తిరోగాముల పురోగమనం | Sakshi Editorial On India Reactionaries Progress | Sakshi
Sakshi News home page

తిరోగాముల పురోగమనం

Mar 30 2026 1:35 AM | Updated on Mar 30 2026 1:35 AM

Sakshi Editorial On India Reactionaries Progress

మన దేశానికి గల ఘనతలు ఎన్నైనా చెప్పుకోవచ్చు; సనాతన సంప్రదాయ పరంపరను ఎంతైనా కొనియాడుకోవచ్చు. అలాగని గతవైభవ సంకీర్తనలతోనే కాలం వెళ్లబుచ్చడం ఏమాత్రం వివేకమున్న పని కాదు. వర్తమానంలో చెప్పుకోదగినది ఏదీ లేనప్పుడు; భవితవ్యం అగమ్యగోచర అయోమయంగా మారినప్పుడు బుద్ధి పనిచేయక చాలామంది తమ గత వైభవాన్ని పదే పదే చెప్పుకుంటూ తన్మయంలో మునిగిపోతుంటారు. వర్తమా నంలోని వేగాన్ని అందుకోలేక, భవితవ్యంలోని అభివృద్ధిని అంచనా వేయలేక ‘గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్‌’ అని వలపోస్తూ ఉంటారు. ఇలాంటి వారిది తిరుగులేని తిరోగమన ధోరణి.

గత వైభవ స్తోత్రాలు వల్లించేవారు దాదాపు అన్ని రంగాల్లోనూ ఉంటారు కాని, పదవులకు శాశ్వతంగా దూరమైన రాజకీయ నాయకుల్లోను; తెరమరుగైపోయిన సినీ ప్రముఖుల్లోను; పాఠకులు పట్టించుకోని రచయితలు, కవులలోను; ఆధ్యాత్మిక ప్రవచన కర్తల్లోను తిరోగమనవాదులు ఎక్కువగా కనిపిస్తారు. బహిరంగ వేదికల మీద మైకులు దొరికితే వీరి వాగ్ధారకు మాత్రమే కాదు, వాగ్దాష్టీకాలకు కూడా అంతు ఉండదు. ఇటీవలి కాలంలో ఇలాంటి వాగ్దాష్టీకాల ఉదంతాలే వార్తలకెక్కుతున్నాయి; ప్రసార మాధ్యమాల కార్యక్రమాల్లో ప్రధాన చర్చాంశాలవుతున్నాయి; సామాజిక మాధ్యమాల్లో రణగొణలవు తున్నాయి.

గత వైభవ గాథలను మితిమీరి ఊదరగొడుతుంటే, జనాలకు విసుగు పుడుతుంది. ఒక్కసారి చరిత్రను తరచి చూసుకుంటే, ‘గతమంతా తడిసె రక్తమున/ కాకుంటే కన్నీళులతో’ అని శ్రీశ్రీ ఎందుకన్నాడో ఎవరికైనా సులువుగానే బోధపడుతుంది. గతం నుంచి పాఠాలు నేర్చుకోని వర్తమానానికి భవిష్యత్తు ఉండదు. గతంతో పోల్చి చూసు కున్నప్పుడు వర్తమానం సాధించే ఎలాంటి పురోగతినైనా స్వాగతించాల్సిందే! గతంలో జరిగిన పొరపాట్లకు వర్తమానంలో జరిగే ఎలాంటి దిద్దుబాటునైనా హర్షించాల్సిందే! సమీప గతం పట్ల ఎరుక కలిగిన సామాన్య ప్రజానీకం వర్తమానంలో చోటుచేసుకునే ఎలాంటి సానుకూలతనైనా ఆమోదిస్తుంది. కాని, తిరోగాములకు వర్తమాన సానుకూలతలు ఇనుపగుగ్గిళ్లలా మింగుడుపడవు. తమ ఘనతకు ఎక్కడ భంగం వాటిల్లుతుందోననే భయంతో నోటికి పని చెబుతారు. ఏ వేదిక దొరికినా, సమయ సందర్భాలతో, ఉచితానుచితాలతో నిమిత్తం లేకుండా తమ లోలోపలి అక్కసునంతా వెళ్లగక్కుతారు.

జనాభాలో తిరోగాములు ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన వాళ్లేమీ కాదు. పురాణకాలంలోని పురాతన రాజ్యాలలోనూ ఇలాంటి కురచబుద్ధుల తిరోగాములు ఉండే వారు. వీళ్లు నిత్యదుఃఖితులు. ఇలాంటి వాళ్ల గురించే ‘ఈర్షా్యళు ఘృణీ నసంతుష్టః క్రోధనో నిత్యశంకితః/ పరభాగ్యోపజీవీ చ షడతే నిత్యదుఃఖితాః’ అని విదురనీతి చెబుతుంది. ఇతరుల పట్ల ఈర్ష్యపడేవారు; ఇతరులను నిష్కారణంగా అసహ్యించు కునే వారు; నిత్యం అసంతృప్తితో రగిలిపోయేవారు; ఉత్తపుణ్యానికే కోపంతో చిర్రుబుర్రు లాడేవారు; ప్రతి విషయాన్నీ అనుమానించేవారు; ఇతరుల భాగ్యంపై ఆధారపడి జీవించే పరాన్నభుక్కుల వంటివారు నిత్యం దుఃఖంతోనే కొట్టుమిట్టాడుతుంటారు.

అంతటితోనే ఆగరు. తమ పరిసరాల్లోని మనుషుల సంతోషాన్ని కూడా హరించేస్తారు. సామాజిక వేదికలను అధిరోహిస్తే, యావత్‌ సమాజంలోని సుఖశాంతులకే భంగం కలిగిస్తారు. ‘వివేక తిరోగమనే మూర్ఖత్వ పురోగమనం’ అని రష్యన్‌ రచయిత తామెర్లాన్‌ కుజ్గోవ్‌ ఇలాంటి బాపతు తిరోగాముల గురించే వ్యాఖ్యానించాడు. సమాజానికి చేటు కలిగించే తిరోగాములను కనీసం సామాజిక వేదికలకు దూరంగా ఉంచడం మంచిది. 

లేకుంటే, వాళ్లు మూర్ఖత్వ పురోగమనాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి కృషి చేస్తారు. వారి కృషిని సమాజం భరించలేదు. ఇటీవలే ప్రభుత్వ బిరుదాంకితుడైన ఒక ప్రవచనకర్త ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసే మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలకు పోషకాహారంగా గుడ్లు పెట్టడం మీద నోరుపారేసుకుని కలకలం రేపిన ఉదంతం ఈ కృషికి తాజా ఉదాహరణ. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవడం పురోగామి సమాజం బాధ్యత. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement