‘కృత్రిమ మేధ’గా మనం చెప్పుకునే ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (ఏఐ) ‘కపటి’ అనే అర్థంలో నిజంగానే కృత్రిమంగా మారి ప్రపంచాన్ని భయపెడుతోంది. తెలుగులో ‘నకిలీ తెలివి’ లాంటి మాటల్ని వెతుక్కునే లోపలే అది నకిలీ విన్యాసాలలో చిత్రవిచిత్రమైన లోతులు చూస్తోంది. ఒక చేత్తో సానుకూలపు పూల బాణాలనూ, ఇంకోచేత్తో ప్రతికూలపు వాడిబాణాలనూ ప్రయోగిస్తూ జనాన్ని ఏకకాలంలో మోహపారవశ్యంలోనూ, భయవిభ్రమాల్లోనూ ముంచెత్తుతోంది. అనుకూల ఫలితాలపై ఆశపడుతూనే, ప్రతికూల ప్రభావాలనుంచి తప్పించుకునే మార్గాల వేటలో ప్రపంచం తలమునకలవుతోంది. భారత్, చైనా, రష్యా సహా పది దేశాలు సభ్యులుగా ఉన్న ‘బ్రిక్స్’ కూటమి కృత్రిమ మేధో వినియోగంలో, అభివృద్ధిలో, దానితో ముడిపడిన నైతిక సమస్యల నివారణలో, మేధో హక్కులూ, డేటా పరిరక్షణలో కలసి పనిచేసే దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా, సాంస్కృతిక రంగంలో కృత్రిమ మేధో దుర్వినియోగాన్ని అరికట్టే లక్ష్యంతో వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుపుతోంది; ఒక సమావేశానికి ప్రపంచ పురాతన నగరాలలో ఒకటైన వారణాసి వేదిక కాబోతోంది.
కృత్రిమ మేధ ఏం చేస్తోందంటే, ఒక సాంకేతిక మహాద్భుతంగా మాయామేయ మాంత్రిక జగత్తును సృష్టిస్తూ పురాణ, ఇతిహాస, జానపద కథల కాలంలోకి తీసుకెడుతోంది. రామాయణంలో భర్త శాపానికి గురై అహల్య శిలగా మారిపోవడం, రాముని పాదాలు తాకగానే పూర్వరూపం తెచ్చుకోవడం గురించి చదివాం; ‘జగదేకవీరుని కథ’ సినిమాలో జలక్రీడలాడుతున్న దేవకన్యలను చూసిన పాపానికి వారి శాపానికి ఎరై కథానాయకుడు శిలగా మారిపోవడం, ఒక వృద్ధ మహిళ అతనికి శాపవిముక్తి కలిగించడం చూశాం. త్రిశంకుని స్వర్గానికి పంపించే ప్రయత్నంలో అతణ్ణి మధ్యలోనే స్తంభింపజేసి ‘త్రిశంకు స్వర్గా’న్ని సృష్టించిన విశ్వామిత్రుని పునఃసృష్టి పాటవాన్ని కథల్లో దర్శించాం. రామాయణంలో ఇంద్రజిత్తు చేసే మబ్బుచాటు మాయావి యుద్ధాన్నీ, మహాభారతంలో సైంధవుని వధ సందర్భంలో కృష్ణుడు చక్రం అడ్డేసి కృత్రిమ సూర్యాస్తమయాన్ని సృష్టించడాన్నీ తిలకించాం. తన అర్ధాంగి పార్వతి అభ్యంగన స్నానానికి వెడుతూ నలుగుపిండి నుంచి సృష్టించి కాపలాపెట్టిన బాలుడు తనను అడ్డగించినందుకు శివుడు ఆగ్రహించి అతని శిరస్సును ఖండించడం; నిజం తెలిసి అతనికి ఏనుగు తలను అతికించి, బతికించడం గురించి విన్నాం.
తలలు తీసి తలలు పెట్టడంతో సహా కృత్రిమ మేధ ఇలాంటి చిత్రవిచిత్ర సన్నివేశాలను అవలీలగా సృష్టించగలుగుతోంది. అవి కపటత్వపు అంచులు తాకుతూ ప్రసిద్ధ వ్యక్తుల శీలహననానికి పాల్పడుతూ వివాదాస్పదమవుతున్నాయి; నిజమో, అబద్ధమో తెలియని త్రిశంకు స్థితికి జనాన్ని నెడుతున్నాయి. రాజకీయ నాయకులు, సినీనటులతో సహా ప్రముఖుల రూపాలనూ, గొంతులనూ వాడుకుంటూ అభ్యంతరకర సన్నివేశాలను సృష్టించడం, వారు న్యాయస్థానాలను ఆశ్రయించడం చూస్తున్నాం. పూర్తి సాంకేతిక నైపుణ్యాలూ, సాంకేతికతను బాధ్యతాయుతంగా వాడుకోవాలనే స్పృహ లేనివారికి కూడా కృత్రిమ మేధ అందుబాటులోకి రావడం వల్ల తలెత్తే ఇలాంటి వైపరీత్యాలతో కూడా పురాణ, ఇతిహాస కథలతో పోలిక కుదరడం మరో వైచిత్రి.
ఉదాహరణకు, మహాభారతంలోని అశ్వత్థామతో ముడిపడిన ఒక ఉదంతాన్నే చూస్తే, కురుక్షేత్ర యుద్ధాంతంలో అతను ఉపపాండవులను వధించి పారిపోయినప్పుడు అతణ్ణి పట్టుకోవడానికి భీముడు బయలుదేరివెడతాడు; అశ్వత్థామ క్రూరుడనీ, చపలచిత్తుడనీ; అతని దగ్గర ‘బ్రహ్మశిరోనామక’మనే దివ్యాస్త్రం ఉందనీ, దాని ప్రయోగమే తప్ప ఉపసంహారం అతనికి తెలియదనీ కృష్ణుడు అర్జునుడితో చెప్పి భీముని కాపాడుకోవడానికి తక్షణమే వెళ్ళాలంటాడు; ఊహించినట్టే అశ్వత్థామ దానిని ప్రయోగించడం, ప్రయోగోపసంహారాలు రెండూ తెలిసిన అర్జునుడు అదే అస్త్రంతో దానిని శాంతింపచేయబోవడం చూస్తాం. మనిషి– తన మేధ సృష్టించిన కృత్రిమ మేధముందు తనే చిత్తవుతున్నాడు. మాంత్రికతనుంచి వాస్తవికతవైపు వెడుతున్న భ్రమలో ఉన్న మనిషిని కృత్రిమ మేధ తిరిగి మాంత్రికతవైపు మళ్ళిస్తూ పైచేయిని చాటుకుంటోంది. తను సృష్టించిన సాంకేతికత చేతిలో తనే ఓడి దిక్కులు చూసే పరిస్థితిని తెచ్చుకోవడం మనిషిని తొలినుంచి వెంటాడుతున్న శాపం.


