‘మాయ’ఫెస్టోలు! | Supreme Court expresses concern over promises made by parties | Sakshi
Sakshi News home page

‘మాయ’ఫెస్టోలు!

Mar 28 2026 1:12 AM | Updated on Mar 28 2026 1:12 AM

Supreme Court expresses concern over promises made by parties

రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంగా విడుదల చేసే మానిఫెస్టోలు ఆర్థిక, రాజకీయ, సామాజిక సమసల్యపై వాటి వైఖరిని తేటతెల్లం చేయాలి. ఆ క్రమంలో వాగ్దానాలుంటే ఉండొచ్చు. కానీ చాలా పార్టీలకు గెలుపే లక్ష్యంగా అసంబద్ధమైన, ఆచరణ సాధ్యంకాని హామీలు గుప్పించి ఓటర్లను మాయచేసి అధికారంలోకి రావాలనే యావ తప్ప మరేమీ ఉండటం లేదు. ఈమధ్యే సుప్రీంకోర్టు ఎన్నికల ముందు ఓటర్లను ఆకర్షించటానికి పార్టీలు చేసే వాగ్దానాలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇవి ప్రజాస్వామ్యాన్ని దెబ్బ తీస్తాయన్నది. 

అయితే రాజ్యాంగ ఉల్లంఘనలు లేనంత కాలమూ వాటిలో జోక్యం చేసుకోవటం సాధ్యం కాదని తెలిపింది. ఈ విషయంలో చట్టం చేయటం ప్రభుత్వాల బాధ్యతేనని తేల్చిచెప్పింది. నిజానికి అతిగా వాగ్దానాలు చేయటం ఎన్నికల రంగంలో ఉండాల్సిన సమానావకాశాలను దెబ్బతీయడం కిందికి వస్తుంది. అన్నా డీఎంకే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం విడుదల చేసిన మానిఫెస్టో గత రికార్డులను తలదన్నింది. 

అందులో 2.22 కోట్లమందికి ఉచితంగా రిఫ్రిజిరేటర్లు పంచడం, వ్యవసాయ రుణాల మాఫీ, అన్ని కుటుంబాలకూ ‘కారుణ్య భత్యం’ కింద రూ. 10,000 చొప్పున ఇవ్వటం, మహిళలతో పాటు మగవారికి కూడా ఉచిత బస్సు సౌకర్యం, ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం వగైరాలున్నాయి. అధికార డీఎంకే ఇప్పటికే రెండు దఫాలుగా 1.31 కోట్లమంది మహిళల ఖాతాల్లోకి రూ. 8,000 చొప్పున బదిలీ చేసింది. తిరిగి అధికారంలోకొచ్చాక నెలకు రూ.2000 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చింది.

జన సంక్షేమాన్ని ఉద్దేశించి చేసే వాగ్దానాలకూ, సహేతుకత లేని ఉచితాలకూ వ్యత్యాసం ఉంటుంది. ఎన్నికల ముందు వాగ్దాన కర్ణులుగా మారడం, తీరా అధికారం రాగానే వాటిని మరిచి, ప్రశ్నించినవారిని బెదిరించటం అలవాటైపోయింది. ఈ ధోరణి ఆంధ్రప్రదేశ్‌లో గత రెండేళ్లుగా బాహాటంగా కనబడుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009 ఎన్నికల్లో ఇంటికొక కలర్‌ టీవీతో మొదలుపెట్టి చంద్రబాబు ఇచ్చిన హామీలకు లెక్కే లేదు. 2011లో డీఎంకే, అన్నాడీఎంకే పోటాపోటీగా చేసిన వాగ్దానాలు వేలంపాటల్ని తలపించాయి. 

ఇక 2014లో మరోసారి ఏపీలో చంద్రబాబు మహా వాగ్దాన కర్ణుడి అవతారం ఎత్తారు. ఆ హామీల గురించి అడిగేవారు ఎక్కువవుతుండటంతో అధికారంలోకొచ్చిన కొన్నాళ్లకే మేనిఫెస్టోను కాస్తా పార్టీ వెబ్‌సైట్‌ నుంచి తొలగించారు. 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీల గతి ఎలావుందో కనబడుతూనే ఉంది. ఇందుకుభిన్నంగా 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ మానిఫెస్టో ఆచరణ సాధ్యమైన హామీలనే పొందుపరిచింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నవరత్నాల పేరిట ఇచ్చిన హామీల అమలు సంగతి అందరికీ  గుర్తుండేలా సెక్రటేరియట్‌లో ప్రముఖంగా కనబడేలా అమర్చారు. ఫలితంగా 99 శాతం హామీలు నెరవేరాయి. 

సంక్షేమ రాజ్యంలో పేదవర్గాలకు విద్య, వైద్యం, ఆహారం అందుబాటులో ఉండేలా చూడటం రాజ్యం కర్తవ్యం. అందుకే వాటిని నెరవేరుస్తామంటే ఎవరూ అభ్యంతర పెట్టరు. వీటితోపాటు ఆ వర్గాలు స్వశక్తిపై ఎదిగేందుకు అనువైన పథకాల రూపకల్పన వైపు ప్రభుత్వాలు దృష్టి సారించాలి. కానీ మానిఫెస్టోలంటే వేలం వెర్రిగా మారింది. కలర్‌ టీవీలు, గ్రైండర్‌లు ఇస్తామనటం నుంచి ఏకంగా రిఫ్రిజిరేటర్లు ఉచితంగా పంచిపెడ తామనే వరకూ వచ్చింది. గెలిచి అధికారంలోకొచ్చాక ఇవ్వలేకపోతే లేదా ఏవో సాకులు చూపి కొంతమందికే పరిమితం చేస్తే వీటిని న్యాయస్థానాలు ప్రశ్నించజాలవన్న ధైర్యమే పార్టీలకు ఇలాంటి బూటకపు వాగ్దానాలు చేసే సాహసాన్నిస్తోంది.

పార్టీలు విడుదల చేసే మానిఫెస్టోలను నమ్మడం ‘న్యాయబద్ధమైన ఆశ’గా పరిగణించలేమనీ, కనుక వాటిని నెరవేర్చాలని ప్రభుత్వాలను ఆదేశించటం సాధ్యం కాదనీ 1995లో ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. అలాగే 2013లో తమిళనాడుకు చెందిన పౌరుడు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తూ వాగ్దానాలు చేసి, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన పార్టీకి మానిఫెస్టో హామీలను అమలు చేయాలంటూ ఆదేశాలివ్వజాల మని తెలిపింది. అయితే ఈ విషయంలో కొన్ని మార్గదర్శకాలు రూపొందించాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. అటుతర్వాత అవి రూపొందినా రాజకీయ పక్షాలపై వాటి ప్రభావం శూన్యం. కనుక మోసగాళ్లెవరో, నిజాయితీపరులెవరో... ఎవరు జవాబుదారీ తనంతో ఉంటారో గ్రహించటం ప్రజల కర్తవ్యం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement