కేరళ పోరు: రంగంలోకి మోదీ, సోనియా.. ‘యోగి’ ఎక్కడ? | Kerala Assembly Elections Heat Up As BJP, Congress, And Other Parties Announce Star Campaigners, More Details Inside | Sakshi
Sakshi News home page

Kerala Elections: రంగంలోకి మోదీ, సోనియా.. ‘యోగి’ ఎక్కడ?

Mar 28 2026 11:09 AM | Updated on Mar 28 2026 11:35 AM

BJP and Congress reveal star campaigners list for Kerala Elections

తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల సమరం అంతకంతకూ రసవత్తరంగా మారుతోంది. రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించేందుకు సిద్ధమైన ‘స్టార్ క్యాంపెయినర్ల’ జాబితాను ఆయా పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాయి.

బీజేపీ వ్యూహం: మోదీ సుడిగాలి పర్యటనలు
కేరళపై ప్రత్యేక దృష్టి సారించిన బీజేపీ.. ప్రధాని నరేంద్ర మోదీని ప్రధాన ప్రచారకర్తగా రంగంలోకి దించుతోంది. ప్రధాని ఇప్పటికే రెండుసార్లు కేరళలో పర్యటించగా, ఈ ఆదివారం మరోసారి ప్రచారానికి రానున్నారు. బీజేపీ విడుదల చేసిన 40 మంది సభ్యుల జాబితాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నితిన్ నబిన్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ తదితర హేమాహేమీలు ఉన్నారు. అయితే, అనూహ్యంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేరు ఈ జాబితాలో లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

కాంగ్రెస్ ఆశలన్నీ గాంధీ కుటుంబంపైనే..
కాంగ్రెస్ పార్టీ కూడా భారీ తారాగణంతో ప్రచార బరిలోకి దిగుతోంది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా కేరళలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఇప్పటికే రాహుల్, ప్రియాంకలు ఎన్నికల తేదీల ప్రకటనకు ముందే అక్కడ ప్రచారాన్ని ప్రారంభించారు. వీరితో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, శశి థరూర్, సచిన్ పైలట్ తదితర కీలక నేతలు రంగంలోకి దిగుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్‌లను స్టార్ క్యాంపెయినర్లుగా కాంగ్రెస్ ఎంపిక చేయడం విశేషం.

రేసులో ఇతర పార్టీలు
ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరించనున్నారు. అలాగే లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ , బహుజన్ సమాజ్ పార్టీలు కూడా తమ అగ్రనేతల పేర్లను ఎన్నికల సంఘానికి అందజేశాయి. మొత్తానికి జాతీయ స్థాయి నేతల రాకతో కేరళ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మరి ఈ స్టార్ క్యాంపెయినర్ల హవా ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపనున్నదో వేచి చూడాలి.

ఇది కూడా చదవండి: అభ్యర్థుల లిస్టుతో ‘విజయ్‌’ పొలిటికల్ సునామీ!

Advertisement
 
Advertisement
Advertisement