ఆమ్‌ రస్‌ | Sakshi Editorial On Mangoes | Sakshi
Sakshi News home page

ఆమ్‌ రస్‌

May 18 2026 1:03 AM | Updated on May 18 2026 1:03 AM

Sakshi Editorial On Mangoes

బహదూర్‌షా జఫర్‌తో కలిసి మీర్జా గాలిబ్‌ తోట షికారుకు బయలుదేరాడు. తోటంటే మామిడి తోటే. అది విరగ కాసి ఉంది. మీర్జా గాలిబ్‌ ప్రతి పండునూ కళ్లు చికిలించి మరీ చూస్తూ ఉన్నాడు. అతని పోబడి కాసేపు పరికించి ‘ఏమిటయ్యా మీర్జా, అలా చూస్తున్నావు’ అన్నాడు జఫర్‌. ‘జహాపనా! ప్రతి పండు మీద తినేవాడి పేరు ఉంటుందని అంటారు. నా పేరు రాసిన పండ్లు ఏవై ఉంటాయా అని వెతుకుతున్నా’ అన్నాడు మీర్జా. జఫర్‌ ముచ్చటగా నవ్వి ఆ సాయంత్రం మీర్జా ఇంటికి బుట్టల కొద్ది పండ్లు పంపాడు. పేరుకు మహాకవి మీర్జా గాలిబ్‌... తియ్యటి మామిడి కోసం తన కవిత్వం మొత్తం ఖుర్బాన్‌ చేయమన్నా చేస్తాడు.బాబర్‌ ఇండియా మీదకు దండెత్తి వచ్చాక ‘నేను నా నేలన తిన్న తియ్యటి ద్రాక్ష ఏదీ? ఆ మధుర కర్బూజా ఫలము ఎక్కడ?’ అని ఏడ్చినంత పని చేశాడు. ‘ఊరుకో స్వామీ’ అని ఇక్కడి స్థానికులు మామిడి పండు కోసి పెట్టారు. తర్వాత బాబర్‌ ‘సరైన మామిడి దొరకాలేగానీ దాని అబ్బలాంటి కాయ మరేదీ లేదు’ అని బాబర్‌ నామాలో రాసుకున్నాడు. సరే. ‘నూర్జహాన్‌’ పేరు మీదే ఒక పండు అంకితం చేయబడింది. అక్బర్‌ మహాశయుడైతే మామిడికి దాసుడు. బిహార్‌లోని దర్భంగా దగ్గర లక్ష మామిడి చెట్లతో తోట వేశాడు. దాని పేరు ‘లఖీ బాగ్‌’. మొఘలులతో పని జరగాలంటే మామిడి పండ్ల బుట్ట ఇస్తే సరి అనే నానుడి ఉండేది. అందుకే అమీర్‌ ఖుస్రో మామిడిని ‘ఫఖర్‌–ఏ–గుల్షన్‌’... ‘తోటలకు గర్వకారణం’ అని కీర్తించాడు. కర్నూలు జిల్లా బనగాన పల్లిలో నవాబులు తమ మామిడి తోటలన్నీ శోధించి శ్రేష్ఠమైన ‘బేనిషాన్‌’ వెరైటీని వృద్ధి చేసి రైతులకు మొక్కలు ధారాళంగా పంచారు. ఇవాళ తింటున్న బంగినపల్లి తీపికి మొదలు అక్కడ ఉంది.

మామిడి మనదే. ఆరు వేల ఏళ్ల చరిత్ర ఉంది దానికి. ఈశాన్య భారతంలో పుట్టి బౌద్ధ సన్యాసుల వల్ల, పర్షియన్‌  వర్తకుల వల్ల, పోర్చుగీసు వాళ్ల వల్ల ప్రపంచానికి పాకింది. ఇవాళ ఏ దేశంలో మామిడి ఉన్నా దాని వేరు మనదే. వేదాల్లో ‘ఆమ్ర’ అని ప్రస్తావన ఉందట. భూమి చుట్టడానికి బదులు తన చుట్టూ తిరిగిన వినాయకుణ్ణి మెచ్చి శివుడు మామిడి పండును బహుమతిగా ఇచ్చాడట. అంటే అది జ్ఞానఫలం. ఇక బుద్ధునికి ఆమ్రపాలి తన మామిడి తోట దానం చేయడం విదితమే. జైన మహావీరుడు 30 ఏళ్ల వయసులో ఇల్లు వదిలి ‘జ్ఞాతృఖండ వనం’ అనే మామిడితోటలో దీక్ష తీసుకున్నాడు. వినోదానికేం కొదవ? రాయలవారి తల్లికి మామిడి పండ్లు దానం చేయాలని ఉండే దట. అది తీరకనే పోయేసరికి ‘ప్రాయశ్చిత్తంగా బంగారు మామిడిపండ్లు ఇస్తేనే స్వర్గప్రాప్తి’ అని హఠాయించిన వారికి తెనాలి రామలింగడు ఇనుప కడ్డీలతో వాతబడి చేశాడని జనశ్రుతి. 2000 ఏళ్ల క్రితమే తెలుగునేలకు మామిడిగాలి సోకినా రాయలవారి కాలానికి మామిడి ఛాయ స్థిరపడింది. రాయలవారే స్వయంగా తోటలు పెంచాడు. ఆముక్తమాల్యదలో మామిడి చివురు ప్రస్తావన చేశాడు.

మామిడి పండ్లు వచ్చేది ఎందుకంటే జీవితం కాసింత రసభరితం చేసుకోండయ్యా అని గుర్తు చేయడానికి. ఎండ ఉదయాన కుటుంబంతో అల్పాహారానికి కూచుని చద్దన్నంలో మామిడి రసం జుర్రుకుంటూ, వేడివేడి పూరీలను మామిడి రసంలో ముంచు కుంటూ, సువర్ణకాంతిలో మెరిసే మామిడి ముక్కల మెరుపుతో ముఖాన్ని శోభిస్తూ, జిహ్వకు స్వర్గం అందడం అంటే ఏమిటో అనుభవిస్తూ బతుకును కాస్త రుచిమధురం చేసుకోమని చెప్తుంది మామిడి కాలం. కానీ ఏమిటి చేయడం! మంచి కాయలన్నీ విదేశా లకు పంపి, కల్మష కాయలన్నీ బజారున ఒంపారు. చిన్నప్పుడు తిన్న మేలిమి రకాలెన్నో శ్రీమంతుల డైనింగ్‌ టేబుల్స్‌కు  పరిమితమయ్యాయి. ఇటు తీపి రుచికి నోచుకోక... అటు బతుకు బాదరబందీలో కుదురు దొరక్క... రుచీ పచీ లేక మిగిలాం. గడ్డి కప్పి, మగ్గబెట్టి, వెతికి వెతికి అందుకుని తిన్న చిన్నప్పటి జ్ఞాపకం ఏమైంది?

లోకాన మంచిగాని, మామిడి రుచిగాని బహు కొద్ది. అందువల్ల దొరికిన ప్రతి లిప్తను జుర్రుకోమని ఉద్బోధించే ఈ కాలానికి నమస్కరించుకుంటూ అందుకోండొక మిగలపండిన మామిడిపండు. పిల్లలకు ఇవ్వండి. మామిడి బాల్యమే తియ్యని బాల్యం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement