సొంత వాహనం పక్కన పెట్టండి.. మెట్రో ఎక్కండి! | Hyderabad Metro Sees Surge In Passengers Amid Summer Heat And Fuel Shortages, More Details Inside | Sakshi
Sakshi News home page

సొంత వాహనం పక్కన పెట్టండి.. మెట్రో ఎక్కండి!

Mar 29 2026 12:13 PM | Updated on Mar 29 2026 1:22 PM

Metro Travel Rises Amid Heat And Fuel Issues

సాక్షి, హైదరాబాద్‌: మెట్రో రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఒకవైపు వేసవి, మరోవైపు పెట్రోల్, డీజిల్‌ కొరత. దీంతో చాలామంది సొంత వాహనాలను తాత్కాలికంగా పక్కన పెట్టి మెట్రోల్లో ప్రయాణం చేస్తున్నారు. సాధారణ రోజుల్లో కంటే ప్రయాణికుల సంఖ్య పెరిగింది. వారం క్రితం రోజుకు  4.5 లక్షల మంది ప్రయాణం చేయగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 4.7 లక్షల నుంచి 4.85 లక్షలకు పెరిగినట్లు అధికారులు  అంచనా వేస్తున్నారు. పశి్చమాసియా యుద్ధం కారణంగా కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్‌  అమ్మకాలపై నెలకొన్న అనిశ్చితి, రెండు రోజులుగా అకస్మాత్తుగా బంకుల్లో రద్దీ వంటి పరిణామాల కారణంగా మెట్రో రైళ్లకు డిమాండ్‌ పెరిగింది.  

కొత్త కోచ్‌లకు బ్రేక్‌.. 
 ⇒ ఉద్యోగులు, విద్యార్ధులు, ఐటీ నిపుణులు ఇతర వర్గాల చెందిన ప్రయాణికులు సమ్మర్‌ హీట్‌ బారిన పడకుండా ఉండేందుకు మెట్రో రైళ్లను  ఆశ్రయిస్తున్నారు. నాగోల్‌ నుంచి అమీర్‌పేట్, ఎల్‌బీనగర్‌ నుంచి మియాపూర్‌ కారిడార్‌లతో పాటు జేబీఎస్‌– ఎంజీబీఎస్‌ కారిడార్‌లోనూ ప్రయాణికుల రద్దీ పెరిగినట్లు అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో  మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్, మే నెలల్లో ప్రతిరోజు సుమారు 5 లక్షల మందికి పైగా మెట్రోల్లో ప్రయాణం చేసే అవకాశం ఉంది. కాగా.. ప్రయాణికుల డిమాండ్‌ మేరకు కోచ్‌ల సంఖ్య పెరగడం లేదు. 

  ⇒ ప్రస్తుతం నగరంలోని మూడు కారిడార్‌లలో ప్రతి రోజు సుమారు  1000 ట్రిప్పులు  తిరుగుతున్నాయి. ప్రతి  3 నుంచి 5 నిమిషాలకు ఒకటి చొప్పున మెట్రో అందుబాటులో ఉన్నప్పటికీ ప్రయాణికులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. అన్ని మెట్రో రైళ్లకు  కేవలం 3 బోగీలే ఉండడంతో ఈ పరిస్థితి నెలకొంది. అదనంగా మరో 3 బోగీలను ఏర్పాటు చేయాలని రెండేళ్ల క్రితం భావించారు. ఈ క్రమంలో ఎల్‌అండ్‌టీ సంస్థ హైదరాబాద్‌ మెట్రో రైల్‌ నుంచి వైదొలగాలని నిర్ణయించుకోవడంతో కొత్త కోచ్‌ల కొనుగోలుకు బ్రేక్‌ పడింది. అరకొర కోచ్‌లతో ప్రయాణికులకు ఇబ్బందులు ఇప్పట్లో తప్పేలే లేవు.     

Advertisement
 
Advertisement
Advertisement