సర్వం ‘సర్‌’మయం! | SIR Issue Highlight In Bengal Assembly Election Campaign | Sakshi
Sakshi News home page

సర్వం ‘సర్‌’మయం!

Mar 29 2026 7:00 AM | Updated on Mar 29 2026 7:00 AM

SIR Issue Highlight In Bengal Assembly Election Campaign

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మతపరమైన విభజన ప్రధానాంశంగా మారుతోంది. ముఖ్యంగా ప్రధాన పక్షాలైన అధికార తృణమూల్‌ కాంగ్రెస్, బీజేపీ ప్రచారమంతా కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) ప్రక్రియ చుట్టే తిరుగుతోంది! దాంతో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానాంశాలుగా నిలిచిన పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సీ వంటివి పూర్తిగా పక్కకు పోయాయి. సర్, చొరబాట్లు, మైనారిటీల సంతుష్టీకరణే ప్రచారాంశాలుగా మారాయి.

సర్‌ ప్రక్రియలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 64 లక్షల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. ఇంకా లక్షలాది ఓటర్ల తనిఖీ కొనసాగుతోంది. దాంతో పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయ సమీకరణాలే పూర్తిగా మారిపోతున్నాయి! 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 90 స్థానాల్లో మెజారిటీ 10 వేల లోపే నమోదైంది. భారీ ఓట్ల తొలగింపు కారణంగా ఆ స్థానాల్లో ఈసారి పార్టీల బలాబలాలే తారుమారయ్యే పరిస్థితి నెలకొంది! ఒక్క ముర్షీదాబాద్‌ జిల్లాలోనే ఏకంగా 11 లక్షల ఓట్లు తొలగింపునకు గురవడం విశేషం. 8.3 లక్షలతో మాల్డా రెండో స్థానంలో నిలిచింది. నార్త్, సౌత్‌ 24 పరగణా జిల్లాల్లో కలిపి 12 లక్షల పైచిలుకు ఓట్లు గల్లంతయ్యాయి. ఆ రెండు జిల్లాల్లో మరో 11 లక్షల ఓట్ల తనిఖీ కొనసాగుతోంది! ఇదంతా తమ ఓటుబ్యాంకుకు గండి కొట్టే కుట్రేనని టీఎంసీ ఆరోపిస్తుండగా, కేవలం చొరబాటుదారులను, దొంగ ఓటర్లను ఏరివేయడమే లక్ష్యమని బీజేపీ చెబుతోంది.

అస్తిత్వవాదం దిశగా... 
బెంగాల్లో గతంలో ప్రధానంగా ఎన్నికల వేళ మాత్రమే పార్టీలు, మతపరమైన విభజన వంటివి తెరపైకి వచ్చేవి. ‘‘సర్‌ ప్రక్రియతో పరిస్థితే మారిపోయింది. కొంతకాలంగా ఏ జిల్లాను తీసుకున్నా మతపరమైన విభజన కొట్టొచ్చినట్టుగా కన్పిస్తోంది. అంతేగాక అది క్రమంగా శాశ్వత రూపు సంతరించుకుంటూ ఉండటం ఆందోళనకరం. స్థానికంగా చిన్న స్థాయిలో జరిగే శ్రీ రామనవమి ఉత్సవాలు ఈసారి భారీ జన సమీకరణ వేదికలుగా మారడం ఇందుకు నిదర్శనం’’ అని రాజకీయ విశ్లేషకులు సుమన్‌ భట్టాచార్య, మొయిదుల్‌ ఇస్లాం అభిప్రాయపడ్డారు. బెంగాల్‌ రాజకీయాలు వర్గ సమీకరణల నుంచి పూర్తిగా మతం, సంస్కృతి, పౌరసత్వం పేరిట క్రమంగా అస్తిత్వవాదం వైపు మళ్లుతున్నాయని వారన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement