాసాన్ని దండిగా పెంచుకున్న రెండు అగ్ర రాజ్యాలు చర్చలకు సిద్ధపడ్డాయంటే ప్రపంచం చాలా ఆశిస్తుంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బుధవారం బీజింగ్ చేరుకున్నప్పుడు ఆయనకు లభించిన స్వాగత సత్కారాలు గమనించినా, శిఖరాగ్ర సమావేశం జరిగిన గురు, శుక్రవారాల్లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌పై ఆయన కురిపించిన ప్రశంసలు చూసినా అంతా సవ్యంగా ముగిసిందని అనిపిస్తుంది. ట్రంప్‌తో వచ్చిన ప్రతినిధి బృందం సామాన్యమైనది కాదు.
భిన్నరంగాల్లో ప్రపంచాన్నేలుతున్న దిగ్గజ సంస్థల చీఫ్‌లు 16 మంది ఆ బృందంలో ఉన్నారు. టెస్లా, స్పేస్ ఎక్స్‌ల సీఈఓ ఎలాన్ మస్క్, యాపిల్ చీఫ్ టిమ్ కుక్‌లతోపాటు ఎన్‌విడియా, క్వాల్‌కామ్, బ్లాక్‌రాక్, గోల్డ్‌మాన్ శాక్స్, బోయింగ్, మెటా సంస్థల సీఈఓలు వారిలో కొందరు. చైనాతో అద్భుతమైన ఒప్పందాలు కుదిరాయనీ, అవి ఇరు దేశాలకూ ఎంతో గొప్పవనీ ట్రంప్ ప్రకటించినా ఆ ఒప్పందాల వైనమేమిటో ఎవరికీ తెలియదు.
బోయింగ్ సంస్థకు చెందిన 200 జెట్ విమానాలు వెంటనే, భవిష్యత్తులో మరో 750 కొనడానికి చైనా అంగీకరించిందనీ... అలాగే వందలకోట్ల డాలర్ల విలువైన సోయాబీన్స్ కొనుగోలు చేయడానికి కూడా ఒప్పుకున్నదనీ ట్రంప్ చివరిలో వివరించారు. కానీ అందుకు సంబంధించి ఎలాంటి ప్రకటనలూ రాలేదు. లిఖితపూర్వక ఒప్పందాలు కుదిరిన దాఖలా లేదు. ప్రాథమిక చర్చలవరకూ జరిగి ఉంటాయన్నది దౌత్యరంగ నిపుణుల అభిప్రాయం.
ఇరు దేశాలమధ్యా సాగిన సుంకాల యుద్ధం సామాన్యమైనది కాదు. ట్రంప్ సుంకాలు ప్రకటించిన ప్పుడల్లా చైనా దీటుగా స్పందించి ప్రతీకార సుంకాలు విధిస్తూ పోయింది. అరుదైన ఖనిజాల ఎగుమతుల్ని చైనా నిలిపేయటంతో అమెరికా విలవిల్లా డింది. ఇక కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో ఆధిపత్యం కోసం రెండూ హోరాహోరీ పోటీ పడుతున్నాయి. ఎన్‌విడియా అత్యాధునిక చిప్‌లు కావాలని చైనా కోరుతుండగా భద్రతా కారణాల రీత్యా కుదరదన్నది అమెరికా వాదన. బహుశా చైనా ఆశలు ఈడేరకపోవటంవల్ల... కొన్ని అంశాల్లో పట్టు సడలించటానికి అమెరికా నిరాకరించటంవల్ల ఒప్పందాలపై ప్రాథమిక చర్చలే సాగాయని అనుకోవాలి. కనీసం వచ్చే సెప్టెంబర్‌లో షీ అమెరికా పర్యటన నాటికైనా స్పష్టత వస్తే మంచిదే.
ప్రపంచం మునుపటి తీరుగా లేదని మాత్రం ట్రంప్‌కు అర్థమై ఉంటుంది. ఎందుకంటే తైవాన్ విషయంలో తమకంటూ ఒక ‘రెడ్‌లైన్’ ఉన్నదని షీ జిన్‌పింగ్ నిర్మొహ మాటంగా చెప్పారని మీడియా అంటున్నది. అయితే తైవాన్‌పై గత వైఖరే కొనసాగుతుందని ట్రంప్‌తో వచ్చిన అమెరికా విదేశాంగమంత్రి మార్కో రుబియో చెప్పటం మినహా మరేదీ బయటకు రాలేదు. తమ సొంతమని చైనా చెబుతున్న తైవాన్‌ను స్వతంత్ర, స్వయంపాలిత, ప్రజాస్వామిక దేశంగా మనుగడ సాగించనీయాలన్నది అమెరికా వాదన.
1979 నుంచి దానితో సంబంధాలు నెరపుతున్నా అవన్నీ ‘అనధికారమైనవి’. కానీ తైవాన్‌కు ఆయుధ విక్రయం జరపాలని ఇటీవల అమెరికా అనుకోవటాన్ని చైనా తీవ్రంగా పరిగణిస్తోంది. అందుకే ఈ ‘రెడ్‌లైన్’ హెచ్చరిక. ఇక ఇరాన్ యుద్ధం, హార్మూజ్ జలసంధివద్ద ఉద్రిక్తతలపైనా ఇరు దేశాలూ ఒకే అభిప్రాయంతో ఉన్నట్టు పైకి అంటున్నా వాటిపైనా స్పష్టత లేదు. ఈ పర్యటన తర్వాత హార్మూజ్ వద్ద సామరస్యత ఏర్పడు తుందేమో చూడాలి.
దౌత్య పరిభాషలో మర్యాదపూర్వకమైన పదాలు చాలా ఉంటాయి. అందులో రెండు దేశాలమధ్యా కుదిరిందని చెబుతున్న విజన్ కొత్తది. ‘నిర్మాణాత్మక వ్యూహాత్మక స్థిరత్వం’ అనే ఈ విజన్ అర్థం ‘పూర్తిగా స్నేహితులం కాలేకపోయినా, శత్రువులుగా మారి యుద్ధా నికి దిగొద్దు’ అన్నదే. సారాంశంలో పూర్వపు సోవియెట్ అధినేత కృశ్చేవ్ బోధించిన ‘శాంతియుత పోటీ’ వంటిది. నిజానికి ట్రంప్ పర్యటన ఆంతర్యం ఇదే. తమతో సరి సమాన స్థాయికి ఎదిగిన చైనాతో ఇరాన్, తైవాన్ ల విషయంలో స్పర్థ రాకూడదని ఆయన కోరుకుంటున్నారు. ఆ పరిమితుల్లో చూస్తే ట్రంప్ పర్యటన విజయవంతమైందను కోవాలి. కానీ ట్రంప్ ఏలుబడిలో అమెరికా ఏ మేరకు ఒదిగి ఉంటుంది... చైనా ఏ స్థాయి వరకూ తగ్గివున్నట్టు కనబడుతుందన్నది రానున్న కాలమే చెబుతుంది.


