ట్రంప్‌కు జ్ఞానోదయం! | Sakshi Editorial On Donald Trump | Sakshi
Sakshi News home page

ట్రంప్‌కు జ్ఞానోదయం!

Mar 24 2026 12:40 AM | Updated on Mar 24 2026 12:40 AM

Sakshi Editorial On Donald Trump

‘నీ గురించి నీకు తెలిసి, శత్రువు గురించి కూడా తెలిస్తే వంద యుద్ధాల్లోనైనా ఓటమి ఉండదు. నీ గురించి నీకు తెలిసినా, శత్రువు గురించి తెలియకపోతే మాత్రం ప్రతి విజయం తర్వాతా ఒక ఓటమి తప్పదు’ అంటాడు పురాతన చైనా యుద్ధరంగ నిపుణుడు సన్‌–జూ. శత్రువు గురించి తెలియటం సంగతలా ఉంచి తన గురించి తనకే తెలియని అయోమయంలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు గెలుపు రమ్మంటే ఎలా వస్తుంది? ఒమన్‌ మధ్యవర్తిత్వంలో అమెరికా, ఇరాన్‌ల మధ్య సాగుతున్న చర్చలు ఫలప్రదమయ్యే దశకు చేరాయని ఒమన్‌తో పాటు సాక్షాత్తూ అమెరికా ప్రతినిధి బృందం ప్రకటించిన కొన్ని గంటల్లోనే గత నెల 28న ఉన్నట్టుండి ఇరాన్‌పై యుద్ధ ప్రకటన చేసిన దుస్సాహసి ట్రంప్‌. తీరా ఇరాన్‌తో రెండురోజులుగా చర్చలు సాగుతున్నాయని, అందు వల్ల యుద్ధానికి అయిదు రోజుల విరామం ఇవ్వదల్చుకున్నామని సోమవారం ఆయన ప్రకటించారు. హార్మూజ్‌ దిగ్బంధాన్ని 48 గంటల్లో ముగించకపోతే ఇరాన్‌ మౌలిక సదుపాయ వ్యవస్థలన్నిటినీ నాశనం చేస్తామని శనివారం ప్రకటించిన ట్రంప్‌ ఇలా యూటర్న్‌ తీసుకోవటం ఆశ్చర్యకర పరిణామం.

ఇరాన్‌ మతాచార్యుడు అలీ ఖమేనీని హతమార్చటంతో మొదలుపెట్టి అమెరికా, ఇజ్రాయెల్‌ దేశాలు గత 23 రోజులుగా నరమేధానికి పాల్పడ్డాయి. అన్నిటికన్నా అత్యంత ఘోరమైన ఉదంతం– పసిపిల్లలు చదువుకుంటున్న బడిపై క్షిపణి దాడి చేసి 170 మంది ప్రాణాలు తీయడం. ఇక్కడితో ఆగలేదు. ఆ రెండు దేశాలూ క్షిపణులతో పెనువిధ్వంసాన్ని సృష్టించాయి. కొన్ని లక్షల జనావాసాలు ధ్వంసం చేశాయి. ఇరాన్‌ త్వరలోనే దాసోహం అంటుందని యుద్ధభేరి మోగించే ముందు అవి అంచనా వేసుకున్నాయి. అసలు ఇరాన్‌ అమ్ములపొదిలో ఆయుధాలేమిటన్న విషయంలోనే వాటికి స్పష్టత లేదు. అది అణ్వాయుధాల తయారీ దిశగా ముందుకెళ్తున్నదని చెప్పిన కారణం బూటకం. అదే నిజమైతే, అసలు దాని జోలికెళ్లడానికే వణికేవారు. ఉత్తర కొరియాను ఏం చేయగలుగు తున్నారు? అసలు ఇరాన్‌ దగ్గర 4,000 మైళ్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణులున్నాయన్న సంగతి అది గురిచూసి కొట్టేదాకా తెలియదు. 

పశ్చిమాసియా కొరివితో తలగోక్కోవటం ట్రంప్‌తోనే మొదలు కాలేదు. ఇరాన్‌లో 1953లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మహమ్మద్‌ మొసాదిఘా ప్రభుత్వాన్ని బ్రిటన్‌తో కుట్రపన్ని పడగొట్టిన ఘనుడు నాటి అమెరికా అధ్యక్షుడు ఐసెన్‌హోవర్‌. ఆ దురంతం తర్వాత ఇరాన్‌ ప్రజలతో అమెరికాకు సత్సంబంధాలు లేవు. మొసదిఘా స్థానంలో వచ్చిన మహమ్మద్‌ రెజా షా పహ్లావి 25 ఏళ్ల పాటు ఇరాన్‌ సంపద దోచిపెట్టగా 1979లో  ఆ నియంతను జనం తరిమికొట్టారు. నాటి అమెరికా అధినేత జిమ్మి కార్టర్‌ తమవారిని చెర నుంచి విడిపించటానికి చేసిన యత్నం బెడిసికొట్టింది. ఇక ఇరాక్‌లో 2003లో జార్జి బుష్‌... 2011లో లిబియా, సిరియాల్లో ఒబామా తలలు బొప్పికట్టించుకున్నారు. 

పశ్చిమాసియాలో ఏకైక పెత్తందారుగా ఆవిర్భవించాలన్న ఇజ్రాయెల్‌ కల చాలా పాతది. గత అధ్యక్షులంతా దీన్ని తోసిపుచ్చగా తొలిసారి ట్రంప్‌ తన సలహాదారుల మాటనూ, నిఘా వర్గాల హెచ్చరికలనూ బేఖాతరుచేసి ఈ దుస్సాహసానికి దిగారు. పర్యవసానంగా అమెరికా కల్పిస్తామంటున్న భద్రత ఉత్త డొల్ల అని గల్ఫ్‌ దేశాలు గ్రహించాయి. చరిత్రలో ట్రంప్‌కు సాటిరాగల ఒకే ఒకడు నెపోలియన్‌ బోనపార్టే. యూరొప్‌ను జయించి, రష్యాను సైతం దురాక్రమించాలని 1812లో వెళ్లిన నెపోలియన్‌ అక్కడి భౌగోళిక స్థితిగతులపై అంచనా లేక ఏకంగా 6 లక్షలమంది సైన్యాన్ని కోల్పోయాడు. అతడి పతనానికి అదే నాంది. 

ఇంతకూ తాజా ప్రకటనకైనా ట్రంప్‌ కట్టుబడతారా లేదా అన్నది చెప్పలేం. ఇరాన్‌ మాత్రం ససేమిరా అంటున్నది. అక్కడ నాయకత్వాన్ని అమెరికా, ఇజ్రాయెల్‌ దేశాలు తుడిచి పెట్టడంవల్ల ఈ దుఃస్థితి ఏర్పడింది. అయినా ప్రపంచ శాంతిని దృష్టిలో పెట్టుకుని ఒక మెట్టు దిగడానికి ఇరాన్‌ సిద్ధపడాలి. ఆ దిశగా మధ్యవర్తులు ప్రయత్నించాలి. అటు ట్రంప్‌ భేషజాలు కట్టిపెట్టాలి. ఇరాన్‌ దాడుల్లో నష్టపోయిన గల్ఫ్‌ దేశాలకు నష్టపరిహారం చెల్లించటంతో పాటు, ఇరాన్‌కు కలిగిన నష్టాన్ని కూడా భర్తీ చేస్తేనే ఆ దేశాన్ని ఒప్పించటం సాధ్యమని గ్రహించాలి. ఇప్పటికైనా ఆయన తెలివి తెచ్చుకోవాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement