అమెరికా దాడుల దృశ్యాలు.. ప్రపంచమంతా హడల్‌! | US releases footage of airstrikes on Iranian naval vessels | Sakshi
Sakshi News home page

అమెరికా దాడుల దృశ్యాలు.. ప్రపంచమంతా హడల్‌!

Mar 29 2026 8:00 AM | Updated on Mar 29 2026 8:01 AM

US releases footage of airstrikes on Iranian naval vessels

వాషింగ్టన్/దుబాయ్: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింతగా ఎగసిపడుతున్నాయి. తాజాగా ఇరాన్ నౌకలపై అమెరికా జరిపిన వైమానిక దాడుల దృశ్యాలను అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) విడుదల చేయడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. దశాబ్దాలుగా అంతర్జాతీయ నౌకాయానాన్ని వేధిస్తున్న ఇరాన్ ఆగడాలకు ఇక కాలం చెల్లిందని అమెరికా ఈ వీడియో ద్వారా ప్రపంచానికి తెలియజేసింది.

దుబాయ్‌లో భారీ దాడులు.. ఇరాన్ సంచలన ప్రకటన
మరోవైపు అమెరికా దాడులకు ధీటుగా బదులిచ్చామని ఇరాన్ ప్రకటించింది. దుబాయ్‌లోని రెండు అమెరికా సైనిక ‘రహస్య స్థావరాల’పై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడ్డామని ఇరాన్ స్టేట్ మీడియా ‘తస్నిమ్’ వెల్లడించింది. ఈ దాడుల్లో అమెరికాకు భారీ స్థాయిలో ప్రాణనష్టం వాటిల్లిందని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ (IRGC) పేర్కొంది.
 

హజ్రత్ ఖాతమ్ అల్-అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్‌లోని రెండు స్థావరాలలో సుమారు 500 మంది అమెరికా సైనికులు ఉండగా, వారిని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. మృతులను, క్షతగాత్రులను తరలించేందుకు దుబాయ్‌లోని అంబులెన్సులు గంటల తరబడి శ్రమించాయని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతం అమెరికా సైనికులకు స్మశానవాటికగా మారుతుందని, ట్రంప్‌తో పాటు అమెరికా సైనిక కమాండర్లు తలవంచక తప్పదని హెచ్చరించారు.

గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు వార్నింగ్
పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ గల్ఫ్ దేశాలకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ‘మీ దేశాల అభివృద్ధి, భద్రతను కాపాడుకోవాలంటే.. అమెరికా, ఇజ్రాయెల్ శక్తులు మీ గడ్డపై నుంచి ఇరాన్‌పై దాడులు చేయకుండా అడ్డుకోండి’ అని ఆయన సూచించారు. ఇరాన్ ఎప్పుడూ ముందుగా దాడులకు దిగదని, అయితే తమ దేశ మౌలిక సదుపాయాలపై ఒక్క దాడి జరిగినా దానికి ప్రతిచర్య అత్యంత తీవ్రంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. కాగా ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే పశ్చిమాసియాలో ఏ క్షణంలోనైనా పూర్తిస్థాయి యుద్ధం మొదలయ్యేలా కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు. ప్రపంచ దేశాలు ఈ పరిణామాలను ప్రతిక్షణం గమనిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Bengal Politics: దీదీ ‘చేప’లకు మోదీ గాలం?

Advertisement
 
Advertisement
Advertisement