పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుని, అంతర్జాతీయంగా ఇంధన సరఫరాపై ఆందోళనలు నెలకొన్న వేళ.. గుజరాత్‌లోని ఒక విద్యాసంస్థ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఎల్‌పీజీ సిలిండర్లపై పైసా ఖర్చు లేకుండా, కేవలం బయో గ్యాస్‌తో వందలాది మందికి కడుపు నింపుతూ వార్తల్లో నిలిచింది.
నిత్యం 500 మందికి భోజనం
గాంధీనగర్‌లోని ‘మానెక్‌బా వినయ్ విహార్’ విద్యాసంస్థ గుజరాత్ ప్రభుత్వ ‘ఇన్‌స్టిట్యూషనల్ బయో గ్యాస్ ప్లాంట్ స్కీమ్’ కింద ఈ అద్భుతాన్ని సాధించింది. ఈ క్యాంపస్‌లో ప్రతిరోజూ దాదాపు 250 మంది విద్యార్థులకు రెండు పూటలా భోజనం సిద్ధం చేస్తున్నారు. కేవలం విద్యార్థులకే కాకుండా, క్యాంపస్‌లో నివసించే మరో 15 కుటుంబాలకు కూడా ఈ బయో గ్యాస్ ద్వారానే వంట గ్యాస్ అందుతోంది. మొత్తంగా రోజుకు 500 మందికి పైగా ఈ ఇంధనం ద్వారానే ఆహారం పొందుతున్నారు.
నెలకు 30 సిలిండర్ల ఆదా
ఈ విద్యాసంస్థలో ప్రస్తుతం 45 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం కలిగిన రెండు ప్లాంట్లు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు 90 క్యూబిక్ మీటర్ల బయో గ్యాస్ ఉత్పత్తి అవుతోంది. ఒకవేళ ఈ ప్లాంట్లు లేకపోతే, ఈ అవసరాల కోసం నెలకు కనీసం 30 ఎల్‌పీజీ సిలిండర్లు వాడాల్సి వచ్చేదని అధికారులు చెబుతున్నారు. కానీ ప్రస్తుతం ఒక్క సిలిండర్ అవసరం కూడా లేకుండానే వంట పనులు పూర్తవుతున్నాయి.
వ్యర్థం నుంచి ఆదాయం.. సేంద్రీయ సాగు
సంస్థ మేనేజర్ రాహుల్ పటేల్ తెలిపిన వివరాల ప్రకారం క్యాంపస్‌లో ఉన్న 220 ఆవుల నుంచి వచ్చే పేడను ఈ ప్లాంట్లకు ముడిసరుకుగా వాడుతున్నారు. బయో గ్యాస్ ఉత్పత్తి అయిన తర్వాత మిగిలే వ్యర్థాన్ని ఎరువుగా మార్చి, క్యాంపస్‌లోనే పూర్తి స్థాయిలో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు. దీనివల్ల అటు గ్యాస్ ఖర్చు తగ్గడమే కాకుండా, ఇటు స్వచ్ఛమైన ఆహారం కూడా లభిస్తోంది.
విస్తరిస్తున్న ‘బయో’ విప్లవం
గుజరాత్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (జీఈడీఏ) గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి 193 ప్లాంట్లను ఏర్పాటు చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈ పథకం కోసం ప్రభుత్వం రూ. 12 కోట్లు కేటాయించింది. త్వరలోనే మరో 60 విద్యాసంస్థల్లో ఇటువంటి ప్లాంట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇంధన ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో, ఇలాంటి స్వయం సమృద్ధి మార్గాలు సామాన్యులకు వివిధ సంస్థలకు ఊరటనిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: రేమండ్ ‘కంప్లీట్ మ్యాన్’ ఇకలేరు


