పశ్చిమ బెంగాల్ అనగానే అందరికీ అక్కడి కళలు, సాహిత్యం.. అంతకు మించి ఘుమఘుమలాడే చేపల పులుసు గుర్తుకువస్తాయి. అయితే ఇప్పుడు అదే చేప రాజకీయాల్లో రచ్చ లేపుతోంది. అభివృద్ధి, నిరుద్యోగం వంటి అంశాలను పక్కనబెట్టి, ఓటర్ల కంచంలో ఉండే ‘చేప ముక్క’ చుట్టూ ఇప్పుడు తృణమూల్, బీజేపీ మధ్య యుద్ధం నడుస్తోంది. బెంగాలీయుల ప్రాణప్రదమైన ఆహారపు అలవాట్లను అస్త్రంగా చేసుకుని సాగుతున్న ఈ ‘ఫిష్ పాలిటిక్స్’ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.
చేపతో బీజేపీ ప్రచారం.. షాకైన ఓటర్లు
బీజేపీ అధికారంలోకి వస్తే చేపలు, మాంసం తిననివ్వరంటూ మమతా బెనర్జీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కమలం పార్టీ నేతలు వినూత్న పంథాను అనుసరిస్తున్నారు. బిధాన్‌నగర్ బీజేపీ అభ్యర్థి డాక్టర్ శరద్వత్ ముఖర్జీ ఏకంగా 5 కిలోల బరువున్న 'కట్ల' చేపను చేత్తో పట్టుకుని వీధుల్లో ప్రచారం నిర్వహించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ‘మేము చేపలకు వ్యతిరేకం కాదు.. మా సంస్కృతిలో భాగం’ అంటూ ఓటర్లకు భరోసా ఇచ్చేందుకే ఈ ఫీట్ చేశానని ఆయన చెబుతున్నారు.
దీదీ ఘాటు విమర్శలు: ‘మీ కంచంపై కన్నేస్తారు’
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ప్రసంగాల్లో బీజేపీపై నిప్పులు చెరుగుతున్నారు. ‘వారు మీ పళ్లెంలో చేపను ఉండనివ్వరు, గుడ్లను తాకనివ్వరు. చివరికి మీరు బెంగాలీ మాట్లాడితే బంగ్లాదేశీయులని ముద్ర వేస్తారు’ అంటూ భావోద్వేగపూరిత విమర్శలు చేస్తున్నారు. బెంగాలీ అస్తిత్వాన్ని, ఆహారపు అలవాట్లను కాపాడుకోవాలంటే తృణమూల్‌కే ఓటు వేయాలని ఆమె గట్టిగా పిలుపునిస్తున్నారు.
బీజేపీ కౌంటర్: ‘స్వామి వివేకానందుడే చెప్పారు’
మమత ఆరోపణలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య తీవ్రంగా స్పందించారు. స్వామి వివేకానందుడి బోధనలను గుర్తు చేస్తూ.. ఆహారపు అలవాట్లపై తాము ఎప్పుడూ ఆంక్షలు విధించబోమని స్పష్టం చేశారు. కేవలం ఓట్ల కోసమే దీదీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బెంగాల్ సంస్కృతిని తమ కంటే బాగా ఎవరూ గౌరవించలేరని ఆయన కౌంటర్ ఇచ్చారు.
ఓటర్ల మనోగతం: ‘ఆహారాన్ని రాజకీయం చేయకండి’
రాజకీయ నాయకుల వాదోపవాదాలు ఎలా ఉన్నా, సామాన్య ఓటర్లు మాత్రం మరోలా ఆలోచిస్తున్నారు. ‘మా పళ్లెంలో చేపను దూరం చేసే ఎవరికైనా ఓటు వేయబోము’ అని కొందరు స్పష్టం చేస్తుండగా, మరికొందరు మహిళా ఓటర్లు అసలు సమస్యను తెరపైకి తెస్తున్నారు. చేపల ధరల కంటే, ఆ చేపను వండే గ్యాస్ ధరలు, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, వాటి గురించి మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నారు.
గణాంకాలు చెబుతున్న 'చేప' పవర్!
బెంగాల్‌లో చేపల వినియోగం కేవలం ఆహారం మాత్రమే కాదు, అదొక ఆర్థిక వ్యవస్థ. వరల్డ్ బ్యాంక్ లెక్కల ప్రకారం బెంగాలీయులు ఏడాదికి 8.36 లక్షల టన్నుల చేపలను ఆరగిస్తున్నారు. తమ మొత్తం ఆహార ఖర్చులో 18.9 శాతం కేవలం చేపలు, మాంసం కోసమే ఖర్చు చేస్తారు. పెళ్లిళ్లలో కూడా చేపను కానుకగా ఇచ్చే ఈ రాష్ట్రంలో, చేప చుట్టూ తిరిగే రాజకీయం ఎన్నికల ఫలితాలను ఏ తీరానికి చేరుస్తుందో వేచి చూడాలి!
ఇది కూడా చదవండి: కేరళ పోరు: రంగంలోకి మోదీ, సోనియా.. ‘యోగి’ ఎక్కడ?


