చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నిలక పోరు తారాస్థాయికి చేరింది. తమిళగ వెట్రి కళగం(టీవీకే) తమ అభ్యర్థుల జాబితాను ఆదివారం విడుదల చేసింది. రెండు స్థానాల్లో టీవీకే చీఫ్ విజయ్ పోటీ చేయనున్నారు. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి విజయ్ బరిలోకి దిగనున్నారు. మొత్తం 234 స్థానాల్లో టీవీకే పోటీ చేయనుంది. విల్లివాక్కం నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అర్జున పోటీ చేయనున్నారు.
డీఎంకే, టీవీకే మధ్య ఎన్నికల పోరు ఉంటుందని విజయ్ అన్నారు. తమిళనాడులో వాలంటరీ వ్యవస్థను తీసుకొస్తామన్న విజయ్.. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లో వచ్చానని తెలిపారు. స్థానికులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఉంటుందని విజయ్ పేర్కొన్నారు.
టీవీకే పార్టీని స్థాపించిన తర్వాత విజయ్ ఎదుర్కోబోతున్న తొలి ఎన్నికల సమరమిది. పెరంబూరు, తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేయాలని విజయ్ నిర్ణయించడంతో ఆ నియోజకవర్గాలకు ప్రాధాన్యత ఏర్పడింది. తమిళగ వెట్రి కళగంతో తొలి సారిగా ఎన్నికలను ఎదుర్కొనేందుకు విజయ్ ఉరకలు తీస్తున్నారు. కేడర్‌ను బలోపేతం చేస్తూ, ప్రత్యేక కమిటీలను రంగంలోకి దించడమే కాకుండా, వ్యూహాలకు పదును పెడుతూ వస్తున్నారు.
అయితే, పెరంబూరు నుంచి ఎన్నికల ప్రచారానికి విజయ్ కార్యాచరణ సిద్ధం చేసుకోగా.. అనుమతి లభించలేదు. పెరంబూరులో తన ఎన్నికల ప్రచారానికి అధికారులు అనుమతి నిరాకరించడంపై విజయ్ అందులో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్‌ను స్వయంగా కలిసి ఫిర్యాదు పత్రం సమర్పించారు. తన ఫిర్యాదులో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. బ్యూరోక్రట్లు రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాడమే కాకుండా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ.. తమ ఉద్యోగు బాధ్యతలను విస్మరిస్తున్నారని ఆరోపించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థే ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు.



