బీజింగ్: చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్‌లో శనివారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. తైయువాన్ నగరంలోని ఒక భవనంలో మంటలు చెలరేగడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో తొమ్మిది మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానిక మీడియా, అంతర్జాతీయ వార్తా సంస్థల కథనాల ప్రకారం.. షాంగ్జీ రాజధాని తైయువాన్‌లోని షియావోడియన్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.
భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, చూస్తుండగానే భవనం మొత్తానికి అవి విస్తరించాయి. దట్టమైన పొగలు, నిప్పురవ్వలు ఆకాశాన్నంటడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే అత్యవసర సేవా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన 23 మందిని వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో తొమ్మిది మంది పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందని జిల్లా పబ్లిసిటీ విభాగం వెల్లడించింది.
3月28日晚,山西太原,亲贤北街茂业怡和巷一饭店大楼发生大火,官方通报24死伤!#太原 #火灾 pic.twitter.com/uZsvMm3utw
— 中国悲剧档案 (@newszg_official) March 28, 2026
భవనం నుంచి భారీగా మంటలు ఎగసిపడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాత్రి పూట మంటలు భవనాన్ని చుట్టుముట్టడం, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు ఈ వీడియోల్లో కనిపిస్తున్నాయి. అయితే, ఈ వీడియోల ప్రామాణికతను అధికారులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. దీనిపై ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. బాధితులకు అవసరమైన వైద్య సహాయం అందిస్తున్నామని అధికారులు తెలిపారు.


