న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నా, ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ముంచుకొస్తున్నా భారత్ ఏమాత్రం బెదిరిపోదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆదివారం నాటి 132వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనే సత్తా భారత దేశానికి ఉందని అన్నారు.
వదంతులు నమ్మొద్దు.. ఐక్యంగా ఉందాం!
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 28 నుంచి మొదలైన ఈ యుద్ధం వల్ల అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం పడుతోందని, ముఖ్యంగా ‘స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్’ గుండా రవాణా నిలిచిపోవడం ఇంధన సరఫరాకు సవాలుగా మారిందని పేర్కొన్నారు. ‘ఇది క్లిష్ట సమయం. 140 కోట్ల మంది భారతీయులు ఐక్యంగా ఉండాలి. స్వార్థ రాజకీయాల కోసం ఈ విషయాన్ని వాడుకోవద్దు. వదంతులు వ్యాప్తి చేస్తూ దేశానికి నష్టం కలిగించకండి’ అని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ఆయన కోరారు.
అండగా నిలిచిన గల్ఫ్ దేశాలు
గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న కోటి మంది భారతీయుల భద్రతపై ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా సౌదీ అరేబియా, యూఏఈ, ఇజ్రాయెల్ వంటి పలు దేశాల నేతలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. భారతీయులకు అండగా నిలుస్తున్న గల్ఫ్ దేశాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దేశీయంగా ఇంధన భారాన్ని తగ్గించేందుకు కేంద్రం ఇప్పటికే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని, పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) మౌలిక సదుపాయాలను వేగవంతం చేస్తున్నామని చెప్పారు.
జ్ఞాన భారతం - యువ శక్తి
దేశంలోని పురాతన తాళపత్ర గ్రంథాలు, రాగి రేకులు, ప్రాచీన రాతప్రతులను భద్రపరిచేందుకు చేపట్టిన ‘జ్ఞాన భారతం’ సర్వే గురించి మోదీ వివరించారు. అలాగే ‘మై భారత్’ (MY Bharat) ద్వారా లక్షలాది మంది యువత దేశ నిర్మాణంలో భాగస్వాములవుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. టీ20 వరల్డ్ కప్ విజయం, జమ్మూ కాశ్మీర్ రంజీ ట్రోఫీ గెలవడం వంటి క్రీడా విజయాలను ఆయన కొనియాడారు. ప్రజల ఆరోగ్యంపై ప్రధాని స్పందిస్తూ.. ఆహారంలో చక్కెర వాడకాన్ని తగ్గించాలని, వంట నూనె వినియోగాన్ని 10 శాతం మేర కోత విధించాలని ప్రధాని సూచించారు. జల సంరక్షణలో భాగంగా నిర్మించిన 70 వేల అమృత్ సరోవర్‌ల విజయాన్ని ఉదాహరిస్తూ, సుస్థిర భవిష్యత్తు కోసం దేశంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.


