రాజకీయ పార్టీలు బాధ్యతా
రాహిత్యమైన ప్రకటనలు చేయొద్దు
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు
నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు మొదటి దశ ప్రారంభం
నోయిడా/లక్నో: అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రజలంతా అంకితభావం, ఐక్యతతో పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మన దేశ ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని పునరుద్ఘాటించారు. రైతన్నల సంక్షేమమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. శనివారం ఉత్తరప్రదేశ్‌లోని జేవర్‌లో నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు మొదటి దశను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘వికసిత్ భారత్’లక్ష్య సాధనకు 140 కోట్ల మంది భారతీయుల ఉమ్మడి ప్రయత్నం, ఐక్యత అవసరమని స్పష్టంచేశారు.
సమయాన్ని ఆదా చేయడం, ఖర్చులను తగ్గించడం ద్వారా పౌరుల జీవనాన్ని సౌకర్యవంతంగా మార్చడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని నొక్కిచెప్పారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయని, అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయని గుర్తుచేశారు. ఈ సంక్షోభాన్ని ప్రశాంతంగా, సహనంతో, ఐక్యంగా ఎదుర్కోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సంక్షోభ సమయంలో మనదేశ ప్రయోజనాలకే పెద్దపీట వేయాలని, అదే మన గొప్ప బలమని తేల్చిచెప్పారు.
ప్రజలపై భారం పడకుండా చర్యలు
‘‘పశ్చిమాసియా పరిణామాలు, మన దేశంలో పరిస్థితులపై పార్లమెంట్‌లో విస్తృతంగా చర్చించాం. ముఖ్యమంత్రులతో జరిగిన భేటీలోనూ దీనిపై సానుకూలమైన సంప్రదింపులు జరిపాం. ఈ సంక్షోభ సమయంలో రాజకీయ పార్టీలు బాధ్యతారాహిత్యమైన ప్రకటనలకు దూరంగా ఉండాలి. కోవిడ్–19 మహమ్మారి సమయంలో తప్పుడు ప్రచారం చేసినవారిని ఎన్నికల్లో జనం తిరస్కరించారని గుర్తుపెట్టుకోవాలి. పశ్చిమాసియా యుద్ధం వల్ల తలెత్తిన సవాళ్లను భారత్ పూర్తి సామర్థ్యంతో ఎదుర్కొంటోంది. చమురు, గ్యాస్ ధరల భారం ప్రజలపై పడకుండా ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టింది. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది’’అని ప్రధాని మోదీ అన్నారు.
ఇప్పుడు ప్రారంభోత్సవం పూర్తయ్యింది
నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవంలో ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. యూపీలోని గౌతమబుద్ధ నగర్ జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహించారు. వేలాది మంది జనం పాల్గొన్నారు. వారి చేతుల మీదుగానే ప్రారంభోత్సవం పూర్తయ్యింది. అది ఎలా అంటే.. సభలో జనవాహినితో మోదీ సంభాíÙంచారు. భారత్ మాతాకీ జై అంటూ నినదించగా, జనం అదే రీతిలో ప్రతిస్పందించారు. ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం పూర్తయ్యిందా? అని మోదీ ప్రశ్నించగా, అవునంటూ బదులిచ్చారు.
‘‘లేదు.. సగం మాత్రమే పూర్తయ్యింది. నేను ఇక్కడ శిలాఫలకం మాత్రమే ఆవిష్కరించా. మిగతా కార్యక్రమం మీరే పూర్తిచేయాలి. మీ మొబైల్ ఫోన్లలో ఫ్లాష్‌లైట్ వెలిగించండి. అలా చేస్తే మీలో ప్రతి ఒక్కరూ ఎయిర్‌పోర్టును స్వయంగా ప్రారంభించినట్లే’’అని ప్రధానమంత్రి సూచించగానే ప్రజలు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. వెంటనే తమ మొబైల్ ఫోన్లలో ఫ్లాష్‌లైట్ ఆన్ చేశారు. మోదీ చిరునవ్వు చిందిస్తూ ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం ఇప్పుడు పూర్తయ్యిందని ప్రకటించారు.


